Home ఎడిటోరియల్ ప్రజలకు మోడీ వివరణ

ప్రజలకు మోడీ వివరణ

PM Narendra Modi New Year interview     లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడిన కీలక సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వూ తనపట్ల దేశ ప్రజలలో ఏర్పడిన అసంతృప్తిని తొలగించడానికి ఉద్దేశించినదేనని స్పష్టపడుతున్నది. ఇందులో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాల హేతుబద్ధత ఎలా ఉన్నప్పటికీ ప్రజలకు సమాధానం చెప్పుకోవలసిన తరుణం వచ్చిందని ఆయన గ్రహించినట్టు బోధపడుతున్నది. అత్యంత వివాదాస్పదమైన పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను అమలు తీరు దేశ ప్రజలను నానాకష్టాలపాలు చేసిన చేదు వాస్తవం సందేహాతీతంగా రుజువై దాని ప్రభావం ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బిజెపిని చావు దెబ్బ తీసిన నేపథ్యంలో వివరణ ఇచ్చుకోకతప్పని స్థితి తల ఎత్తిందని ప్రధాని మోడీ గుర్తించారు. అయితే ఈ రెండు విషయాల్లో ప్రధాని సమాధానాలు సంతృప్తికరంగా లేవని చెప్పక తప్పదు. ఈ చర్యల వల్ల ప్రజలుపడిన బాధలను వారు మరిచిపోయేలా చేయగల శక్తి ఆయన వివరణలో గల్లంతయింది.

పెద్ద నోట్లను ఆకస్మికంగా రాత్రికి రాత్రే రద్దు చేసినందువల్ల ఉన్నపళంగా చేతిలో చిల్లి గవ్వలేని దుస్థితిని ఎదుర్కొన్న దేశ ప్రజలు అనేక బాధలుపడ్డారు. ఆత్మహత్యలు, ఆకస్మిక మరణాలు కూడా గణనీయంగా సంభవించాయి. గుట్టల గుట్టల గుప్త ధనాన్ని నిర్మూలించి ఆర్థిక వ్యవస్థకు స్వస్థత తెస్తామన్న మాట బూటకమయింది. పెద్ద నోట్ల రద్దుతో అవినీతి అంతమవుతుందని, టెర్రరిస్టుల దగ్గరున్న డబ్బు విలువలేనిదయిపోయి ఉగ్రవాదం తగ్గుముఖంపడుతుందని అన్నారు. ఈ రెండూ నెరవేరలేదు. సంపన్నుల ఇళ్లల్లోని గుప్తధనమంతా దొడ్డి దారుల్లో తిరిగి బ్యాంకుల్లో చేరి చెలామణిలోకి వచ్చేసింది. ఆదాయపు పన్ను కట్టేవారి సంఖ్య పెరిగినట్టు మోడీ చెప్పుకున్నది పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలెదుర్కొన్న కష్టాలతో పోలిస్తే అతి స్వల్పం. పాత నల్ల ధనం తెలుపయిపోయి కొత్తగా గుప్త కరెన్సీ గుట్టలుపడుతున్నది. హద్దూ ఆపూ లేకుండా పెరిగిపోతున్న రియల్‌ఎస్టేట్ భూముల ధరలే ఇందుకు తార్కాణం.

జిఎస్‌టి పై శ్లాబును 28 శాతంగా నిర్ణయించి అందులో అనేక వస్తువులను చేర్చి అమ్మకాల కంప్యూటరైజేషన్‌ను తప్పని సరి చేయడం వల్ల వినియోగదారులు, చిన్న వ్యాపారులు ఊహించని కష్టాలు, నష్టాలు చవిచూశారు. జిఎస్‌టి కౌన్సిల్ ఈ ఎన్నికల వేళ ఇటీవలే సమావేశమై 28 శాతం శ్లాబు నుంచి అనేక వస్తువులను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం ఈ విషయంలో మోడీ ప్రభుత్వం తన తప్పును ఒప్పుకున్నట్టు చాటింది. ప్రజల ముక్కు పిండి వసూలు చేసి ఆదాయం పెరిగిందని జబ్బలు చరుచుకోడం జన హితం కోరే ఏ ప్రభుత్వమూ చేయకూడని పని.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ రైతు రుణ విమోచనను ఎన్నికల ప్రచార ప్రధానాంశం చేసుకున్న తర్వాత అది ఇటీవలి ఎన్నికల్లో ఆ పార్టీకి సత్ఫలితాలను ఇచ్చిన నేపథ్యంలో దాని వల్ల వ్యవసాయదారులకు ఏమాత్రం మేలు జరగదని, బ్యాంకులు దివాళా తీస్తాయనే ప్రచారం ఊపందుకున్నది. రుణ మాఫీ వల్ల రైతులు బాగుపడేదిలేదని మోడీ కూడా తన ఇంటర్వూలో బల్లగుద్ది చెప్పారు. అయితే బడా పారిశ్రామిక వేత్తలు భారీ ఎత్తున రుణాలను ఎగవేస్తున్నందున బ్యాంకులు చెడిపోయేది లేనప్పుడు రైతులకు మాఫీ చేస్తే ఏంపోయింది అనే ప్రశ్నకు ఆయన నుంచి సమాధానం లేదు. తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు, రైతు బంధు బీమా పథకాల తరహాలో కేంద్రం కూడా అటువంటి నిర్ణయాన్ని తీసుకోగలదని వినిపిస్తున్నది.

అది చేసేంతవరకు మోడీ ప్రభుత్వానికి రైతుల పట్ల గల చిత్తశుద్ధి బోనులో నిలబడే ఉంటుంది. బాబ్రీ మసీదు స్థలంలో రామాలయ నిర్మాణానికి వీలు కల్పించే ఆర్డినెన్స్‌ను ఆ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాతనే తీసుకొస్తామని ప్రధాని ప్రకటించారు. తీర్పు తమ పార్టీ వైఖరికి వ్యతిరేకంగా వచ్చినా గుడి కట్టడానికి ఆర్డినెన్స్ ద్వారా వీలు కల్పిస్తామని ఆయన చెప్పకనే చెప్పారు. ఆ మేరకు హిందుత్వ ఓటు బ్యాంకును సంతృప్తి పరచే ప్రయత్నం చేశారు. తాను విరివిగా చేసిన విదేశీ పర్యటనలు ఎందుకు అవసరమయ్యాయో గట్టిగా సమర్థించుకోలేకపోయారు. వాటివల్ల దేశానికి ఏయే మేళ్లు జరిగాయో వివరించలేకపోయారు. చివరగా ప్రజలు తమవెంటే ఉన్నారని తెలంగాణలో జరిగినట్టే జాతీయ స్థాయిలోనూ కూటమి ఓటమి తప్పదని ప్రధాని మోడీ ప్రకటించిన అమిత విశ్వాసం రుజువవుతుందో, విఫలం కానుందో లోక్‌సభ ఎన్నికల ఫలితాల తెర మీద చూడవలసి ఉంది.

Modi New Year interview sets the tone for BJP 2019 Lok Sabha campaign

Telangana Latest News