Thursday, April 25, 2024

ప్రైవేటు సేవలో మోడీ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురును తక్కువ ధరలకు ప్రైవేటు నూనె శుద్ధి కర్మాగారాలకు లభిస్తోంది. ప్రభుత్వ కంపెనీలు మాత్రం రష్యా యుద్ధం వల్ల బాగా పెరిగిపోయిన అంతర్జాతీయ ధరలకు కొనుగోలు చేస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆంతరంగికంగా చేసే ప్రతి చర్య కొందరికి విపరీతమైన లాభాలను చేకూర్చేలా ఉందని తొమ్మిదేళ్ళ ఆయన పాలనలో, జాతీయ స్థాయి సంస్థల అధిపతిగా రెండేళ్ళు పని చేసిన నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఈ ఆశ్రిత పెట్టుబడిదారులు (క్రోనీ క్యాపిటలిస్ట్‌లు) మోడీ ప్రయోజనాలను కాపాడేలా తయారయ్యారు. ఈ లబ్ధిదారుల అవసరాలను ప్రభుత్వ యం త్రాంగం క్రమానుగతంగా ఎలా తీర్చాలో అన్నది చాలా ముఖ్యమైపోయింది.
పార్లమెంటు బడ్జెట్ సమావేశం 2022 మార్చి 14న నిర్వహించిన సందర్భంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ మమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడ చిక్కుకుపోయిన భారత పౌరులను, ముఖ్యంగా వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులను కాపాడడానికి భారత దేశం చిత్తశుద్ధితో చర్యలు చేపట్టిందని చెప్పారు. ‘అలీన విధానం’ పేరు ఎత్తకుండానే భారతదేశం తొలి నుంచి అనుసరిస్తున్న తటస్థ వైఖరిని ఎలా కొనసాగిస్తోందో వివరించారు.

2022 మార్చి రెండవ తేదీన జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశానికి భారతదేశం దూరంగా ఉండడాన్ని సమర్థించుకున్నారు. ఉక్రెయిన్ నుంచి రష్యా వైదొలగాలని పశ్చిమ దేశాలే కాకుండా, దూరంగా ఉన్న దేశాలన్నిటితో కలిపి మొత్తం 141 దేశాలు కోరితే, భారత దేశం మాత్రం మౌనం పాటించింది. దీంతో అంతర్జాతీయ సమాజం నుంచే కాకండా, పశ్చిమ దేశాల మీడియా నుంచి కూడా భారతదేశం తీవ్రమైన విమర్శను ఎదుర్కొంది. పార్లమెంటు సంప్రదాయాన్ని అనుసరించి ప్రభుత్వ నిర్ణయానికి ఆమోదం తెలుపుతూ ఆమోద ముద్ర వేసేసింది. ప్రపంచ చిత్ర పటంలో ఎక్కడో కనపడీ కనపడకుండా ఉన్న ఉక్రెయిన్‌ను చాలా మంది ఇప్పుడు గుర్తించగలుగుతున్నారు. గతంలో ఉక్రెయిన్ భారత దేశానికి వ్యతిరేకంగా ఉందని వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో సందేశాల పరంపర సాగింది.ఈ విషయమే ఆధికార పార్టీ నాయకత్వ మనసును ప్రభావితం చేసింది. భారత రష్యా చేసుకున్న 1971 నాటి సంధితో 52 ఏళ్ళుగా రష్యా మన పక్కనే నిలుచుందని ప్రభుత్వ అనుకూల సామాజిక మాధ్యమాలు, టెలివిజన్ చానళ్ళు ఊదరగొట్టేశాయి. అదే సమయంలో నెహ్రూను కానీ, ఇందిరా గాంధీని కాని గుర్తు చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాయి.

రష్యాతో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోకూడదని అంతర్జాతీయంగా విధించిన నిషేధాన్ని లెక్కచేయకుండా భారత దేశం రష్యా నుంచి చమురు దిగుమతికి నడుం బిగించింది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురులో ఒక్క శాతం మాత్రమే విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని, పాత లెక్కల్ని ఉటంకిస్తూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ 2022 మధ్యలో పశ్చిమ దేశాల పత్రికల వారికి చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురును శద్ధిచేసి 30 శాతం విదేశాలకు మన దేశం ఎగుమతి చేసింది. ప్రభుత్వ నూనె కర్మాగారాలు శుద్ధి చేసిన చమురును, దాని ఉత్పత్తులను ఎగుమతి చేయడంపైన నిషేధం విధించిన ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీలపైన మాత్రం అలాంటి నిబంధనలేవీ విధించలేదు. ఉక్రెయిన్ సంక్షోభానికి ముందు రెండు నూనె శుద్ధి కర్మాగారాలు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురును కొని, తమ పెట్రోల్‌ను, డీజిల్‌ను, ఇతర ఉత్పత్తులను అంతర్జాతీయ పోటీ మార్కెట్‌లో అతి తక్కువ లాభాలకు అమ్ముకున్నాయి.

