Thursday, March 28, 2024

‘ఆమ్నెస్టీ’ తలుపులు మూసిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

మన దేశలో ఆమ్నెస్టీ ఇండియా ఇంటర్నేషనల్ 2012లో మొదలైంది. బెంగళూరు కేంద్రంగా దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దేశంలో సుమారు 40 లక్షల మంది పౌరుల మద్దతు దీనికుందని గత ఎనిమిదేళ్లుగా సుమారు లక్ష మంది దాకా సంస్థను ఆర్థికంగా ఆదుకుంటున్నారని దీని వెబ్‌సైట్‌లో ఉంది. అయితే ఎలాంటి సమాచార మీయకుండా భారత ప్రభుత్వం ఆమ్నెస్టీ ఇండియాకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను ఈ సెప్టెంబర్ 10వ తేదీ నుండి స్తంభింపచేసింది. విదేశీ నిధుల సేకరణలో భారత చట్టాలను అతిక్రమించిందని దేశంలో ఆర్థిక నేరాల విచారణ సంస్థ అయిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆదేశాల మేరకు బ్యాంకు ఖాతాలు నిలిచి పోయాయి. సెప్టెంబర్ చివరలో ఆ సంస్థ మన దేశంలో అన్ని కార్యకలాపాలను నిలిపివేసింది.

Modi Govt Closed Amnesty international

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక స్వచ్ఛంద సంస్థ. మానవ హక్కుల పరిరక్షణపై గళమెత్తడమే దాని ధ్యేయం. ప్రపంచంలోని చాలా దేశాలు ఆమ్నెస్టీ నివేదికలను గౌరవిస్తాయి. శాంతియుతంగా సాగే దీని నిరసనలను ఎన్నో దేశాలు అడ్డు చెప్పవు.
విశ్వ వ్యాప్తంగా సుమారు 150 దేశాల్లో 46 లక్షల మంది విచారణ ఖైదీలు దీనావస్థలో ఉన్నారని తెలిసిన క్షణం పీటర్ బెనెన్‌సన్ మనసు విలవిలలాడింది. బెనెన్‌సన్ ఇంగ్లాండులో న్యాయవాది. ముందుగా ఆయన ఈ సమస్యపై కొంత సమాచారం సేకరించి పత్రికలకు వ్యాసాలు రాశాడు. రాజకీయ, మతపర కక్షతో, కసితో అమానవీయంగా దేశ పౌరులను జైళ్లలో వేసి హింసించడం, అక్రమ కేసులు బనాయించి వారి బతుకులు బుగ్గి చేయడం అంగీకార యోగ్యం కాదు. కొన్ని లక్షల మంది ఇలా జైళ్లలో ఉన్నారు. రోజురోజుకూ వారి సంఖ్య పెరిగిపోతోందని ఆయన రాశారు. ఇదంతా 1961లో జరిగిన విషయం.
అదే సంవత్సరం ‘అప్పీల్ ఫర్ ఆమ్నెస్టీ’ పేరిట ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి ఖైదీల సమాచారం, అవగాహన కలిగేలా కరపత్రాన్ని విడుదల చేశాడు. భావ స్వేచ్ఛను, మత స్వేచ్ఛను కాపాడేందుకు అంతర్జాతీయ స్థాయిలో ఓ శాశ్వత వేదిక ఉండాలని ఆయన అభిలషించారు. చాలా పత్రికలు ఆయన ఉద్దేశానికి ప్రాచుర్యం ఇచ్చాయి. ఆ క్రమంలో 1961లోనే ప్రపంచ మానవ హక్కుల దినమైన అక్టోబర్ 12న పీటర్ బెనెన్‌సన్ తన చాంబర్‌నే ఆమ్నెస్టీ ఆఫీసుగా మార్చి వేశాడు.
