Home ఎడిటోరియల్ ఆశ నుంచి నిరాశలోకి

ఆశ నుంచి నిరాశలోకి

Optical Fiber Linked with One Lakh Villages

పెట్టుబడికి ప్రతిఫలమిచ్చే దేశంగా, వృద్ధికి గమ్యంగా భారతదేశం గూర్చిన భావనను గోల్డ్‌మన్ సాచెస్, నొముర (Nomura) నేత్రుత్వంలో ప్రపంచ పెట్టుబడి బ్యాంకర్లు ఆకస్మికంగా మార్చుకోవటం అసాధారణంగా కనిపిస్తున్నది. గత నెలలో నొముర రీసెర్చి నివేదిక ‘భారతదేశంలో రాజకీయ అస్థిరత పెరుగుతున్నది. బిజెపి వెనకడుగులో ఉంది. ఈ పరిణామం సంస్కరణలను దెబ్బతీస్తుంది’ అని పేర్కొన్నది. రాజకీయ రిస్క్ ‘తప్పనిసరిగా తక్కువ చేయబడింది’ అని ముగించింది. లోక్‌సభ ఎన్నికలు మామూలుగా జరగాల్సిన 2019 ఏప్రిల్ మే నుంచి ముందుగా 2018 చివరి త్రైమాసికానికి (సెప్టెంబర్ డిసెంబర్) జరగవచ్చునని ఆ పెట్టుబడి బ్యాంక్ కరాఖండీగా చెప్పింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 2 బిలియన్ డాలర్లు పైబడిన కుంభకోణం నేపథ్యంలో భారత దేశ వృద్ధి అంచనా తగ్గించిన గోల్డ్‌మన్ సాచెస్ నివేదిక సమయంలోనే నొముర నివేదిక వచ్చింది. పెరుగుతున్న బ్యాంక్ మోసాల నేపథ్యంలో బ్యాంకింగ్ రంగం నియంత్రణలు కఠినమై పరపతి వృద్ధికి ఇబ్బందులు కలుగవచ్చని అది హెచ్చరిక చేసింది. తన క్లెయింట్‌లకు నోట్‌లో గోల్డ్‌మన్ సాచెస్, 2019 సంవత్సరం భారత దేశ జిడిపి వృద్ధిరేటు అంచనాను 8 నుంచి 7.6 శాతానికి తగ్గించింది.

గోల్డ్‌మన్ సాచెస్ గత నివేదిక వరకు మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా సమర్థించింది. ఇది దాని తొలి ప్రతికూల నివేదిక. ‘మోడీపట్ల మా దృక్పథం భారత దేశ మార్కెట్ ప్రభావాన్ని పెంచుతుంది’ శీర్షికతో గోల్డ్‌మన్ సాచెస్ నివేదిక దుమారం రేపింది. తమ అభిప్రాయానికి సమర్థనగా సాచెస్‌కు చెందిన తిమోతి మొయి, అతని బృందం ఆరు ముఖ్య కారణాలు చెప్పింది. అయితే తొలి కారణం ‘బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నాయకత్వంలో రాజకీయ మార్పుపై ఆశాభావం ఆర్థిక ఆలోచనల్లో ప్రధానమైంది’ అన్న అభిప్రాయం దుమారం రేపింది. ‘మోడీ ఆయన పార్టీ గతంలో మౌలిక వసతులు, పెట్టుబడి వ్యయంపై దృష్టిపెట్టాయి. అందువల్ల, బిజెపి నాయకత్వ ప్రభుత్వం పెట్టుబడులకు డిమాండ్ పెరగటానికి దోహదం చేస్తుందని మా అభిప్రాయం అని మొయి వాదించారు. “స్థూల స్థాయిలో భారతదేశం ప్రస్తుత ఎదుర్కొంటున్న సవాళ్లు విదేశీ, ద్రవ్య అసమతులనం, హెచ్చు ద్రవ్యోల్బణం, బిగింపుతో కూడిన మానిటరీ (ద్రవ్య విధాన సంబంధమైన) విధానం. రాజకీయ మార్పు ఆశాభావాల్లో ఇవి ఆధిక్యం వహిస్తున్నాయి. 2014 మే నెలలో జరిగే పార్లమెంటరీ ఎన్నికల్లో బిజెపి నాయకత్వంలో ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని భావించబడుతున్నది. బిజెపిని వ్యాపార మిత్ర పార్టీగా మూలపెట్టుబడి మదుపుదారులు చూపటం కద్దు. బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ మార్పుకు సాధనం. వచ్చే (2014) సార్వత్రిక ఎన్నికలకు ప్రధాన సూచీలుగా పరిగణించబడుతున్న రానున్న ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ, బిజెపి మంచి ఫలితాలు సా ధించనున్నట్లు అభిప్రాయ పోల్స్ తెలియజేస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలి తం ఎలా ఉంటుందో స్పష్టం గా చెప్పలేనప్పటికీ మార్కెట్ వచ్చే6 మాసాల్లో దీన్ని సాను కూలంగా ఉపయోగించుకోవచ్చు. మా వైఖరి మోడీకి అనుకూలం కావటానికి ఇదే కారణం” అని మొయి బృందం వాదించింది.

