Home ఎడిటోరియల్ ఎలెక్టోరల్ బాండ్లతో కీడు!

ఎలెక్టోరల్ బాండ్లతో కీడు!

Cartoon

 

ఎలెక్టోరల్ బాండ్ల వంటివి ప్రవేశపెట్టడం వల్ల చాలా రిస్కు ఉంటుందని 2017, సెప్టెంబరులో రిజర్వు బ్యాంకు గవర్నర్ గా ఉన్న ఉర్జిత్ పాటిల్ అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి రాశారు. ఎలెక్టోరల్ బాండ్ల వల్ల రిజర్వు బ్యాంకు విశ్వసనీయత దెబ్బతింటుందని ఆయన వాదించారు. అంతేకాదు, నోట్లరద్దు వల్ల లభించిన కొద్దిపాటి ప్రయోజనాలు కూడా ఈ ఎలెక్టోరల్ బాండ్ల వల్ల నాశనమవుతాయని ఆయన అన్నారు. సమాచార కార్యకర్త అంజలీ భరద్వాజ ఈ లేఖలను సంపాదించారు. షెడ్యుల్డ్ బ్యాంకులు కరెన్సీ మాదిరి పత్రాలను జారీ చేయడానికి అవకాశం కల్పించడమంటే, రిజర్వు బ్యాంకు పనిలో జోక్యం చేసుకోవడమే, దాని ప్రాధాన్యతను తగ్గించడమే అవుతుంది. షెడ్యూల్డ్ బ్యాంకులు కరెన్సీ మాదిరి పత్రాలను జారీ చేయడానికి వీలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ఉర్జిత్ పాటిల్ తప్పుపట్టారు.

బేరర్ బాండ్లను జారీ చేసే అధికారం కేంద్ర బ్యాంకుకు మాత్రమే ఉంటుంది. ఈ విషయమై ఉర్జిత్ పాటిల్ ఆర్ధిక మంత్రికి రాస్తూ, “బేరర్ బాండ్లు, అంటే కరెన్సీ మాదిరి పత్రాలను జారీ చేసే అధికారం ఇతరులకు ఇవ్వడం వల్ల అనేక ప్రమాదలు ఉంటాయి. ఎలెక్టోరల్ బాండ్లకు అనేక నియమని బంధనలు ఉన్నప్పటకీ ఈ రిస్కు తప్పదు” అని ఆయన చెప్పారు. అంతేకాదు, ఈ స్కీం గురించి ప్రజల్లో అనుమానాలు తలెత్తవచ్చని, భారత ఆర్థిక వ్యవస్థ విశ్వసనీయతను ఇది దెబ్బ తీస్తుందని ఆయన వాదించారు. పన్ను ఎగవేత కోసం అవతరించే ఉత్తుత్తి షెల్ కంపెనీలు ఈ స్కీంను దుర్వినియోగం చేయవచ్చని, రిజర్వు బ్యాంకు విశ్వసనీయత దిగజారుతుందని ఆయన అన్నారు. గుప్త ధన లావాదేవీలు పెరగవచ్చని భయాలు వ్యక్తం చేశారు.

రాజకీయ పార్టీలకు నిధులను నియంత్రించడం అనేది మంచి ఆలోచన. ఎలెక్టోరల్ బాండ్లు అనే ఆలోచన సరికొత్తది. ఎలెక్టోరల్ బాండ్లను డిజిటల్ రూపంలో ప్రవేశపెట్టడం మంచి పద్ధతిగా ఉర్జిత్ పాటిల్ భావించారు. అలా చేయడం వల్ల ఎలెక్టోరల్ బాండ్లను మనీ లాండరింగ్ కోసం దుర్వినియోగ పరిచే అవకాశం ఉండదు. ఇది సురక్షితమైన పద్థతి. పైగా ఖర్చు కూడా తగ్గుతుందని ఆయన అన్నారు. డిమాండ్ రూపంలో ఎలెక్టోరల్ బాండ్లను జారీ చేయడం అనేది కేంద్ర బ్యాంకు డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టడంతో సమానమవుతుంది. ఇతర బ్యాంకులేవి ఇలాంటి పత్రాలను జారీ చేసే అవకాశం కూడా ఉండదు. ఈ లేఖకు అప్పటి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రతిస్పందించలేదు. కాని ఫైనాన్స్ సెక్రటరీ సుభాష్ గార్గ్ జవాబు రాశారు. డిజిటల్ ఎలెక్టోరల్ బాండ్ల ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించారు.

దాత గుర్తింపు తెలియకుండా ఉండాలనే అసలు ఉద్దేశం ఎలెక్టోరల్ బాండ్లను డిజిటల్ రూపంలో ఇస్తే దెబ్బతింటుందని ఆయన వాదించాడు. కాని ఉర్జిత్ పాటిల్ అభ్యంతరంలో ముఖ్యమైన విషయమేమంటే, కేంద్రబ్యాంకు అధికారాల్లో జోక్యం చేసుకుంటూ, ఎలెక్టోరల్ బాండ్లు జారీ చేసే అధికారం ఇతరులకు కూడా ఇవ్వడం గురించి ఆయన జవాబులో ఇది కేవలం ఒక అవకాశం మాత్రమేనని, స్కీం ప్రారంభమైన తర్వాత ఎలెక్టోరల్ బాండ్లను కేంద్ర బ్యాంకు మాత్రమే జారీ చేస్తుందని హామీ ఇచ్చారు. దీనిపై ఉర్జిత్ పాటిల్ మరో లేఖ రాశారు. సెప్టెంబర్ 27వ తేదీన రాసిన ఆ లేఖలో, రిజర్వు బ్యాంకు కమిటీ ఎలెక్టోరల్ బాండ్లను చర్చించిందని చెబుతూ కమిటీ సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన వివిధ అభ్యంతరాలను వివరించారు.

