Home జాతీయ వార్తలు భారత్‌లోకి అమెరికా లెగ్‌పీస్!

భారత్‌లోకి అమెరికా లెగ్‌పీస్!

US-India

 

పాల ఉత్పత్తులూ దిగుమతి
ట్రంప్ పర్యటనలో ఒప్పందం కుదిరే అవకాశం
తోడుగా సుంకాల తగ్గింపులు

న్యూఢిల్లీ / వాషింగ్టన్ : పాడి, కోడి మార్కెట్లలోకి అమెరికా ప్రవేశానికి మార్గం సిద్ధం అయింది. ఈ నెల 24వ అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు వస్తున్నారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య విస్తృత స్థాయిలోనే వాణిజ్య ఒప్పందం కుదరనుంది. పౌల్ట్రీ, డెయిరీ మార్కెట్లలోకి అమెరికా పాక్షిక ప్రవేశానికి సిద్ధంగా ఉన్నట్లు భారతదేశం తెలియచేయనుంది. ఇరు దేశాల మధ్య అత్యున్నత స్థాయిలో చర్చల దశలో ఈ విషయం ప్రస్తావనకు రానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమెరికాలోని పాల ఉత్పత్తులు, చికెన్ లెగ్స్ పదార్థాలను ఇండియాలోకి దిగుమతి చేసుకునేందుకు వీలు కల్పిస్తారని వెల్లడైంది. పాలు, పాడి సంబంధిత ఉత్పత్తుల విషయంలో భారతదేశం ఆది నుంచి తొలి స్థానంలో ఉంటూ వస్తోంది. పాడిదేశంగా పేరొందింది. ఇక్కడికి ఇతర దేశాల నుంచి పాల ఉత్పత్తులను నిషేధించింది.

పాడి పరిశ్రమపై ఆధారపడి బతికే 8 కోట్ల మంది గ్రామీణ ఇంటిల్లిపాది ప్రత్యేకించి యాదవులు ఇతరులకు ఇబ్బంది కలుగకుండా ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే తమ ఉత్పత్తులకు భారతీయ మార్కెట్ చాలా కీలకమైనదని, పైగా విస్తృతమైనదని నిర్థారించుకున్న అమెరికా భారత్‌లో మార్కెట్ విస్తరణకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలోనే అమెరికాతో భారీ స్థాయి బంధాన్ని పటిష్టం చేసుకోవాలని ప్రధాని మోడీ సంకల్పించారు. ఇందుకోసం ట్రంప్ రాక సందర్భంగా భారీ స్థాయి స్వాగత ఏర్పాట్లు జరుగుతున్నాయి. అహ్మదాబాద్‌లో అమెరికా అధ్యక్షుడికి చిరస్మరణీయ సభ జరిగేలా మోడీ దృష్టిసారించారు. అయితే ఇండియా అనుసరిస్తున్న వాణిజ్య వైఖరి తమకు ఇబ్బందిగా ఉందని ట్రంప్ పలు సార్లు పేర్కొన్నారు. తమ ఉత్పత్తులకు సరైన మార్కెట్ లేదని మండిపడ్డారు.

ఈ క్రమంలోనే 1970లో భారత్‌తో కుదుర్చుకున్న ప్రత్యేకమైన వాణిజ్య ఒప్పందాన్ని ట్రంప్ నిలిపివేశారు. భారత్‌లో వైద్య పరికరాలు, స్టెంట్లు, కార్డియాక్ పనిముట్లు వంటి వాటిపై మోడీ విధించిన ఆంక్షలు అమెరికాకు షాక్ కల్గించాయి. ఈ విషయాన్ని పలుసార్లు మోడీతో ట్రంప్ ప్రస్తావించారు. అయితే స్వదేశీ ఉత్పత్తి దిశలో తమకున్న లక్షాల కోణంలో కొన్నింటిపై ఏ నిర్ణయం తీసుకోకుండా ఉన్న మోడీ ఇప్పుడు తప్పనిసరిగా ట్రంప్ పర్యటన దశలో రాజీకి వచ్చినట్లు వెల్లడైంది. అమెరికా వాణిజ్య ప్రాధాన్యతలకు తాము గుర్తింపు ఇవాల్సిన అవసరాన్ని మోడీ పరిగణనలోకి తీసుకున్నట్లు, ఈ క్రమంలో డెయిరీ , పౌల్ట్రీ మార్కెట్‌కు అవకాశం ఇస్తున్నట్లు వెల్లడైంది. భారత్‌కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ద్వైపాక్షిక సరుకులు, సేవల వాణిజ్య వినిమయం 2018లో రికార్డు స్థాయిలో 142.6 బిలియన్ డాలర్లకు చేరింది, అయితే ఇండియాతో తమ మార్కెట్ సరిగ్గా లేదని, 23.2 బిలియన్ డాలర్ల మేర సరుకు వాణిజ్య లోటు ఉందని అమెరికా చెపుతూ వచ్చింది.

