Home లైఫ్ స్టైల్ మొబైల్ మరమ్మతులు.. ఇంటివద్దకే

మొబైల్ మరమ్మతులు.. ఇంటివద్దకే

స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు..ఇంట్లో కూర్చునే ఏ వస్తువునైనా గుమ్మంలోకి రావాల్సిందే.. బ్లేడు దగ్గర నుంచి ఫుడ్ వరకు ప్రతిదీ వాకిట్లోకి వచ్చేస్తుంది. మరి అలాంటి ఫోన్‌కే ఏదైనా సమస్య వస్తే.. సర్వీస్ సెంటర్ల చుట్టూ తిరగాలి. లేదంటే రిపేర్ చేసేవారి దగ్గరకి వెళ్లి చేయించుకోవాలి. ఈ బిజీ లైఫ్‌లో ఇది పెద్ద ప్రాసెస్. మరి ఫోన్ లేనిదే గడవని పరిస్థితి. ఇటువంటి సమస్యకు చెక్ పెట్టింది హైదరాబాద్‌కు చెందిన ఫిక్స్‌సెల్ స్టార్టప్.

Mobile-Repair

ఫోన్‌కు సంబంధించిన ఎటువంటి రిపేరైనా సరే ఇంటికి వచ్చి చేస్తున్నారు ఫిక్స్‌సెల్ నిర్వాహకులు. ఒకే ఒక్క కాల్ చేస్తే చాలు మీ ఫోన్‌ను మీ ముందే రిపేర్ చేస్తామంటున్నారు. స్క్రీన్ పగిలితే అరగంటలో కొత్తది వేసేస్తారు. స్పీకర్ల సమస్య వస్తే అక్కడికక్కడే సిద్ధం చేస్తారు. ఒకవేళ ఇతర సమస్యలు వస్తే టైం పడుతుందని ఫోన్‌ను యజమానికే ఇస్తారు టెక్నీషియన్లు. అతను గోడౌన్‌కు వెళ్లి సంబంధిత పరికరాన్ని తీసుకుని వచ్చి సమస్యను పరిష్కరిస్తాడు. సాఫ్ట్‌వేర్ సమస్యలుంటే టెస్ట్ కోసం ఒక రోజు వాళ్ల దగ్గర ఉంచుకుని పరీక్షిస్తారు. మర్నాడు సమస్య పరిష్కరించి తెచ్చిస్తారు. ఫోన్ డెడ్ అయితే సర్వీస్ చేయడం బదులు కొత్త ఫోన్ కొనడం మంచిదని చెబుతారు. డబ్బుల కోసం సర్వీస్ చేస్తున్నట్లు నటించరు. అదే వారిని మార్కెట్లో దూసుకుపోయేలా చేస్తోంది. అసలు ఈ ఆలోచన ఎవరికి ఎలా వచ్చిందంటే… వైజాగ్‌కు చెందిన అవినాష్ బీటెక్ చదివే రోజుల్లో మొబైల్ రిపేరుకు మార్కెట్లో గిరాకీ ఉన్నట్లు గుర్తించాడు. అంతే ఫేస్‌బుక్‌లో మొబైల్ రిపేర్ అనే పేజీని క్రియేట్ చేశాడు. అలా అతని దగ్గరకు వచ్చే ఫోన్‌ల సమస్యల్ని చక్కగా పరిష్కరించేవాడు. అలా పాకెట్‌మనీ సంపాదించుకునేవాడు. హైదరాబాద్‌కు వచ్చి తన బిజినెస్‌ను విస్తరించాలనుకున్నాడు. టీ హబ్‌లో టీఅప్ అనే స్టార్టప్ ఐడియా మేకర్ నేహతో కల్సి 2016 నవంబర్‌లో ‘ఫిక్స్‌సెల్’ అనే పేరుతో సంస్థను రిజిస్టర్ చేశారు. అనంతరం టీహబ్‌లో చేరారు.

