Home ఖమ్మం తెలంగాణకు కాళేశ్వరం జీవనాడి: పల్లా రాజేశ్వరరెడ్డి

తెలంగాణకు కాళేశ్వరం జీవనాడి: పల్లా రాజేశ్వరరెడ్డి

Palla Rajeshwar Reddy

 

మన తెలంగాణ/ఖమ్మం: కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనాడిగా నిలిచిపోనుందని శాసనమండలి సభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని వీడీఓస్ కాలనీలో గల ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టును ఈనెల 21న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, పడ్నవిస్‌ల సమక్షంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా మొదటి పంటకు రాష్ట్రంలోని 45 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లాలో రూ.13వేల కోట్లతో నిర్మించనున్న సీతారామ ప్రాజెక్టును కూడా వేగవంతంగా పూర్తి చేసి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని సుమారుగా 10 లక్షల ఎకరాలకు పైగా సాగు నీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాల మాగాణికి సాగు నీరు అందించాలనే లక్ష్యంతో సిఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు.

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు కృషి చేస్తున్న తీరు నచ్చిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజలు ఇటీవల జరిగిన సర్పంచ్, పార్లమెంట్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలల్లో ఆత్మ విశ్వాసంతో పట్టం కట్టారన్నారు. ఖమ్మం పార్లమెంట్ సభ్యునిగా విజయం సాధించిన నామా నాగేశ్వరరావును టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపిక చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలనే లక్షంతో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రాజెక్టులే కాకుండా మిషన్ భగీరథతో పాటు ఇతర సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందిస్తూ ఆదుకుంటున్నామని చెప్పారు. సాగు నీరు లేక తెలంగాణ ప్రాంతం కరువుతో అల్లాడుతూ విద్యుత్ లేక ఇబ్బందులు పడ్డ ప్రజలను అన్ని విధాల ఆదుకోవాలనే కేసీఆర్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పరితపిస్తుందన్నారు. గోదావరి నీటిని ఎత్తిపోసి ఈ ప్రాంత రైతాంగానికి సాగు నీరు అందిస్తామన్నారు. ప్రాణాహిత, చేవెళ్ల, కొండ పోచమ్మ, మేడిగడ్డ తదితర ప్రాంతాల్లో గోదావరి నీటిని ఒడిసిపట్టి సాగు నీరు అందిస్తామన్నారు. ప్రాజెక్టుల అభివృద్ధికి టీఆర్‌ఎస్ చేస్తున్న కృషిని ఒర్వలేక అ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క లాంటి వారు కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బందులు పెట్టడంతో పాటు విమర్శలు చేయటం తగదన్నారు. మరుగుజ్జు నాయకులను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరని, ప్రతి ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సంచులు మోసి రాజకీయాలు చేసిన చరిత్ర హీనులను తెలంగాణ ప్రజలు సహించరన్నారు. ప్రజలకు న్యాయం చేయాలనే ప్రధాన లక్షంతో ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని చెప్పారు. భట్టి మతి స్థిమితం కొల్పొయి అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. ఇప్పటికైన కాంగ్రెస్ నాయకులు తాము చేస్తున్న అభివృద్ధిని స్వాగతించాలని హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో ఖమ్మం నియోజకవర్గ శాసనసభ్యులు పువ్వాడ అజయ్‌కుమార్, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మి నారాయణ, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, ఖమ్మం నగరపాలక సంస్థ కార్పొరేటర్లు కమర్తపు మురళి, చావా నారాయణరావు, మందడపు మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

MLC Palla Rajeswar Reddy press meet in Khammam