అలా మొదలైన ‘ఆమ్నెస్టీ ’ ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న విచారణ ఖైదీల విడుదల కోసం ఎంతో కృషి చేసింది. దేశ దేశాల్లో శాఖలు తెరచి స్వేచ్ఛా కాముకుల మద్దతుతో ఆయా దేశాల మానవ హక్కుల ఉల్లంఘనలను బయట పెడుతూ నివేదికలను ప్రభుత్వాలకు సమర్పించింది. అవసరమైన చోట వీధుల్లో ఆందోళనలు చేపట్టింది. ప్రభుత్వాలు మెచ్చినా, నొచ్చుకున్నా ఆమ్నెస్టీ కార్యక్రమాలన్నీ దేశ చట్టాల పరిధిలో శాంతియుతంగానే సాగుతాయి. దీని కృషికి గుర్తుగా 1977లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌కు నోబెల్ శాంతి బహుమతి లభించింది. పీటర్ బెనెన్‌సన్ 2005లో మరణించినా వివిధ దేశాల్లో ఆమ్నెస్టీ శాఖలు ముందుకు సాగుతున్నాయి. ఆమ్నెస్టీ సంస్థ లోగోగా ఇనుప కంచె తీగలో బందీగా ఉన్న కొవ్వొత్తి గుర్తు ఉంటుంది. చీకటిని తిట్టుకుంటూ కూర్చొనే బదులు చిన్న దీపాన్ని వెలిగించు అనే చైనా సామెత దీనికి ఆధారం.
మన దేశలో ఆమ్నెస్టీ ఇండియా ఇంటర్నేషనల్ 2012లో మొదలైంది. బెంగళూరు కేంద్రంగా దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దేశంలో సుమారు 40 లక్షల మంది పౌరుల మద్దతు దీనికుందని గత ఎనిమిదేళ్లుగా సుమారు లక్ష మంది దాకా సంస్థను ఆర్థికంగా ఆదుకుంటున్నారని దీని వెబ్‌సైట్‌లో ఉంది.
అయితే ఎలాంటి సమాచార మీయకుండా భారత ప్రభుత్వం ఆమ్నెస్టీ ఇండియాకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను ఈ సెప్టెంబర్ 10వ తేదీ నుండి స్తంభింపచేసింది. విదేశీ నిధుల సేకరణలో భారత చట్టాలను అతిక్రమించిందని దేశంలో ఆర్థిక నేరాల విచారణ సంస్థ అయిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆదేశాల మేరకు బ్యాంకు ఖాతాలు నిలిచి పోయాయి. సెప్టెంబర్ చివరలో ఆ సంస్థ మన దేశంలో అన్ని కార్యకలాపాలను నిలిపివేసింది. సుమారు 150 మంది మన దేశంలోని ఆ ఉద్యోగులు రోడ్డున పడ్డారు.
విదేశీ నిధుల అవసరం తమకు లేదని, ఇండియాలో తగిన ఆర్థిక సహకారం ఈ దేశీయుల నుండే లభిస్తున్నదని, దేశ చట్టాల ఉల్లంఘనకు సంబంధించిన ఎలాంటి రుజువులను చూయించకుండా ఏకపక్షంగా నిర్ణయం ఉండడం వల్ల తాము ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని సంస్థ బాధ్యులు ప్రకటించారు.
ఆగస్టు, 2016లో తొలిసారిగా ఆమ్నెస్టీ కార్యాలయాలపై దాడి మొదలైంది. కశ్మీర్‌లో ఏడాదిగా భద్రతా దళాలు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని ఈ సంస్థ విడుదల చేసిన నివేదికపై మండిపడిన ఎబివిపి కార్యకర్తలు బెంగళూరులోని దీని కార్యాలయ భవనంపై పెట్రోలు సీసాలతో దాడి చేశారు. పోలీసులు వీరి చర్యను అడ్డుకోవడంతో కొందరికి గాయాలు కూడా అయ్యాయి. ఇదే సందర్భంగా ఢిల్లీలో కూడా సంస్థకు వ్యతిరేకంగా ఓ నిరసన ప్రదర్శన జరిగింది.
