Home ఎడిటోరియల్ మోడీ ఎల్లకాలం మోసం చేయలేరు

మోడీ ఎల్లకాలం మోసం చేయలేరు

modiఆధార్‌కు సగటు భారతీయుడికి లింకు ఏమిటి? కేంద్ర ప్రభుత్వానికి ఆధార్‌కి ఉన్న లింకేమిటి? భారతీయుడిగా బతకడానికి ఈ దేశంలో ఎన్ని కార్డులు ఉండాలి. యు.ఐ.డి. (యునిక్ ఐడెంటిటీ) దీనికి ఏ కార్డు అయితే సరిపోతుందో కేంద్ర ప్రభుత్వానికి సరైన అవగాహన ఉందా? గతంలో ఓటరు కార్డుని గుర్తింపు కార్డు అన్నారు. రేషన్ కార్డు, లైసెన్స్, పాస్‌పోర్టు, పాన్‌కార్డు ఇలా ఒక భారతీయుడ్ని అని చెప్పుకోవడానికి ఇన్ని కార్డులు అవసరమా. ఏ కార్డులు లేకుండానే బ్యాంకుల్లో ఖాతా పుస్తకాలతోనే లావాదేవీలు బాగా నడిచాయి. ప్రపంచ దేశాలలో లేని ఈ ఆధార్ లింకు గొడవేమిటి? జూన్ 23, 2009 సం॥లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నిలేకని అనే ఆయనకి ఆధార్ ప్రాజెక్టు అప్పజెప్పారు. ఆయనను యు.ఐ.డి.ఎ.ఐ.కి ఛైర్మన్‌గా చేసి క్యాబినెట్ హోదా కల్పించారు. డా॥ అజయ్ భూషణ్ పాండేను సి.ఈ.ఒ.గా నియమించింది అప్పటి మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం.
అయితే అన్ని కీలక పత్రాలను, ఖాతాలను ఆధార్‌తో తప్పని సరిగా అనుసంధానించాలనే నిబంధనపై చాలామంది కోర్టులను ఆశ్రయిస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ కార్డు విషయంలో ఇతమిత్ధంగా ఏదీ చెప్పలేకపోతున్నది. ఇటీవలే రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. ఆధార్‌కార్డు అనుసంధానంపై కోర్టుకి ప్రభుత్వం చెపుతున్న కారణాలు ఏమిటంటే 1) బ్యాంక్ ఖాతాలు త్వరగా తెరవడానికి. 2) ఎల్.పి.జి. సబ్సిడీ కోసం. 3) మన విషయాలు డిజిటల్ లాకర్‌లో భద్రంగా ఉంటాయని, 4) పాస్‌పోర్టు 10 రోజుల్లో వస్తుందని, 5) నెలవారీ పెన్షన్ అందుకోవటానికి వీలుగా 6) విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు నేరుగా ఇవ్వటానికి. 7)ప్రావిడెంట్ ఫండ్‌ని ఆధార్‌కార్డు నెంబర్ ద్వారా బ్యాంకుకు పంపించవచ్చని, 8) జీతభత్యాలు కూడా బ్యాంకులకు ఈ ఆధార్ నెంబర్ల ద్వారానే పంపవచ్చని చెపుతున్నది. ఎంతమందికి ఈ ఆధార్ కార్డులు ఉన్నవి అనే విషయంలో ప్రభుత్వం దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉందా? ఉంటే ఆ కార్డు ఉన్న వాళ్లందరికి ఈ అనుసంధానం మీద అవగాహన ఉందా? ఫోన్ నెంబర్లకు ఈ ఆధార్ కార్డు లింకు ఎందుకు? ఇటీవల కాలంలో తీవ్రవాదుల చేతుల్లోకి సివ్‌ుకార్డులు బాగా చెలామణి అవుతున్నాయని వాటిని అరికట్టడానికి అని ప్రభుత్వం చెపుతున్నది. అయితే నల్లధనం తీవ్రవాదుల చేతుల్లోకి పోకుండా చేయడానికి కూడా ప్రభుత్వం చెబుతున్నది. ఉగ్రవాదులు పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి పంపుతున్న దొంగ నోట్లను అరికట్టడం కోసమని పెద్దనోట్లు రద్దు చేశారు. పెద్దవాళ్ళ చేతుల్లో ఉన్న నల్లధనం తెల్లధనంగా మారటానికి మాత్రమే నోట్ల రద్దు ఉపయోగపడింది. ఎంత డబ్బు తీవ్రవాదుల చేతుల్లోంచి లాక్కోగలిగారు. అంటే లేదనే సమాధానం. పైగా తిరిగి 500 నోట్లు, + 2వేల రూపాయల పెద్దనోటు మార్కెట్‌లో పెట్టారు. నల్లధనం ఉన్న వారికి దాచుకోవడానికి, రవాణాకి అవి చాలా ఉపయోగపడుతాయి. అలాగే జిఎస్‌టి ఇది కూడా భారత ప్రజలను, వ్యాపారస్తులను, చిన్నా చితక వ్యాపారాలు చేసుకునే వారికి, ఉద్యోగస్తులకు, ఇప్పటికి తికమక పెడుతూనే ఉంది. సామాన్యుడికి ఏ మాత్రం ఈ పథకాలు ఉపయోగం కాదని తెలిసిపోయింది. ఈ పథకాలు ఎవరి లాభాల కోసం పెట్టారు.
