Home ఎడిటోరియల్ ఇక 371 వంతు వస్తుందా?

ఇక 371 వంతు వస్తుందా?

Cartoon

 

కేంద్ర ప్రభుత్వం అధికరణ 370 రద్దు చేసింది. ఈ అధికరణ జమ్మూ కశ్మీరు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తున్న అధికరణ. కాని అధికరణ 370 రద్దు తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో భయాందోళనలు ప్రారంభమయ్యాయి. రాజ్యాంగంలోని అధికరణ 371 క్రింద ఈశాన్య రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాలకు ప్రత్యేక సదుపాయాలున్నాయి. కశ్మీరు విషయంలో తీసుకున్న నిర్ణయం తర్వాత ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక హోదాలు కూడా రద్దవుతాయనే భయాలు వ్యాపించాయి.

మిజోరం మాజీ ముఖ్యమంత్రి లాల్ థాంవాలా జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు చేయడం గురించి ట్వీట్ చేస్తూ, జమ్మూ కశ్మీరులో సంఘటనలు ఈశాన్య రాష్ట్ర ప్రజలకు రెడ్ అలర్ట్ వంటివని అన్నారు. ముఖ్యంగా నాగాలాండ్‌లో ఈ భయాలు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాగాలాండ్‌లో ఈ భయాందోళనలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే, ఇటీవల నాగాలాండ్ గవర్నర్‌గా నియమించబడిన ఆర్‌ఎన్ రవి ఈ విషయమై భరోసా ఇస్తూ, నాగాలాండ్‌కు సంబంధించిన అధికరణ 371ఎ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని, భయాందోళనలు వద్దని అన్నారు. నాగాలాండ్ కు 371ఎ అధికరణలో ఇచ్చిన సదుపాయాలు పవిత్రమైన హామీలని కూడా చెప్పారు.

అధికరణ 371 క్రింద ఉన్న అంశాలన్నీ ఈశాన్య రాష్ట్రాల ఆదివాసీ తెగలు, సముదాయాలు, అక్కడి సంస్కృతుల పరిరక్షణకు ఇచ్చిన హామీలు. ఈ హామీలు పరిపాలన వికేంద్రీకరణకు దోహదపడతాయి. ఈ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కొంతస్థాయి వరకు లభిస్తుంది. స్థానిక సంప్రదాయిక చట్టాల ద్వారా వివాదాల పరిష్కారానికి అవకాశాలు కల్పించే నిబంధనలివి. ఇందులో కొన్ని చట్టాలు భూ హక్కుల బదలాయింపుపై ఆంక్షలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. సంబంధిత రాష్ట్రానికి చెందని ప్రజలెవరు అక్కడ భూములు కొనలేరు. ఇవి ముఖ్యంగా మిజోరం, నాగాలాండ్, అస్సాంలోని కొని ప్రాంతాలు, మణిపూర్, మేఘాలయ ప్రాంతాలకు చెందిన చట్టాలు.

ఈ సదుపాయాలు అన్ని రాష్ట్రాలకు ఒకేలా లేవు. ఉదాహరణకు అధికరణ 371ఎ నాగాలాండ్ కు సంబంధించింది. ఈ అధికరణ వల్ల నాగాలాండ్ రాష్ట్రానికి చెప్పుకోదగ్గ రాజకీయ స్వయం ప్రతిపత్తి లభించింది. భారత పార్లమెంటు చేసే ఏ చట్టమైనా సరే అది నాగాలాండ్‌లోని ప్రజల ధార్మిక, సామాజిక కట్టుబాట్లలో జోక్యం చేసుకునే చట్టమైతే నాగాలాండ్‌లో అమలు చేయడం సాధ్యపడదు. నాగాలాండ్ శాసనసభ ఆ చట్టాన్ని ఆమోదించకపోతే అమలు చేయలేరు. కాగా మణిపూర్ కు సంబంధించి అధికరణ 371 సి ఉంది. అయితే మణిపూర్ మొత్తం రాష్ట్రానికి వర్తించదు. మణిపూర్ లోని కొండప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది. కొండప్రాంతాలలోని జిల్లా కౌన్సిళ్ళకు కొన్ని అధికారాలు ఇస్తుంది.

ఇప్పుడు నాగా నేషనలిస్ట్ గ్రూపులు కేంద్ర ప్రభుత్వాన్ని మరింత స్వయంప్రతిపత్తి డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్వతంత్ర నాగా రాజ్యం కోసం సాయుధ పోరాట దశాబ్దాలు కొనసాగింది. చివరకు శాంతి ఒప్పందం కుదిరింది. ఈ శాంతి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరించిన రవి ఇప్పుడు రాష్ట్రానికి గవర్నరుగా ఉన్నారు. నాగా స్టూడెంట్స్ ఫెడరేషన్ కు చెందిన నినోటో అవోమీ మాట్లాడుతూ ప్రతి నాగా వ్యక్తి ఇప్పుడు అనుమానిస్తున్నాడని, నాగాలకు ప్రత్యేకమైన రాజకీయ చరిత్ర ఉందని, అధికరణ 371 ఏ కన్నా మెరుగైన అధికారాల కోసం చర్చలు జరుగుతున్నాయని అన్నాడు. ఈ రాజకీయ చర్చల మధ్యలో భారత ప్రభుత్వం అధికరణ 371ఎ రద్దు చేయడం వంటి నిర్ణయం తీసుకుంటే అంతకన్నా హ్రస్వ దృష్టి మరేదీ ఉండదని అన్నాడు. పార్లమెంటులో బిజెపికి తిరుగులేని మెజారిటీ ఉండడం కూడా ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో భయాందోళనలను పెంచుతోంది. ఇలాంటి మెజారిటీ ఉంటే వారికి ఇష్టం వచ్చింది ఏదైనా చేయగలరని నాగాలాండ్‌లో ఆదివాసీ సంస్థల కూటమి నాగా హోహో అధ్యక్షుడు పి. చుబా ఓజుకుం అన్నాడు. మైనారిటీల గురించి వాళ్ళు ఆలోచించడం లేదని చెప్పాడు.

