Home ఎడిటోరియల్ సంపాదకీయం: యుపి వర్శిటీల్లో మొబైల్ నిషేధం!

సంపాదకీయం: యుపి వర్శిటీల్లో మొబైల్ నిషేధం!

Sampadakiyam

ఉత్తరప్రదేశ్‌లో విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో సెల్‌ఫోన్ వినియోగంపై నిషేధం విధించడాన్ని భిన్న వర్గాల వారు విభిన్న కోణాల్లో పరిగణించడం సహజం. విద్యార్థులలో అమిత క్రమ శిక్షణను, మెరుగైన విద్యార్జనను ఆశిస్తున్నామని భావించే వారు దీని వల్ల మేలు కలుగుతుందని అనుకోవచ్చు. సత్వర విజ్ఞాన వ్యాప్తిని కోరే వారు ఈ నిషేధాన్ని వ్యతిరేకించవచ్చు. అందివచ్చిన ఆధునిక సాంకేతిక సౌకర్యాల ద్వారా కొత్త కొత్త విషయాలను తెలుసుకొని బోధనా స్థలాల్లో పాఠ్యాంశాలపై మెరుగైన అవగాహనను ఏర్పరచుకోడాన్ని అభిలషించేవారు ఈ నిషేధాన్ని అంగీకరించలేరు. పాఠశాలల్లో సెల్‌ఫోన్ల నిషేధానికి కళాశాలలు, వర్శిటీలలో వాటి వినియోగంపై వేటుకు తేడా ఉంది. పరిణతి ఉండని వయసులోని పిల్లలు చదువుకొనే స్కూళ్లలో సెల్‌ఫోన్లు వద్దనడాన్ని అర్థం చేసుకోవచ్చు. మైనారిటీ తీరి బాధ్యతగల పౌరులుగా మారిన విద్యార్థులు చదువుకునే ఉన్నత విద్యా సంస్థల్లో సెల్‌ఫోన్ల నిషేధం అవసరమా అనే ప్రశ్నకు ఆస్కారం కలుగుతున్నది.

సాధారణంగా పాఠశాల విద్యార్థుల మొబైల్ వినియోగాన్ని ఆయా స్కూళ్ల యాజమాన్యాలు, ఉపాధ్యాయులే అనుమతించరు. ఇందుకు ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేకించి నిషేధపు ఉత్తర్వుల జారీ అవసరం కలగనే కలగదు. అయినా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో విద్యార్థుల సెల్‌ఫోన్ వినియోగంపై అధికారిక నిషేధం అమల్లో ఉంది. విశ్వవిద్యాలయ, కళాశాల విద్యార్థులకు మొబైల్ అందుబాటు వల్ల అనేక ప్రయోజనాలూ కలుగుతాయి. అధ్యాపకుల బోధనను, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వంటి విశిష్ఠ కార్యక్రమాలను విడియో రికార్డింగ్ చేసుకోడానికి, ఇ బుక్స్‌లోని కీలక అంశాలను తరగతి గదిలోనే డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోడానికి తదితర అనేక విజ్ఞానార్జన అవసరాలు సెల్‌ఫోన్ల వల్ల నెరవేరుతాయి. కళాశాల స్థాయికి చేరుకున్న విద్యార్థులను పరిణతి గల వయోజనులుగా గుర్తించడానికి సమాజం సిద్ధంగా లేకపోడమే ఉన్నత విద్యా సంస్థల్లో సెల్‌ఫోన్ వాడకాన్ని వ్యతిరేకించడానికి ప్రధాన కారణమనే అభిప్రాయాన్ని తోసిపుచ్చలేము.

సంప్రదాయ దృష్టిని తిరిగి మేల్కొలిపి పటిష్ఠం చేసే ఉద్దేశంతోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నిషేధాన్ని విధించిందనడాన్ని తప్పు పట్టలేము. సెల్‌ఫోన్లు లేనప్పుడే, వీధి బడిలో చదువుకున్నప్పుడే చదువు బాగా అబ్బేది అనే మాట తరచూ వింటుంటాం. శాస్త్ర సాంకేతిక విప్లవాల వల్ల అందుబాటులోకి వచ్చిన ఆధునిక పరికరాలను సద్వినియోగం చేసుకునే విద్యార్థుల్లో సృజన శక్తి పెరుగుతుంది. బట్టీ పట్టి చదివే రొడ్డ కొట్టుడు విద్యాభ్యసన పద్ధతికి బదులు లోతైన అవగాహనతో కూడిన చదువు అలవడుతుంది. దాని వల్ల అటువంటి విద్యార్థుల నుంచి సమాజానికి, దేశానికి మరింత మేలు కలుగుతుంది. కత్తిని నిత్య జీవనావసరాలకూ వినియోగించవచ్చు, దానితో హత్యలు కూడా చేయవచ్చు. కత్తి హింసాత్మకమైనదనే అభిప్రాయంతో దానిని నిషేధించగలమా? విద్యార్థులు సెల్‌ఫోన్లను దుర్వినియోగం చేసి వ్యసనపరులుగా, భ్రష్ఠులుగా మారే ప్రమాదం లేదని అనలేము. అటువంటివి చోటు చేసుకోకుండా వారిలో నైతిక దృష్టిని పెంచి, అవసరమైన నిఘా ఉంచేలా చూడవలసిన బాధ్యత ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలపై ఉంటుంది. లైట్లు ఆర్పివేయించి బ్లాక్ అవుట్ చేయడం యుద్ధ సమయంలో అవసరంగాని మామూలు వేళ అంధకారాన్ని సృష్టించడం, రుద్దడం ఎంత మాత్రం సమంజసం కాదు. సెల్ (స్మార్ట్) ఫోన్‌ల వల్లనే మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయనే వాదన సమంజసమైనది కాదనే అభిప్రాయాన్ని పలువురు విశ్వవిద్యాలయాల విద్యార్థినులు వ్యక్తం చేశారు.

అత్యాచారాల నిరోధానికి పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో నైతిక స్పృహ కలిగించడం, మహిళలను గౌరవించే దృష్టిని పెంచడం అవసరమని వారు భావిస్తున్నారు. మహిళల పట్ల సమాజం చూపు మారకుండా వారిపై జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను రూపు మాపలేమని బల్ల గుద్ది అమెరికాలో పాఠశాలల్లో ఊచకోత కాల్పులు జరిగే సందర్భాల్లో విద్యార్థుల వద్ద సెల్‌ఫోన్లు ఉండి ఉంటే ఆ సమాచారాన్ని వారు వెనువెంటనే బయటికి తెలియజేసి ఉండేవారనే వాదన వినవచ్చింది. వాస్తవానికి ఫ్లోరిడా పాఠశాలలో సంభవించిన అటువంటి ఒక దారుణ ఘటన సమయంలో అక్కడి విద్యార్థులు సెల్‌ఫోన్లను ఉపయోగించి తమ తలిదండ్రులకు ఆ సమాచారాన్ని తెలియజేయగలిగారు. యుపిలో మాదిరిగా కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో నిషేధం విధింపు ఆధునిక దృష్టిని ఎంత మాత్రం ప్రతిబింబించడం లేదు. సమాచార, విజ్ఞాన వాప్తికి తోడ్పడే సాధనాలపై నిషేధం కొనసాగితే అది మీడియా స్వేచ్ఛను కూడా హరించే ప్రమాదాన్ని దాపురింప చేస్తుంది.

 

Mobile phones use banned in UP universities College