రిజర్వుబ్యాంకు చట్టం సెక్షన్ 31కి చేసిన సవరణ గురించి అభ్యంతరం చెప్పారు. ఈ సవరణ ద్వారా రిజర్వు బ్యాంకు అధికారాలను తగ్గించారని చెప్పారు. ఎలెక్టోరల్ బాండ్లను ఏ పేరుతో పిలిచినా అవి కరెన్సీ మాదిరిగా ఉపయోగపడతాయని అన్నారు. అలాగే డిజిటల్ రూపంలో కాకుండా, సర్టిఫికేటు రూపంలో జారీ చేయడం వల్ల లావాదేవీల జాడలు కనిపెట్టడం సాధ్యం కాదని చెప్పారు. ఈ స్కీమును దుర్వినియోగం చేసే అవకాశాలు కల్పించడమేనన్నారు. ఇలా సర్టిఫికేట్ల రూపంలో ఎలెక్టోరల్ బాండ్లను జారీ చేస్తే మనీలాండరింగ్ అవకాశం పెరుగుతుందని హెచ్చరించారు. అంతేకాదు, ఇలాంటి ఎలెక్టోరల్ బాండ్లను జారీ చేయడం వల్ల నోట్ల రద్దు సాధించిన ప్రయోజనాలు నాశనం అవుతాయని చెప్పారు.

నోట్ల రద్దు సాధించిందంటూ ఏమన్నా ఉంటే, బ్యాంకు పరిధిలోకి రాకుండా, అసంఘటిత రంగంలో ఉన్న కరెన్సీ అంతా బ్యాంకుల పరిధిలోకి వచ్చింది. బ్యాంకు వ్యవస్థలోకి కరెన్సీ మొత్తం తీసుకు రావడం నోట్ల రద్దు సాధించిన ఒకే ఒక్క ప్రయోజనం అని చెప్పవచ్చు. నోట్ల రద్దు వల్ల రిజర్వు బ్యాంకు విశ్వసనీయత కూడా కొంత దెబ్బ తిన్నది. దానిపై విమర్శలు కూడా వచ్చాయి. నోట్ల రద్దుకు ప్రజలు కూడా సహకరించారు. ఈ క్రమంలో ప్రజలు అనేక ఇబ్బందులను కూడా భరించారు. కాని ఇప్పుడు ఇన్ని ఇబ్బందులతో సాధించిన ఆ ఒక్క విజయం కూడా ఎలెక్టోరల్ బాండ్లను జారీ చేయడం ద్వారా నిర్వీర్యం అయిపోయింది.

ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు, నిరర్థక ఆస్తులపై చర్యలు మొదలైన అనేక చర్యలు అవినీతిపై, నల్లధనంపై పోరాటంగా ప్రచారం చేశారు. ప్రజలు కూడా నమ్మారు. కాని ఇప్పుడు ఎలెక్టోరల్ బాండ్ల రూపంలో జారీ చేస్తున్న సర్టిఫికేట్ల వల్ల నల్ల డబ్బును ప్రోత్సహించే తలుపులు తెరిచేశారనే అభిప్రాయం ప్రజల్లో కలగవచ్చని ఉర్జిత్ పాటిల్ హెచ్చరించారు. రిజర్వు బ్యాంకు కమిటీ అందువల్ల ఎలెక్టోరల్ బాండ్ల నిర్ణయాన్ని పునరాలోచించాలని సిఫారసు చేసింది. ముఖ్యంగా ఎలెక్టోరల్ బాండ్లను సర్టిఫికేట్ల రూపంలో ఇవ్వడం గురించి మళ్ళీ ఆలోచించాలని చెప్పింది.

కాని రెండవ లేఖకు కూడా అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిస్పందించ లేదు. ఆయనకు బదులు మళ్ళీ ఫైనాన్స్ సెక్రటరీ గార్గ్ జవాబిచ్చారు. రిజర్వు బ్యాంకు అభ్యంతరాలను, భయాలను కొట్టి పారేశారు. రిజర్వు బ్యాంకు సూచనలను ప్రభుత్వం గౌరవిస్తుంది కాని తుది నిర్ణయం ప్రభుత్వానిదే అని చెప్పేశారు. ఏది ఏమైనా అప్పట్లో నోట ్లరద్దు కాలంలో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న రిజర్వు బ్యాంకు గవర్నర్, ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించడానికి ఎంతో కష్టపడిన ఉర్జిత్ పాటిల్ తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. ఎలెక్టోరల్ బాండ్ల విషయంలో ఆయన అభిప్రాయాన్ని ప్రభుత్వం పట్టించుకో లేదు. అంతకు ముందు, నోట్ల రద్దు విషయంలో కూడా రఘురాం రాజన్ అభిప్రాయాన్ని ప్రభుత్వం పట్టించుకో లేదు.

Modi PMO Ordered Illegal Electoral Bonds Sale