Home జాతీయ వార్తలు రేపిస్టుల ఆటకట్టిస్తాం

రేపిస్టుల ఆటకట్టిస్తాం

Modi government act on rapist

చట్టాన్ని బలోపేతం చేస్తాం
కేరళకు సాయం ప్రశంసనీయం
రాఖీ పర్వదినాన మన్ కీ బాత్‌లో ప్రధాని

న్యూఢిల్లీ : అత్యాచారాలకు పాల్పడే వారిని సహించేది లేదని, ఇటువంటి వారిని దేశం క్షమించబోదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. మహిళలపై లైంగిక దాడుల నిరోధానికి తమ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకొంటొందని తెలిపారు. ఇటీవలే పార్లమెంట్‌లో దీనికి సంబంధించిన సమగ్రమైన చట్టాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించారు.ఈ చట్టంతో మహిళలు, బాలికలపై మరింత పటిష్టంగా నేరాలను అరికట్ట వచ్చునని ఆయన ఆదివాం తమ నెలవారి మన్‌కీబాత్ రేడియో కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో తెలిపారు.

ట్రిపుల్ తలాక్‌ను నిషేధించే బిల్లుకు ఈసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఆమోదం దక్కలేదని తెలిపారు. అయితే దీనితో ముస్లిం మహిళలు దిగులు చెందాల్సిన పనిలేదని, వారికి సామాజికన్యాయం దక్కేలా చేయడంలో దేశం యావత్తూ తోడుగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ దేశంలో మహిళల పట్ల ఎటువంటి అన్యాయాన్ని కూడా సభ్య సమాజం సహించబోదని, ఈ క్రమంలోనే అత్యాచారాలను నివారించేందుకు చట్ట ప్రకారం అన్ని చర్యలూ తీసుకుంటామని చెప్పారు. క్రిమినల్ యాక్ట్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించిందని చెప్పారు. దీని వల్ల అత్యాచార దోషులకు కఠిన శిక్షలకు వీలు కల్పించడం జరిగిందని వివరించారు. ప్రస్తుతం సవరించిన నిబంధనలతో అత్యాచారం కేసులలో దోషులకు కనీసం పది సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఇక 12 సంవత్సరాల లోపు బాలికలపై అత్యాచారాలకు పాల్పడ్డ వారికి మరణశిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు.

సామాజిక పరివర్తనంతోనే ఆర్థిక ప్రగతి
ట్రిపుల్ తలాక్ అంశం చాలా కీలకమైనదని, ఇది మహిళల సాధికారతతో ముడివడి ఉండే విషయం అని, సామాజిక మార్పు జరిగితేనే ఆర్థిక ప్రగతి పూర్తి స్థాయిలో దక్కుతుందని ప్రధాని తేల్చిచెప్పారు. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందింది. అయితే రాజ్యసభలో పెండింగ్‌లోనే ఉంది. ఇది నిజంగా ప్రతిష్టంభననే అయితే ముస్లిం మహిళలకు సామాజిక న్యాయం కల్పించడంలో దేశం అంతా తోడ్పాటును అందిస్తుందని తాము హామీ ఇస్తున్నట్లు ప్రధాని తెలిపారు.

కేరళకు సాయం ప్రశంసనీయం
కేరళ వరద బాధితులకు మానవతా దృక్పధంతో అందుతున్న సాయం ప్రశంసనీయం అని ప్రధాని మోడీ చెప్పారు. నెలవారి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు తమ ఔదార్యాన్ని పెద్ద మనసును మానవతా దృక్పథాన్ని చాటుకున్నారని తెలిపారు. ఇదే సమయంలో సైన్యం, వాయుదళం, నౌకాదళం, ఎన్‌డిఆర్‌ఎఫ్, బిఎస్‌ఎఫ్, ఆర్‌ఎఎఫ్‌లు సహాయక, రక్షణ చర్యలలో విశేష పాత్ర పోషించిందని ప్రధాని కితాబు ఇచ్చారు.

జమిలిపై చర్చ ఆరోగ్యకరం
దేశంలో జమిలి ఎన్నికల ప్రక్రియపై చర్చ మొదలు కావడం మంచిదే అని ప్రధాని తెలిపారు.ఇటువంటి చర్చ లు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆరోగ్యకర లక్షణం అన్నారు. తమ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇటువంటి చర్చ ఆరంభం కావడం దేశ రాజకీయ సంస్కృతిని మార్చేసిన మాజీ ప్రధాని వాజ్‌పేయీ వంటి గొప్ప నేతకు సరైన నివాళిగా తాము భావిస్తున్నామని తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీలకు ఏక కాల ఎన్నికల నిర్వహణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అదే విధంగా వివిధ స్థాయిలలో చర్చలు జరుగుతున్నాయని, పలు కోణాలలో అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని వివరించారు. జమిలిపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు తమ వైఖరిని తెలియచేస్తున్నాయని, ఇది మన ప్రజాస్వామ్యానికి మంచి పరిణామమని ప్రధాని తెలిపారు. ఏదైనా కీలక అంశంపై నిర్మొహమాటంగా చర్చ జరిగితే, ప్రత్యేకించి ప్రజాస్వామిక ప్రక్రియలోని మౌలిక అంశంపై అంతా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తే అది, ప్రజాస్వామిక ప్రక్రియను పటిష్టం చేసినట్లే అవుతుందని అన్నారు.