Home అంతర్జాతీయ వార్తలు షాంఘైలో మోడీ హెల్త్ మంత్రం…

షాంఘైలో మోడీ హెల్త్ మంత్రం…

pm modi

 

ఎస్‌ఓసి సభ్య దేశాల మధ్య మరింత సహకారానికి పిలుపు , ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో ఖండించిన సభ్య దేశాలు , సంయుక్త ప్రకటన విడుదల

బిష్కెక్: ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం, ప్రత్యామ్నాయ ఇంధనం, ఆరోగ్య, వైద్య సేవల విషయంలో షాంఘై సహకార సంస్థ (ఎస్‌ఓసి) సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరమని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో శాంతి, ఆర్థిక పురోభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని కూడా ఆయన చెప్పారు. కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న షాంఘై సహకార సదస్సులో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన ఎస్‌ఓసి సభ్య దేశాలకు ‘హెల్త్’ మంత్రాన్ని చెప్పారు. ‘HEALTH’ అనే పదంలో ఒకో అక్షరానికి ఒక్కో అర్థముందని చెప్పారు. హెచ్ అంటే హెల్త్ అండ్ మెడికేర్ (ఆరోగ్య సహకారం, ఇ అంటే ఎకో (పర్యావరణ సహకారం), ఎ అంటే ఆల్టర్నేట్ (ప్రత్యామ్నాయ అనుసంధానం), ఎల్ అంటే లిటరేచర్ (అక్షరాస్యతపై అవగాహన), టి అంటే టెర్రరిజం ఫ్రీ సొసైటీ (ఉగ్రవాద రహిత సమాజం),హెచ్ అంటే హ్యూమానిటీ(మానవత్వ సహకారం) అని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా ప్రపంచ దేశాలన్నీ అయిదు విషయాలలో పరస్పరం సహకరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్‌సిఓలో భారత్ రెండేళ్లుగా శాశ్వత సభ్య దేశంగా ఉందని, ఈ రెండేళ్లలో ఎస్‌సిఓ చేపట్టే అన్ని కార్యక్రమాలకు సహకారం అందించామని మోడీ చెప్పారు.

ఎస్‌సిఓ ప్రాంతం, భారత దేశ చరిత్ర, నాగరికత, సంస్కృతులు వేలాది సంవత్సరాలుగా ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. అంతర్జాతీయ వేదికలపై ఎస్‌సిఓ విశ్వసనీయతను పెంచేందుకు మున్ముందు మరింత సహకారం అందిస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా శ్రీలంకలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని కూడా ఆయన ప్రస్తావించారు.‘అక్షరాస్యత, సంస్కృతీ సంప్రదాయాలు సమాజంలో సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తాయి. యువతలో తీవ్రవాద భావజాల వ్యాప్తిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని మోడీ అన్నారు.

భౌతిక అనుసంధానం ఎంత ముఖ్యమో, ప్రజల మధ్య సంబంధాలు కూడా అంతే ముఖ్యమని చైనా చేపడుతున్న చైనాపాకిస్తాన్ ఆర్థిక కారిడార్ నిర్మాణాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రధాని అన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌గుండా వెళ్తున్న ఈ కారిడార్ నిర్మాణాన్ని భారత్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఎస్‌సిఓ సభ్య దేశాల్లో చాలా వాటికి భారత దేశ ఇటూరిస్టు వీసా సదుపాయం అందుబాటులో ఉందని మోడీ చెప్పారు. ఎస్‌సిఓ దేశాల పర్యాటకుల సౌకర్యార్థం భారత పర్యాటక వెబ్‌సైట్‌లో24 గంటలు పని చేసే ఒక హెల్‌లైన్‌ను రష్యన్ భాషలో త్వరలో ప్రారంభించనున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఆరోగ్య ప్రణాళికకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటూ, టెలీ మెడిసిన్, హెల్త్ టూరిజం రంగాల్ల్లో తన అనుభవాలను ఎస్‌సిఓ సభ్య దేశాలతో పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఒక దేశ సాహిత్యాన్ని మరో దేశ యువతకు పరిచయం చేయడం వల్ల మన సంబంధాలు బలోపేతం అవుతాయని మోడీ అంటూ, భారత దేశ సాహిత్యానికి చెందిన పది ప్రముఖ సాహిత్యాలను ఎస్‌సిఓ సభ్య దేశాల భాషల్లోకి తర్జుమా చేయడం జరుగుతుందని చెప్పారు. అలాగే ప్రకృతి విపత్తులు, మానవతా సాయం విషయంలో భారత్ అందరికన్నా ముందుగా స్పందిస్తూ వస్తోందని కూడా మోడీ తెలిపారు.

ఉగ్రవాదంపై సమగ్ర పోరు

కాగా, భారత్‌తో పాటుగా ఎస్‌సిఓ సభ్య దేశాలన్నీ అన్ని రకాల ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో ఖండించాయి. శుక్రవారం ఎస్‌సిఓ సభ్య దేశాల అధినేతల సమావేశం అనంతరం విడుదల చేసిన ఓ సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఉగ్రవాదం, తీవ్రవాద చర్యలు ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఈ దేశాధినేతలు స్పష్టం చేశారు. ఉగ్రవాదం, ఇంటర్నెట్ ద్వారా ఉగ్రవాదం, తీవ్రవాద భావజాలం వ్యాప్తి, జన హనన ఆయుధాల వ్యాప్తి, దేశాల మధ్య ఆయుధ పోటీ లాంటి వాటిపై ప్రపంచ దేశాలన్నీ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆ డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా ఉగ్రవాదాన్ని నిరోధించడానికి ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించాలని డిక్లరేషన్‌లో పిలుపునిచ్చారు.

Modi’s Health Mantra in Shanghai