Thursday, April 25, 2024

ప్రధాని మోడీ సాటిలేని ప్రజాస్వామిక నేత

- Advertisement -
- Advertisement -

Modi is most democratic leader : Amit Shah

చెప్పేది వినరనే మాట శుద్ధ అబద్ధం :
అమిత్ షా కితాబ్

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాస్వామిక నేత, ఓపికగల శ్రోత అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొనియాడారు. మోడీ నిరంకుశపు నేత అని ఇతరులు చెప్పేది వినరు అనే వాదనను అమిత్ షా తోసిపుచ్చారు. మోడీ ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్ ప్రవర్తించినంత ప్రజాస్వామికంగా ఇతర ఏ కేబినెట్ పనిచేయలేదని చివరికి మోడీ విమర్శకులు కూడా చెపుతారని కితాబు ఇచ్చారు. సంసద్ టీవీకి అమిత్ షా ఆదివారం ఇచ్చిన ఇంటర్వూలో ప్రధాని వైఖరిని తెలియచేస్తూ ఆయన గుణగణాలను ప్రశంసించారు. ఇతరులు చెప్పేది సావధానంగా ఆలకించే ప్రధాని మోడీ వంటి ప్రధానిని తాను ఇప్పటివరకూ చూడలేదని తెలిపారు. అధికార యంత్రాంగంలో హెచ్చుతగ్గులతో నిమిత్తం లేకుండా ఆయన అందరు చెప్పేది శ్రద్ధగా వింటారు. వారి హోదాలను పట్టించుకోరని, విలువైన సముచితమైన సలహాలు సూచనలు ఏ స్థాయి నుంచి అందినా స్వీకరిస్తారని తెలిపారు. ఇంతకంటే ప్రజాస్వామ్య వాదానికి తార్కాణం ఉంటుందా? అని ప్రశ్నించారు.

దేశం కోసం కఠోర నిర్ణయాలు

జాతీయ ప్రయోజనాలకు అవసరం అయిన కఠోర నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధాని మోడీ దేనికి వెనుకాడబోరని షా తేల్చిచెప్పారు. రాజకీయ ముప్పు ఉంటుందని తెలిసినా దేశం కోసం ఎటువంటి కీలక నిర్ణయాలకు అయినా వెనుకంజ వేయకుండా ఉంటారని తెలిపారు. దేశ ప్రయోజనాలకు ఎటువంటి రాజీకి దిగరని, అత్యంత కఠిన నిర్ణయాలకూ వెనుకాడబోరన్నారు.

నిర్ణయాలను రుద్దే రకం కాదు

సాధారణంగా మోడీ ఇతరులపై తన నిర్ణయాలను బలవంతంగా రుద్దబోరు. కేంద్ర కేబినెట్ సమావేశాలలో అందరి అభిప్రాయాలను తీసుకున్న తరువాతనే కీలక నిర్ణయాలు వెలువరిస్తారు. ఇది కేవలం తాను చెప్పే విషయమే కాకుండా ఇంతకు ముందు ఆయన సన్నిహితంగా ఉండి తరువాత విమర్శకులుగా మారిన వారు కూడా అంగీకరించే సత్యం అని షా తెలిపారు. మోడీజీ ప్రధానిగా ఉంటున్న ఈ దశలో అంతా ప్రజాస్వామిక వ్యవహార శైలి అనేది సుస్పష్టం అయ్యే అంశం అని తెలిపారు.

క్రమశిక్షణకు ప్రాణమిస్తారు

అన్ని విషయాల్లోనూ మోడీ క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారని ఇంతకు ముందు తాను బిజెపి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉంటున్నప్పుడు ఈ అంశాన్ని ప్రధానంగా గుర్తించానని షా తెలిపారు. ప్రధాని క్రమశిక్షణ వైఖరి వల్లనే పలు కీలక సమావేశాల అంతర్గత విషయాలు వెలుగులోకి రాకుండా ఉంటాయని చెప్పారు. నిర్ణయాలు వెలువడకుండా ముందుగానే బయటకు రావడం అనేది జరిగిన సందర్భాలు లేనేలేవని తెలిపారు. ప్రతి సమావేశంలోనూ నిర్ణయాలు సమిష్టిగానే తీసుకోవడం జరుగుతుందన్నారు.

అధికారం కోసం కుర్చీకి రాలేదు

దేశాన్ని మార్చేందుకు తాను అధికారంలోకి వచ్చానని తరచూ మోడీ చెపుతుంటారు. అంతేకానీ ప్రభుత్వాన్ని నిర్వహించి, అధికారాన్ని చలాయించుకునేందుకు కాదని చెప్పకనే చెపుతారని అన్నారు. ఈ క్రమంలో పార్టీ మద్దతుదార్లకు కొందరికి నచ్చని నిర్ణయాలు తీసుకుంటారని, వీటిలో కరకు, రిస్క్‌తో కూడిన నిర్ణయాలు కూడా ఉంటాయని అమిత్ షా వివరించారు. నల్ల ధనం వెలికితీతకు, ఆర్థిక సంస్కరణలకు, పన్నుల ఎగవేతల ఆటకట్టుకు తీసుకున్న నిర్ణయాలు కఠోరంగానే ఉన్నాయి. ఇవి దేశ ప్రయోజనాల కోణంతో చేపట్టినవే. వీటి వల్ల కొందరి బాధకలిగి ఉంటుంది. ఇన్నేళ్లుగా పార్టీకి ఓటేసిన వారికి కూడా నష్టం వాటిల్లి ఉంటుంది. అయితే చిట్టచివరికి దేశానికి మేలు జరుగుతుందనేది అందరికీ తెలిసి వస్తుందని , కఠోర నిర్ణయాలతో మోడీకి వ్యక్తిగతంగా వచ్చేది ఏదీ లేదని, దేశం బాగుకే అనేది అందరికీ తెలిసి వస్తుందని, అందుకే చివరికి అంతా మోడీజీతో అనుబంధం తెంచుకోలేరని షా తెలిపారు.

లోపాలుంటే చూపండి అవినీతి తెలుపండి

కేవలం విమర్శలకు దిగితే సరిపోదని తాను ప్రతిపక్షాలలోని స్నేహితులను కోరుతున్నానని, వారు ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నారని, ఇప్పటి ప్రభుత్వంలో ఏ స్థాయిలో అవినీతి ఉన్నా వెలుగులోకి తీసుకురండి, సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపండి ఈ క్రమంలో ప్రజల వద్దకు వెళ్లండి, అంతేకానీ వ్యక్తిగత దూషణలకు దిగుతూ రాజకీయ ప్రమాణాలను దెబ్బతీయరాదని పిలుపు నిచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News