Saturday, April 20, 2024

కక్ష సాధింపు!

- Advertisement -
- Advertisement -

Modi should take steps to satisfy Farmers

 

కక్షకు, పదునైన కత్తికి తేడా ఉండదు. అది పాలకుల మెదడులో చేరి తిష్ట వేసుకుంటే ప్రజాస్వామిక వ్యవస్థలను, సంస్థలను కూడా ఆవహించి జాతి హితానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. స్వాతంత్య్రానంతరం ప్రజాస్వామిక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారం చేపట్టిన ప్రభుత్వాలు ఇంచుమించు అన్నీ తమ ఆధీనంలోని నేర పరిశోధక విభాగాలను, నిఘా సంస్థలను రాజకీయ ప్రత్యర్థుల మీదికి ఉసిగొల్పినవే అనడం అబద్ధం కాదు. ప్రధాని మోడీ ప్రభుత్వం ఈ విషయంలో అత్యధిక మార్కులు కొట్టేసే ఆత్రుతతో అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఒకవైపు హిందు త్వ పాలనతో మైనారిటీలకు ఇబ్బందులు సృష్టించే చర్యలకు పాల్పడుతూ, మరొకవైపు తన శాసనాలను, నిర్ణయాలను సవాలు చేసే వ్యక్తులను, శక్తులను సమస్యల పాలు చేయడానికి పావులు కదుపుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. కర్నాటక వంటి రాష్ట్రాలలో ఎన్నికల సమయంలో బిజెపికి కొరకరాని కొయ్యల్లా తయారైన ఎదిరిపక్ష నాయకులు, మంత్రుల ఇళ్లల్లో సోదాలు, నగదు స్వాధీనాలు జరిపించిన ఉదంతాలు తెలిసినవే.

ఇప్పుడు మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు రెండు మాసాలుగా ఢిల్లీ సరిహద్దుల్లో భీషణ ఉద్యమం నడుపుతున్న రైతు నాయకుల మీద అందుకు మద్దతు ఇస్తున్న వారి మీద ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ), ఆదాయపు పన్ను శాఖ వంటి వాటిని ప్రయోగిస్తున్నట్టు వార్తలు చెబుతున్నాయి. రైతు ఉద్యమానికి అండగా నిలిచిన పంజాబ్‌కు చెందిన కనీసం ఆరుగురు అర్హతీయాల (కమీషన్ ఏజెంట్లు) ఇళ్లపై గత నెలలో ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపింది. అలాగే, ప్రముఖ పంజాబీ గాయకుడు రంజిత్ బావాను ఇడి లక్షంగా చేసుకున్నట్టు తెలిసింది. రైతు ఉద్యమాన్ని సమర్థిస్తూ అక్టోబర్ నెలలో ‘కఠోర సత్యం’ అనే పేరుతో బావా తన మొదటి పాటను విడుదల చేశారు. మాదక ద్రవ్యాల దొంగ రవాణా ఆరోపణ మీద పోలీసులు అరెస్టు చేసిన గుర్ దీప్ సింగ్ రానోతో సంబంధాలున్నాయంటూ ఆయనపై జలంధర్‌కు చెందిన బిజెపి నాయకుడొకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రైతు ఉద్యమంపై బావా రెండో పాట గత నెల 8వ తేదీన బయటికి వచ్చింది.

ఉద్యమ నాయకుల బ్యాంకు ఖాతాల మీద కూడా ఆదాయపు పన్ను శాఖ నిఘా పెంచింది. విదేశాల నుంచి విరాళాలందుతున్నాయనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నది. అలాగే, రైతు ఉద్యమంలో ఖలిస్థాన్ ఉగ్రవాదులున్నట్టు సాగించిన ప్రచారానికి అనుగుణంగా కొంత మంది నేతలకు జాతీయ దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. రైతు ఉద్యమానికి పంజాబ్, హర్యానాల్లోనే కాక దేశమంతటా సానుభూతి పరులు రోజురోజుకీ పెరుగుతున్నారు. వ్యవసాయ మార్కెట్లలో కీలక పాత్ర పోషించే పంజాబ్‌లోని కమీషన్ ఏజెంట్లు మున్నగు వారు సహజంగానే ఉద్యమానికి విశేష సహాయాన్ని అందిస్తున్నారు. వారిని కేసుల్లో ఇరికిస్తే ఆందోళన మూలాలు తెగిపోయి చివరికి సద్దుమణిగిపోతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం తన చేతిలోని దర్యాప్తు, నిఘా సంస్థలను ప్రయోగిస్తున్నది. ఉద్యమం కొనసాగుతున్న కొద్దీ ఈ వ్యూహం పదునెక్కుతున్నది. రైతు ఉద్యమంలో పాలు పంచుకుంటున్న వారి మీద, దానికి మద్దతు అందిస్తున్న వారిపైన, బస్సులు, లంగార్లు (వంట, భోజన శాలలు) సమకూర్చిన వారిపైన, ఉద్యమంలో చనిపోతున్న రైతుల కుటుంబాలను ఆదుకుంటున్న వారి మీద జాతీయ దర్యాప్తు సంస్థ కేసులు నమోదు చేయడం ప్రారంభించిందని క్రాంతికారి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు దర్శన్ పాల్ సింఘు సరిహద్దుల్లో ఆదివారం నాడు మీడియాతో చెప్పారు.

ఈ దాడులు, నోటీసులు, కేసుల విషయం ప్రభుత్వంతో చర్చల్లో రైతులు ప్రస్తావించారు. ప్రభుత్వ ప్రతినిధులు సూటిగా సమాధానం ఇవ్వకుండా దాటవేస్తున్నారు. రాజ్యసభలో ఓటింగ్‌కు కూడా అవకాశం ఇవ్వకుండా ఆమోదింప చేసుకున్న మూడు సాగు చట్టాలు, కొత్త విద్యుత్తు బిల్లు తమను తీవ్రంగా నష్ట, కష్టాలు చేస్తాయని రైతులు గట్టిగా నమ్ముతున్నారు. వాటిని నిశ్శేషంగా రద్దు చేయాలని కోరుతున్నారు. అందుకు అదేపనిగా తిరస్కరిస్తున్న ప్రభుత్వం వాటి వల్ల రైతులకు ఏమి మేలు జరుగుతుందని తాను భావిస్తున్నదో వారికి చెప్పి ఒప్పించలేకపోతున్నది.

ఆ చట్టాలు తమ కోసం కాక కార్పొరేట్ శక్తుల పెట్టుబడులకు విశేష లాభాలు చేకూర్చడమనే ఏకైక లక్షంతో తెచ్చినవని రైతులే కాదు మెజారిటీ దేశ ప్రజలూ భావిస్తున్నారు. ఉద్యమం కొనసాగే కొద్దీ తన బండారం మరింతగా బయటపడి పరువు గంగ లో పూర్తిగా కలిసిపోతుందని భయపడుతున్న కేంద్రం రేపటి రిపబ్లిక్ దినోత్సవం నాటి రైతుల ట్రాక్టర్ ర్యాలీకి ముందే వారిని కేసులతో భయపెట్టి ఇళ్లకు వెళ్లిపోయేలా చేయాలని చూస్తున్నట్టు బోధపడుతున్నది. తిండి పెట్టే చేతులను నరకాలనుకోడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు. ప్రధాని మోడీ ఇప్పటికైనా పునరాలోచించుకొని రైతులను సంతృప్తి పరిచే చర్యలను తీసుకోవాలి. వారిపై కక్ష సాధింపు ధోరణికి స్వస్తి చెప్పాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News