అత్యధిక లాభాలను ఆర్జించడానికి రష్యా నుంచి అతి తక్కువ ధరకు ముడి చమురును కొని, రిలయన్స్ కంపెనీకున్న 10 వేల పెట్రోల్ పంపులకు, నయారా కంపెనీకున్న 65 వేల పెట్రోల్ పంపులకు నింపుకుంటున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమాని ఈ రెండు కంపెనీలు మిగిలిన చమురును ఎగుమతి చేస్తూ, అంతులేని లాభాలను ఆర్జిస్తున్నాయి. రష్యాపై విధించిన నిషేధాల వల్ల చమురు కొరతను ఎదుర్కొంటున్న పశ్చిమ దేశాలు అధిక ధరలకు రిలయన్స్, నయారా కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. ముడి చమురు ధర బ్యారల్‌కు వంద డాలర్లకు చేరుకునే సరికి మిన్నువచ్చి మీద పడినట్టుగా ప్రభుత్వం సృష్టిస్తోంది.

దీనికి ముందున్న యుపిఎ ప్రభుత్వం బ్యారల్ చమురు వంద డాలర్లకు కొనుగోలు చేసిన విషయాన్ని విస్మరిస్తోంది. ప్రభుత్వ బాధ్యతలను ఎన్‌డిఎ నుంచి యుపిఎ స్వీకరించిన 2014 నాటికి ముడి చమురు ధర బ్యారల్‌కు 106.94 డాలర్లు కాగా, ప్రధానిగా మన్మోహన్ సింగ్ పెట్రోల్ లీటర్ 72 రూపాయలకు అమ్మించారు.పెట్రోల్ ధర 112 రూపాయలకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో ఈ ధరలు ఇంకా ఎందుకు పెరుగుతున్నాయో నరేంద్ర మోడీ ఆర్థిక విధానం అర్థం కావడం లేదు. మన ప్రైవేటు కంపెనీలు రష్యా నుంచి ముడి చమురును ఎంత తగ్గించిన ధరకు దిగుమతి చేసుకుంటున్నాయో అర్థం కావడం లేదు. ప్రభుత్వ సంస్థలు బహిరంగ మార్కెట్‌లో కుదుర్చుకున్న ఒప్పందానికి కొనుగోలు చేయాల్సి ఉండడంతో, అత్యుత్సాహంతో ఇష్టమొచ్చినట్టు చేయలేవు. మనం రష్యా వైపు మొగ్గు చూపడం లేదని, మనం మునిగి పోదలుచుకోలేదని జాతి మొత్తాన్ని నమ్మిస్తున్నారు.

రష్యా చము రు కొనకూడదని విధించిన నిషేధానికి భిన్నంగా కొంటున్నారనే ఆరోపణను జైశంకర్ పశ్చిమ దేశాల పత్రికల వారితో చాలా (అతి) తెలివిగా సమర్థించుకున్నారు. రష్యాలో చమురు కొనడానికి మేం మనుషులనేం పంపించలేదు, ‘మార్కెట్‌లో నాణ్యమైన చమురును కొనడానికి మాత్రమే మనుషులను పంపాం’ అన్నా రు. రష్యా నుంచి భారత దేశం 2022 ఫిబ్రవరి నుంచి జూన్ మధ్యలో 62.5 మిలియన్ బారెళ్ళ ముడి చమురును దిగుమతి చేసుకుందని రష్యా డేటా (రెఫినిటివ్ ఇకోన్) తెలిపింది.
అంతకు ముందు ఏడాది అవే నెలల్లో భారత దేశం రెండు ప్రైవేటు నూనె శుద్ధి కర్మాగారాల కోసం దీనికి మూడింతలు దిగుమతి చేసుకుంది. ముడి చమురు కోసం ప్రభుత్వ కర్మాగారాలు ఇబ్బంది పడుతుండగా, భారత ప్రైవేటు నూనె శుద్ధి కర్మాగారాలు కారు చౌకకు రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకున్నాయని ‘బిజినెస్ టైవ్‌‌సు’ పత్రిక తెలిపింది. నూనె శుద్ధిలో 35 శాతం వాటా ఉన్న ప్రైవేటు కర్మాగారాలు 45 శాతం ముడి చమురును కారుచౌకగా దిగుమతి చేసుకున్నాయని వోర్‌టెక్సా అనే ఎనర్జీ కార్గో ట్రాకర్ వెల్లడించింది.

