Home జాతీయ వార్తలు ఒకే మాట.. ఒకే బాట

ఒకే మాట.. ఒకే బాట

 

న్యూఢిల్లీ: భారత రాజకీయాలకు భారతీయ జనతా పార్టీని పరిచయం చేసింది అటల్ బిహారీ వాజపేయి అద్వానీ జోడీ. కానీ దేశ రాజకీయాల్లో బిజెపి సత్తాను చాటింది మాత్రం నరేంద్ర మోడీ అమిత్‌షా జోడీయే. వీరిద్దరూ ఆలోచనల్లో సయామీ కవలలాంటి వారు. ఒకేలా ఆలోచిస్తారు.. ఒకేలా ఆచరిస్తారు. ఆవగింజంత తేడా కూడా రాదు. వీరికి పార్టీ అవసరాలు, వ్యూహాలపై అపారమైన అవగాహన ఉంది. నిజానికి మోడీ, అమిత్ షాల మధ్య 14 ఏళ్ల వయసు తేడా ఉంది. ఎమర్జెన్సీ సమయంలో మోడీ అరెస్టయినప్పుడు షా పదేళ్ల కుర్రాడు. ఆ తర్వాత కొంత కాలానికి ఒక ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో వీరిద్దరూ తొలిసారి కలిశారు. అప్పటినుంచి ఇప్పటివరకు వీరిద్దరూ విడిపోయింది లేదు, అన్ని వేళలా కలిసికట్టుగా ప్రయాణం సాగిస్తూనే ఉన్నారు. ఏదయినా ఒక పార్టీ కొన్ని ప్రాథమిక సిద్ధాంతాల ఆధారంగా ఓట్లడుగుతుంది. అదే కోవలో బిజెపి కూడా జాతీయవాద, హిందుత్వ సిద్ధాంతాల ఆధారంగా ఓట్లడుగుతుంది.ఆర్‌ఎస్‌ఎస్ గొడుగు నీడలో ఆ పార్టీ ఎదిగింది. అందుకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలపై ఓట్లు వేసే ఓటర్లకు మోడీషాలు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తూనే వచ్చారు. అవకాశం దొరికినప్పుడల్లా హిందుత్వ, జాతీయ వాదాలకు మద్దతు ఇచ్చారు. ఎన్నికల్లో గెలవాలంటే అభివృద్ధిని మాత్రమే నమ్ముకుంటే పరిపోదు. సామాజిక సమీకరణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. గతంలో వాజపేయి వివిధ రంగాలను అభివృద్ధి చేసి ‘భారత్ వెలిగిపోతోంది’ అన్న నినాదం ఇచ్చారు. అయినా ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ వాస్త్తవాన్ని మోడీషాలు గమనించారు. అందుకే అభివృద్ధితో పాటుగా సోషల్ ఇంజనీరింగ్ కూడా ముఖ్యమనే విషయాన్ని గ్రహించారు. యుపి వంటి చోట్ల మోడీ ఒబిసి కార్డు అద్భుతంగా పని చేసింది. ఈ సారి ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అగ్రవర్ణాల ఓటు బ్యాంక్ స్పష్టంగా కనిపించింది. మోడీకి జనాన్ని ఎలా మంత్ర ముగ్ధులను చేయాలో తెలిస్తే అమిత్ షాకు వారిని తమవైపే ఉండేలా చేసేందుకు అవసరమైన వ్యూహాలు ఏమిటో తెలుసు. అందుకే షాను అపర చాణక్యుడిగా అభివర్ణిస్తుంటారు. అది గుజరాత్‌లో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటినుంచీ అనేక సందర్భాల్లో బయటపడుతూ వస్తూనే ఉంది. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షా ఆయన మంత్రివర్గంలో హోం మంత్రిగా ఉండేవారు.అదే సమయంలోనే గోద్రా తదనంతర పరిణామాలను చక్కబెట్టుకున్నారు. 2014లో తొలిసారిగా ఢిల్లీలో అధికారపగ్గాలు చేపట్టిన నాటినుంచి కూడా మోడీ నష్టాలకు వెరవకుండా సాహపోపేతమైన నిర్ణయాలు తీసుకునే నేతగా ప్రజల మనస్సుల్లో నిలిచిపోయారు. పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి అమలు లాంటి నిర్ణయాలు తాత్కాలికంగా సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నిర్ణయాలతో కొంత ప్రజా వ్యతిరేకత ఎదురైనా పాక్‌పై సర్జికల్ దాడుల రూపంలో ఆ నష్టాన్ని తొలగించుకోగలిగారు. ఈ దాడులతో మోడీని జనం డేరింగ్, డ్యాషింగ్, డైనమిక్ లీడర్‌గా చూడడం మొదలు పెట్టారు. ఇక అమిత్ షా విషయానికి వస్తే అంకిత భావంతో పని చేసే నాయకులను అందలమెక్కిస్తారనే ఇమేజ్ ఉంది. యుపిలో యోగి ఆదిత్యనాథ్, హర్యానాలో మనోహర్‌లాల్ ఖట్టర్,అసోంలో సోనోవాల్‌లను ముఖ్యమంత్రులను చేయడం ఈ కోవలోనివే.