కాంగ్రెస్ నాయకుడు, నాటి కేంద్ర వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ దీనిపై తీవ్రంగా స్పందిస్తూ, గోల్డ్‌మన్ సాచెస్ నివేదిక “అసహేతుకం, అభ్యంతరకరం” అన్నారు. “ఇటువంటి రోజువారీ సర్టిఫికేషన్ లేదా హామీ మాకు అవసరం లేదు. మాది ఆత్మవిశ్వాసం గల దేశం. ప్రజాస్వామ్యంతో ఏ మాత్రం సంబంధంలేనటువంటి వారి నుంచి భారతదేశ ప్ర జాస్వామ్యం గురించి ఎటువంటి సూత్రీకరణలను మేము స్వీకరించాల్సిన పని లేదు. మాకు 80 కోట్ల మందికి పైగా ఓటర్లున్నారు. ఏ ధర్మోపదేశాలైనా వారి సమష్టి విజ్ఞతను అవమానించటమే” అన్నారు. గోల్డ్‌మెన్ సాచెస్ అందుకు సమాధానంగా, “మా ఆసియా పసిఫిక్ విభాగం నివేదికలో ఎటువంటి రాజకీయ పక్షపాతం లేదు. గోల్డ్‌మన్ సాచెస్, లేదా దాని విశ్లేషకులు ఎటువంటి రాజకీయ అభిప్రాయం కలిగిలేరు. పెట్టుబడులు పెట్టేవారి మనోభావం పార్టీ రాజకీయాలతో ప్రభావవంతమవుతుందని మాత్రమే నివేదిక చెప్పింది. ఆ అభిప్రాయంని, మా రీసెర్చిని మేము సమర్థిస్తున్నాం” అని చెప్పింది.

ఇప్పుడు అదే గోల్డ్‌మన్ సాచెస్ భిన్నమైన బాణీని, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన బాణీ వినిపిస్తోంది. 32 బిలియన్ డాలర్ల బ్యాంక్ రీక్యాపిటలైజేషన్ ప్రణాళిక పరపతిని పెంచుతుందని ఆశించిన ప్రభుత్వానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో మోసంపై పెట్టుబడి బ్యాంకర్ హెచ్చరిక పెద్ద ఎదురు దెబ్బ. గత నెలలో బయటపడిన ఈ కుంభకోణంతో బ్యాంక్ షేర్ల విలువ తరుగుతున్నది. అటు తర్వాత అనేక బ్యాంకుల్లో బయటపడిన అనేక చిన్నస్థాయి మోసాలు రుణాలు త్వరలో వృద్ధి చెందే అవకాశాన్ని దెబ్బతీశాయి. బ్యాంకింగ్ ఆస్తుల్లో మూడింట రెండు వంతులు కలిగి ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే పారు బాకీల (నిరర్థక ఆస్తులు) భారం మోస్తున్నాయి. పరపతి నాణ్యత సమస్య వాస్తవం అని అంగీకరించని వారుండరు. రోజుకు నాలుగు కంపెనీలు దివాలా ఎదుర్కొంటున్నందున భారత కార్పొరేట్ రంగం తన రుణ సమస్యల్ని అధిగమించ లేదు. గోల్డ్‌మన్ సాచెస్ తాజా నివేదిక ప్రభుత్వానికి ఆందోళన కలిగించక మానదు.