రిలయన్స్, నయారా కంపెనీలు దాన్ని శుద్ధి చేశాక తిరిగి ఎగుమతి చేశాయని పేర్కొంటూ ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’, ‘అధిక ధరలు విధించి పొందిన లాభాలు’ అని వ్యాఖ్యానించింది. “రష్యాతో పశ్చిమ దేశాల సంబంధాలు దిగజారుతుండడంతో రిలయన్స్ లాభాల పంట కొనసాగుతోంది” అని పేర్కొంది. ఎగుమతులు, దిగుమతులు, ధరలు, గాలివాటంగా వచ్చిన లాభాల వివరాలను పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి పొందడానికి పార్లమెంటు ప్రశ్నోత్తరాల ద్వారా ఏడాదిగా ప్రయత్నిస్తున్నాను. లాభాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ దానిపైన లాభాల పన్నులను విధించింది. పొందిన వివరాలు మాత్రం సరిగా లేవు. రష్యాతో తేలిగ్గా జరిపే మాటా మంతి రాత్రికి రాత్రి పెరిగిపోలేదనేది స్పష్టమవుతోంది. గుజరాత్‌లో ఉన్న నయారా పరోక్షంగా రష్యాలో అతి పెద్ద నూనె కర్మాగారమైన రోస్‌నెఫ్ట్ అదుపులో ఉన్నది. పదమూడు బిలియన్ డాలర్లను 2017లో అది పట్టుకొచ్చింది. అలాంటి రష్యా కంపెనీతో రిలయన్స్ సంబంధాలను కొనసాగిస్తూ, అన్ని అవకాశాలకు తలుపులు తెరిచింది.

రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేసి, దానిని శుద్ధి చేసి ఐరోపా యూనియన్ దేశాలకు, ఇతర దేశాలకు ఎగుమతి చేయడాన్ని ‘ద సెంటర్ ఫర్ రీసెర్చి ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్’ అనే అంతర్జాతీయ మేధో మథన భారత దేశాన్ని తప్పుపట్టింది. అనధికారికంగా జరిపే నల్లబజారుపైన భారత దేశం తగిన సమాధానం ఇవ్వలేదు. ముంబయి, దుబాయ్ కేంద్రంగా నడిచే గటిక్ షిప్ మేనేజ్‌మెంట్ అనే తప్పుడు కంపెనీ బెయెనా విస్టా షిప్పింగ్ కంపెనీతో కార్యాలయ భాగస్వామ్యం పొంది, 56 ఆయిల్ ట్యాంకర్‌లను ఏప్రిల్‌లో పొందింది. రోసన్‌ఫెట్ అనే రష్యా ఆయిల్ ఎగుమతిదారు గుత్తాధిపత్యాన్ని పొందినట్టు స్పష్టమవుతోంది. అది ఇప్పటికే 83 బిలియన్ బారెళ్ళ రష్యా ముడి చమురు సరఫరాలో సగం రవాణా చేసింది. రష్యా చమురును భారత దేశానికి దిగుమతి చేయడంలో భారత దేశానికి చెందిన మరో షిప్పింగ్ కంపెనీ ఏదీ దీని దూసుకుపోలేదు. రెండు దేశాల సహాయం లేకుండా ఇంత పెద్ద ఎత్తున రవాణా జరగదు.

నా వాదన సుస్పష్టం. ముడి చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ప్రైవేటు నూనె శుద్ధి కర్మాగారాలు ఎక్కువ లాభాలు ఆర్జిస్తుంటే, రష్యా యుద్ధం వల్ల ఏర్పడిన బాగా పెరిగిన అంతర్జాతీయ ధరలకు ప్రభుత్వ కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. తక్కువ ధరకు దిగుమతి చేసుకుంటూ, ఎక్కువ ధరకు ఎగుమతి చేసిన రిలయన్స్, నయారా కంపెనీలు పొందే లాభాలు ఎంత? ఆంక్షలు ఉన్న రష్యా చమురును ఆకాశాన్ని అంటే ధరలకు ఎగుమతి చేయడంలో గటిక కాని, బుయెనా విస్తా కానీ ఎవరికీ అంతుచిక్కని ప్రైవేటు ప్రవేశం? ఈ పరిస్థితిలో ప్రైవేటు నూనె శుద్ధి కర్మాగారాల ప్రయోజనాల కోసం రష్యాపైన ఏ వాక్చాతుర్యం ప్రభావితం చేసిందో!? గుజరాత్‌కు చెందిన కంపెనీలకు లాభార్జాన చూకూర్చేలా చేసి, అంతర్జాతీయంగా భారత దేశ పరువును మసకబారేలా చేసిందిమాత్రం చమురు కంపెనీలు, పెట్రోలియం మంత్రిత్వ శాఖ అనేది సుస్పష్టం.

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News