అప్పుడే డిజిటల్ మార్కెట్‌పై పట్టున్న సందీప్ వీరితో కలిశాడు. మూడు నెలలపాటు వీరు మారెట్‌ను పరిశీలించారు. తయారీదారులు, నిపుణులు, వ్యాపారులతో మాట్లాడారు. ప్రస్తుతం దాదాపు 800 రకాల స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరి ఫోన్‌కి సమస్య ఉంది. నమ్మకమే పెట్టుబడిగా ఈ సంస్థ ముందుకు పోతోందని చెబుతున్నారు నిర్వాహకులు. స్టార్టప్‌ను డెవలప్ చేయడనికి మొదట్లో కొంత కష్టపడ్డారు. టీహబ్స్ వెంట తిరిగారు. బాలనగర్‌లో ఓ మొబైల్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్ నెలకొల్పారు. పదో క్లాసు ఫెయిల్ అయిన వారికి మొబైల్ రిపేరింగ్‌లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అంతలో టీహబ్‌లో బెస్ట్ స్టార్టప్‌గా ఎంపికైన ఫిక్స్‌సెల్ సంస్థకు ఐల్యాబ్స్‌లో ఉచితంగా స్థలం ఇచ్చారు. అక్కడున్న ఉద్యోగుల స్మార్ట్‌పోన్లను రిపేర్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 200 స్మార్ట్‌ఫోన్‌ల సమస్యలను విజయవంతంగా పరిష్కరించారు. అంతే వెనక్కు తిరిగి చూడలేదు. తమ సామర్థ్యంపై నమ్మకం వచ్చింది. మాసాబ్‌ట్యాంక్‌లో ఓ ఆఫీస్ తెరిచారు. సంస్థ వెబ్‌సైట్ చూసి కొందరు కాల్స్ చేసి వీరి సేవలను పొందేవారు. సేవల పొందిన వారు ఇతరులకు నెంబర్ ఇవ్వడంతో మరికొందరు స్పందించారు. తర్వాత ఎస్‌బీఐ ఇచ్చిన రుణంతో సంస్థను మరింత అభివృద్ధి చేశారు.

ఇంటర్నెల్ యాప్ : ఫోన్ మరమ్మతు చేయడానికి ఇంత ధర అవుతుందని ముందే కస్టమర్‌కి ఫోన్‌లో చెబుతారు. తీరా టెక్నీషియన్ వెళ్లాక కస్టమర్ ఇంటికి తాళం వేసి ఉంటే, లేరని ఓ ఫోటో తీసి ఇంటర్నెల యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఇలా ఎక్కడ ఏ టెక్నీషియన్ ఉన్నాడో పర్యవేక్షిస్తుందీ టీమ్. సీనియర్ సిటిజన్లు, బిజీగా ఉండే ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్థులు దగ్గర నుంచి వీరికి కాల్స్ వస్తుంటాయని అంటున్నాడు అవినాష్. ఫోన్ కంపెనీ, మోడల్‌ను బట్టి ఫిక్స్‌సెల్ చార్జ్ తీసుకుంటుంది.

ముందే సమస్య తెలుసుకుని దానికి సంబంధించిన కిట్‌తో టెక్నీషియన్‌ను కస్టమర్ ఇంటి వద్దకు పంపుతారు. సమస్య చెప్పలేకపోయినా వచ్చి తెలుసుకుని సేవలందిస్తారు. సాఫ్ట్‌వేర్ సమస్య ఉంటే మొదట డేటా కాపీ చేసి తీసుకెళ్లి మరుసటి రజు ఇంటి దగ్గరే అందిస్తారు. ప్రస్తుతం వీళ్లు హైదరాబాద్‌లో స్టాల్స్ నిర్వహిస్తూ, 40 శాతం మార్జిన్‌తో సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో దాదాపు 15 మంది వరకు టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. వెబ్‌సైట్ ద్వారా కస్టమర్ల నుంచి కాల్స్ అందుకుంటారు. ముందే కాల్ చేసి సర్వీస్‌కు అయ్యే ధరను చెప్తారు. రోజుకు సుమారు 15 వరకు కాల్స్‌ను వస్తాయని చెబుతున్నారు. వైజాగ్, విజయవాడల్లో బ్రాంచ్ పెట్టాలనే ఆలోచన ఉంది.

మల్లీశ్వరి వారణాసి