Home తాజా వార్తలు టిఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల గుండె చప్పుడు: ఎమ్మెల్సీ కవిత

టిఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల గుండె చప్పుడు: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha visits construction work of trs party office

 

నిజామాబాద్ : తెలంగాణ ప్రజల గుండెచప్పుడు టిఆర్‌ఎస్ పార్టీ అని ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె టిఆర్‌ఎస్ పార్టీ నూతన కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దేశవ్యాప్తంగా తెలియజేస్తూ, నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నామన్నారు. ప్రజల ఆశీస్సులతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్, తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టిఆర్‌ఎస్ కార్యాలయాలు నిర్మితమవుతున్నాయని, కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటామన్నారు.

కార్యాలయాల్లో ఉండే సిబ్బంది, ఇన్సూరెన్స్ లాంటి అనేక అంశాల్లో కార్యకర్తలకు సహాయ, సహకారాలు అందిస్తారని పేర్కొన్నారు. దేశంలోనే బలమైన ప్రాంతీయ పార్టీగా టిఆర్‌ఎస్ నిలిచిందన్నారు. ఉదయం క్యాంపు కార్యాలయంలో అనేక మంది కార్యకర్తలు, ప్రజలు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఎంఎల్ సి కవితను కలిశారు. నిజామాబాద్ రూరల్, బోర్గాం పి గ్రామంలో ఎంఎల్ సి బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి ఎంఎల్ సి కవిత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం కార్పొరేటర్లు ఉమారాణి, సాయిరాం, జర్నలిస్టు బాలులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు.

అన్నదానం అభినందనీయం…
నిజామాబాద్ అర్బన్ ఎంఎల్ఎ బిగాల గణేష్ గుప్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత భోజన వితరణ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. అన్నదానం ఎంతో మందికి ఉపయోగకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గణేష్ గుప్త, బాజిరెడ్డి గోవర్ధన్, మేయర్ నీతూ కిరణ్, మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి, కార్పొరేటర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులున్నారు.

MLC Kavitha visits construction work of trs party office in nizamabad