నాగాలాండ్‌కు సంబంధించి అధికరణ 371 రద్దు చేసే ఎలాంటి ప్రయత్నమైనా సరే తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరించాడు. అలాంటి ప్రయత్నాలు నాగా ప్రజలకు మాత్రమే కాదు, భారత ప్రభుత్వానికి కూడా నష్టంగా మారుతాయి అన్నాడు. నాగాలాండ్‌లో ప్రధాన ప్రతిపక్షం నాగా పీపుల్స్ ఫ్రంట్ కు చెందిన అచుంబెమో కికోన్ మాట్లాడుతూ కశ్మీరు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా, కశ్మీరు విషయంలో వ్యవహరించిన తీరుతో అనుమానాలు పెరిగాయని, అయితే నాగాలాండ్ ప్రత్యేక సదుపాయాలను రద్దు చేసే ధైర్యం వారికి లేదని అన్నాడు. ఈశాన్య రాష్ట్రాల్లో మిగిలిన రాష్ట్రాల్లో నాగాలాండ్ మాదిరి అనుమానాలు కనిపించడం లేదు. మిజోరంలో మాజీ ముఖ్యమంత్రి ట్వీట్ చేసినప్పటికీ అక్కడి బలమైన మిజో సంస్థ యంగ్ మిజో అసోసియేషన్ మాత్రం ఎలాంటి ఆందోళన లేదని చెప్పింది. మిజోరం పరిస్థితి కశ్మీరుకు పూర్తిగా భిన్నమైనదని వ్యాఖ్యానించింది.

కశ్మీరులో టెర్రరిజం వంటి భద్రతా సమస్యల వల్ల ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని ఈ సంస్థ ప్రధానకార్యదర్శి వ్యాఖ్యానించాడు. మిజోరంలో ఇలాంటి సమస్యలు ఏవీ లేవని చెప్పాడు. మిజోరంకు అధికరణ 371 జి ప్రత్యేక హోదా కల్పించింది. ఇక్కడ కూడా కే్ంరద్రప్రభుత్వం చేసే చట్టాలు ఏవయినా గాని, అవి రాష్ట్ర ప్రజల ధార్మిక, సామాజిక కట్టుబాట్లలో జోక్యం చేసుకునేవి అయితే అమలు కావు. ఆ చట్టాలను మిజోరం అసెంబ్లీ ఆమోదించవలసి ఉంటుంది. ఇక్కడ కూడా నాగాలాండ్ మాదిరిగానే వివాదాల పరిష్కారానికి సంప్రదాయిక స్థానిక చట్టాలే పనిచేస్తాయి. భూ హక్కుల బదలాయింపు, ఇతర వనరుల హక్కులకు సంబంధించి కూడా ఆంక్షలు ఉన్నాయి.

మణిపూర్‌లో కొండప్రాంతాల ప్రజలకు అధికరణ 371 సి రక్షణ కల్పిస్తుంది. ఇంఫాల్ లోయ మైదాన ప్రజలకు, కొండప్రాంతాల ప్రజలకు ఈ విషయంలో తేడా ఉంది. అధికరణ 371 ప్రత్యేక కొండప్రాంతాల హిల్ కమిటీలకు అవకాశం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసే ఏ చట్టమైనా సరే ఆదివాసీ ప్రాంతాల్లో అమలు కావాలంటే ఈ హిల్ కమిటీ ఆమోదం అవసరం. మణిపూర్ కొండప్రాంతాల్లో అనేక ఆదివాసీ తెగలు నివసిస్తున్నాయి. ముఖ్యంగా కుకీ, నాగా తెగలు ఇక్కడే నివసిస్తున్నాయి. ఈ రెండు తెగల మధ్య సుదీర్ఘకాలంగా వైరం కూడా కొనసాగుతోంది.

కశ్మీరులో వేర్పాటు వాద ధోరణులున్నాయి కాబట్టి ఇలా జరిగిందని మణిపూర్‌లో నివసించే నాగాల సంస్థ యునైటెడ్ నాగా కౌన్సిల్ కు చెందిన గైడాన్ కామీ అన్నాడు. అధికరణ 371 ఈశాన్య రాష్ట్రాల్లోని ఆదివాసీ తెగలకు సంబంధించింది కాబట్టి ఈ అధికరణ విషయంలో ఏమీ జరగదని భరోసాగా మాట్లాడాడు. కాని కుకీ తెగ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. భారత ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉందో తెలుసుకునే పరీక్ష ఇదని కుకీ నేషనల్ ఆర్గనైజేషన్ ప్రతినిధి చెప్పారు. ఏది ఏమైనా కశ్మీరుకు సంబంధించి అధికరణ 370 రద్దు తర్వాత అనుమానాలు చోటు చేసుకుంటున్నాయన్నది యదార్థం.

                                                                                               – అరుణాభ్ సైకియా (స్క్రోల్)

Modi govt has no intention to remove Article 371