ఇప్పుడు తీవ్రవాదుల చేతుల్లో సెల్‌ఫోన్లు ఉన్నాయని వాటిని నిరోధించటానికి అని ఆధార్ నెంబర్‌ని, ఫోన్ తో లింకుచేయమని ప్రభుత్వం చెపుతున్నది. కొండ నాలుకకు మందేస్తే, ఉన్న నాలుక ఊడిందన్నట్లుగా తీవ్రవాదుల పేరుమీద, నల్లధనం పేరుమీద, భారతీయులను బిజెపి ప్రభుత్వం రోడ్డు మీదికి ఈడుస్తున్నది. ఈ రోజు కాకపోతే రేపు అయినా ఈ వివరాలు విదేశాలకు పోవని, తీవ్రవాదుల చేతుల్లోకి పోవని ప్రభుత్వం హామీ ఇస్తుందా? యుపిఏ ప్రభుత్వ హయాంలో చేసిన నిర్ణయాలతో పెనంమీద ఉన్న ప్రజలు ఎన్‌డిఎ హయాంలో పొయ్యిలో పడినట్టు అయ్యింది. మన సంసారం గుట్టంతా ఈ ఆధార్ లింకుద్వారా బయటి దేశాలకు, తీవ్రవాదుల చేతుల్లోకి పోయే ప్రమాదం దాపురించిందని ప్రజలు భయపడుతున్నారు. ఇప్పుడు బ్యాంక్‌ల వారు, టెలికాం సర్వీసు వారు ఖాతాదారులను ఆధార్ నెంబర్ అనుసంధానం చేయకపోతే ఖాతాలు మూసేస్తామని, ఫోన్స్ ఆగిపోతాయని డెడ్‌లైన్స్ పెట్టి
బెదిరిస్తున్నారు.
బిజెపి ప్రభుత్వ లక్షణాలు:
ఎన్‌డిఎ ప్రభుత్వం ఏది చెపితే 125 కోట్లమంది అదే చేయాలి. ప్రభుత్వం ఏమి చేసినా దేశభక్తితో లింకుపెట్టి మాట్లాడటం, ఏదీ తినాలో, తినకూడదో కూడా ఏ సినిమా తీయాలి, అందులో ఏ డైలాగులు రాయాలి, పత్రికలో ఏ రాతలు రాయాలి. అని బిజెపి ప్రభుత్వం చెపుతుంది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే వారిని దేశద్రోహులుగా ముద్రవేయటం, వారు చెప్పిందే చదవాలి. వారు చెప్పిందే వినాలి, వారు చెప్పిందే వేదంగా భావించాలి. అన్నిటికీ దశావతారాలు తర్వాత 11వ అవతారంగా నరేంద్రమోడీని చూడాలని ఆయనను ఒక దేవుడిగా భావించాలని, జనాలను ఏ విధంగా వత్తిడి చేస్తున్నారో, వారి పథకాల అమలుకు అంతే వత్తిడి చేస్తున్నారు. 70 సం॥లు పనిచేసిన ప్లానింగ్ కమీషన్ రద్దు చేసి నీతి ఆయోగ్ అని పేరు మార్చినప్పుడే వారి నియంతృత్వ పోకడలను ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు.
ఓటరు కార్డుని ఆధార్‌కి అనుసంధానం ఎందుకు చేయటంలేదు?
అన్ని లావాదేవీలు ఆధార్‌కార్డుతో లింకు చేసినప్పుడు ఓటరు కార్డుని కేంద్రప్రభుత్వం ఆధార్‌తో ఎందుకు అనుసంధానం చేయట్లేదు. దీన్ని కూడా ఆధార్ పరిధిలోకి తీసుకురావాలి కదా! కాబట్టి కేంద్రం అన్నిటికీ తీవ్రవాదం ముసుగు తగిలించటం అంతమంచిది కాదు. మతాల మధ్య చిచ్చుపెట్టే వాళ్ళు, కులాల మధ్య చిచ్చు పెట్టే వాళ్లు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్లను కూడా తీవ్రవాదులుగానే పరిగణించాలి. ఒక్కటి మాత్రం నిజం బిజెపి ప్రభుత్వ ఎన్నికల్లో చేసిన వాగ్ధానాలకు భిన్నంగా పరిపాలన సాగిస్తున్నది. అందుకని భారతీయులను ఆ దిశగా ఆలోచించకుండా నిత్యం వారు ఏదో ఒక సమస్యతో వారికి వారే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేటట్లుగా నోట్ల రద్దు, జిఎస్‌టి, ఆధార్‌లింకులు అన్ని లింకులతో కట్టేసి మరీ చంపుతున్నారు. ఎవరినైనా కొంత కాలం మోసం చేయొచ్చు. అందర్నీ ఎల్లకాలం మోసం చేయలేరు. ప్రజలు ఈ విషయాన్ని ఇప్పుడే గ్రహిస్తున్నారు. భవిష్యత్తు గురించి, బిజెపి ప్రభుత్వం తన మనుగడ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. తన పతనానికి తానే కారణమని గ్రహించటానికి ఎంతో దూరం లేదని కేంద్ర పాలకులు గ్రహించాలి.
 * కె.గంగాధర్‌రావు,9849562081