తమ పాడి, పౌల్ట్రీ రంగాలకు భారత్‌లో మంచి అవకాశాలు ఉన్న విషయాన్ని తెలిపింది. ప్రఖ్యాతి గాంచిన అమెరికా చికెన్ లెగ్స్, టర్కీ వంటివాటికి, బ్లూబెర్రీలు, చెర్రీస్ ఇతర పాల సంబంధిత చాక్లెట్లకు భారతీయ మార్కెట్ అవకాశాలు కల్పించాలని ఇండియా నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడైంది. చికెన్ లెగ్స్‌పై వంద శాతం నుంచి పాతిక శాతానికి సుంకాలను తగ్గించేందుకు ముందుకు వస్తోంది. అయితే తమకు పదిశాతం సుంకాలే ఉండాలని అమెరికా వాణిజ్య వర్గాలు కోరుతున్నాయి. ఇక ఇండియాలోని డెయిరీ మార్కెట్‌లోకి కూడా అమెరికా ప్రవేశానికి ఓ మోస్తరు స్థాయిలోనే రంగం సిద్ధం అయింది. అయితే 5 శాతం టారిఫ్, కోటా ఉంటుందని స్పష్టం చేశారు. అయితే అమెరికాకు చెందిన పాడి ఉత్పత్తుల విషయంలో కొన్ని ఖచ్చితమైన ఆంక్షలు ఉంటాయి. వాటిని పాటించిన ఉత్పత్తులకే భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశం ఉంటుందని వెల్లడైంది.

డేవిడ్‌సన్ బైక్‌లకు అడ్డు లేదు

ఇక ఆటోమోబైల్స్ విషయంలో కూడా అమెరికాకు సాఫీ ప్రయాణానికి మోడీ వీలు కల్పించనున్నారు. హెర్లీ డేవిడ్‌సన్ తయారీ బైక్‌లపై టారీఫ్‌ను తగ్గించాలని సిద్ధపడుతోంది. ఇండియా టారీఫ్ కింగ్ అయి కూర్చుందని, మిత్రులంటూనే వారు అమెరికా ఉత్పత్తులకుబ్రేక్‌లు వేస్తున్నారని పలు సార్లు ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు కుదిరే వాణిజ్య ఒప్పందం పేరుకు ఒప్పందంగా ఉన్నా, పలు రాయితీలు, సుంకాల తగ్గింపులు, ప్రత్యేకించి అమెరికాకు భారతీయ మార్కెట్ అనుసంధానంగానే ఉంటుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీ దేశానికి అతిధిగా వస్తోన్న ట్రంప్‌ను స్వరాష్ట్రం గుజరాత్ అహ్మదాబాద్‌లో సాదరంగా ఆహ్వానిస్తారు. అక్కడ భారీ ఎత్తున సభ ఉంటుంది. అమెరికాతో మునుపెన్నుడూ లేని రీతిలో వాణిజ్య బంంధం దిశలో ట్రంప్‌ను ఆకట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అయితే గుజరాత్‌లోనే అత్యంత ప్రాధాన్యత ఉన్న పాడిపరిశ్రమకు విఘాతం కలిగేలా అమెరికా డెయిరీకి స్వాగతం పలుకనుండటం ఇప్పుడు చర్చకు దారితీసింది.

Modi govt offers dairy, chicken access to US for Trade Deal