Home ఆంధ్రప్రదేశ్ వార్తలు మొద్దు శ్రీను హత్య కేసు నిందితుడు ఓం ప్రకాశ్ మృతి..

మొద్దు శ్రీను హత్య కేసు నిందితుడు ఓం ప్రకాశ్ మృతి..

Moddu Seenu murder case accused Om Prakash died

మనతెలంగాణ/హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పరిటాల రవి హత్యకేసులో కీలక నిందితుడు మొద్దు శ్రీను హత్య గావించిన ఓంప్రకాష్ సోమవారం తెల్లవారు జామున మృతి చెందాడు. విశాఖ ఆరిలోవలోని కేంద్ర కారాగారంలో ఉన్న ఓంప్రకాష్ కు శనివారం రాత్రి శ్వాస సమస్య వచ్చినట్లు జైలు సూపరింటెండెంట్ తెలిపారు. వెంటనే కెజిహెచ్ ఆస్పత్రికి తరలించామని చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున చనిపోయినట్లు సూపరింటెండెంట్ ప్రకటించారు. కాగా ఓంప్రకాష్ కు మూత్రపిండాలు చెడిపోవడం వల్ల చాలాకాలంగా డయాలసిస్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈక్రమంలో శుక్రవారం కూడా కెజిహెచ్‌లోనే డయాలసిస్ జరిగిందని చెప్పారు. డయాలసిస్ తర్వాత మళ్లీ జైలుకి తరలించిన క్రమంలో శనివారం మళ్లీ సమస్య రావడంతో ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడని అధికారులు తెలిపారు.

చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఓం ప్రకాశ్ ఓ లారీ చోరీ చేసిన కేసులో అనంతపురం జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో 2008 నవంబర్ 9న మొద్దు శ్రీనును బండరాయితో కొట్టి చంపాడు. తాను రామకోటి రాసుకుంటుండగా జైలు గదిలోని లైటును మొద్దు శీను ఆర్పేశాడని, ఆ కోపంతోనే అతన్ని హత్య చేసినట్టు ఆ తర్వాత మీడియాకు ఓంప్రకాశ్ తెలిపాడు. ఈ కేసులో అనంతపురం ఫాస్ట్ ట్రాక్ కోర్టు మొద్దు శ్రీనును చంపిన నేరం రుజువు కావటంతో 2016 నుంచి విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఓంప్రకాశ్ జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు జైలు వర్గాలు వెల్లడించాయి. ఇదిలావుండగా ఓం ప్రకాశ్ తల్లి సరోజనమ్మ కూడా అనారోగ్యంతో గత ఏప్రిల్ మృతిలో మృతిచెందారు.

Moddu Seenu murder case accused Om Prakash died