ఆనాటి నుండి కేంద్ర ప్రభుత్వం ఆమ్నెస్టీ పై శీతకన్ను వేసింది. దీని కార్యకలాపాలు ప్రభుత్వానికి కంటగింపుగా తయారయ్యాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను రంగంలోకి దించింది. అక్టోబర్ 2018లో ఇడి ఆఫీసు గేటులకు తాళం వేసి 10 గంటల పాటు సోదా చేసింది. అదే సమయంలో డైరెక్టర్ నివాసంలో కూడా సోదా జరిగింది. నిధుల రాక, వాటి వినియోగం లక్షంగా ఈ సోదాలు జరిగాయి.
ఈ మధ్యకాలంలో ఆమ్నెస్టీ రెండు నివేదికల్ని విడుదల చేసింది. వీటిలో ఒకటి జమ్ముకశ్మీర్‌లో మానవ హక్కులపై పెట్టిన ఆంక్షలపై కాగా మరోటి డిసెంబర్ 2019లో ఢిల్లీ జరిగిన అల్లర్లలో పోలీసుల హక్కుల అతిక్రమణపై వచ్చాయి. ఈ రెండింటిలో కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను, మతపర స్వేచ్ఛను కాలరాస్తోందని ఆ సంస్థ పేర్కొంది. దీంతో దేశంలో ఆమ్నెస్టీ మనుగడ ప్రశ్నార్థకమైంది. ఆదాయ పన్ను శాఖ ఈ సంస్థకు విరాళాలిచ్చే వారికి నోటీసులు పంపడం మొదలు పెట్టింది. వారి ఆదాయ ధ్రువీకరణలో ఎలాంటి తప్పిదం లేకున్నా విచారణ ఎదుర్కొనే పరిస్థితి రావడంతో దాతలు సంస్థకు దూరమయ్యారు.
ఆమ్నెస్టీ కార్యకలాపాలపై హద్దులు పెరిగాయి. జూన్ 2019లో ‘లా లెస్‌లా’ అనే రిపోర్టును విడుదల చేయడానికి ప్రెస్ కాన్ఫరెన్సుకు అనుమతి నిరాకరించడం జరిగింది. ఇడి విధి నిర్వహణలో భాగం చేసిన విచారణకు, చర్యలకు ఆమ్నెస్టీ దేశంలో తమ కార్యకలాపాలు ఆపివేయడం పట్ల కేంద్ర హోం శాఖ విస్మయం ప్రకటించింది.
సీనియర్ జర్నలిస్టు, ఆకార్ పటేల్ ఆమ్నెస్టీ భారత్ శాఖకు 2018 దాకా సుమారు ఆరేళ్లపాటు డైరెక్టర్‌గా పని చేశారు. ప్రస్తుతం రజత్ ఖోస్లా సీనియర్ డైరెక్టర్‌గా సంస్థ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం మా చిన్న చిన్న కార్యకలాపాలు సైతం రుచించక, మా ప్రశ్నలకు జవాబు చెప్పలేక ప్రభుత్వం దాడుల ద్వారా మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నదని రజత్ ఖోస్లా ప్రకటించారు. 2009లో ఆమ్నెస్టీ విదేశీ నిధుల సేకరణపై కేంద్రం అనుమతి నిరాకరించడంతో కేవలం దేశీయ విరాళాపైనే ఇది ఆధారపడి నడుస్తోంది. ఇప్పుడు చట్టాల అతిక్రమణ ద్వారా విదేశీ నిధులు రాబట్టు కొంటోందని ప్రభుత్వం ఆరోపణ. అలాంటిదేదైనా ఉంటే రుజువులతో నిరూపిస్తే తాము దేనికైనా సిద్ధమని ఆమ్నెస్టీ అంటోంది. ప్రభుత్వ విధానాల విమర్శకు తట్టుకోలేక నిరాధార ఆరోపణలతో, దాడులతో, బెదిరింపులతో ఆమ్నెస్టీ అడ్డుకోవడం దేశంలో పౌర హక్కులను ప్రభుత్వాలు కాలరాయడంతోపాటు, ఆ చర్యలను చీకటిలో ఉంచే ప్రయత్నంగా భావించబడుతోంది.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News