Home ఎడిటోరియల్ ఎగ్జిట్ ఫలితాలు

ఎగ్జిట్ ఫలితాలు

Monday rally just the beginning of exit poll results hold true               ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ఉవ్వెత్తు కెరటాల మీద స్టాక్ మార్కెట్ సూచీ అపూర్వ శిఖరాలను తాకింది. పదేళ్ల నాటి ఉరవడిని మళ్లీ చూపింది. అసలు ఫలితాలెలా ఉన్నప్పటికీ ఈ మూడు రోజులూ దాని ఉధృతికి పట్ట పగ్గాలుండవనిపిస్తోంది. ఇందుకు మార్కెట్ పెద్దలను నిందించలేం. సహజంగానే వారు భారతీయ జనతా పార్టీ అభిమానులు కావడానికే అవకాశాలెక్కువ. అందులోనూ బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ 543 స్థానాలున్న లోక్‌సభలో 300పైచిలుకు సీట్లను గెలుచుకొని సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయగల పరిస్థితి మార్కెట్ అనుకూల మైనదే. ఎన్‌డిఎ అనే కాదు ఏ ప్రభుత్వమైనా తుమ్మితే ఊడే ముక్కులా కాకుండా ఐదేళ్లూ బలంగా వేళ్లూనుకొని సుస్థిరంగా కొనసాగడమనేది తన ప్రయోజనాల కనుగుణమైన స్థితి అని స్టాక్ మార్కెట్ భావిస్తుంది. ఈ దృష్టితో చూసినప్పుడు ఎగ్జిట్ ఫలితాలు వెలువడగానే మార్కెట్‌లో కనిపించిన అనూహ్యమైన, అసాధారణమైన ఆనందోత్సాహాలు అర్థం చేసుకోదగినవే. అయితే 23వ తేదీన వెలువడే అసలు ఫలితాలు వీటిని ఎంతవరకు నిలబడనిస్తాయో వేచి చూడాలి. అన్ని ఎగ్జిట్ సర్వేలూ ఒక్క గొంతుతో ఎన్‌డిఎకి ఎదురులేని మెజార్టీ ఇచ్చాయి.

ఒక్కటంటే ఒక్కటైనా భిన్నమైన ఫలితాన్ని ప్రకటించలేదు. తర తమంగానైనా బిజెపి సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమికే దాదాపు 300, ఆపై చిలుకు స్థానాలు లభిస్తాయని చెప్పాయి. ఎన్‌డిఎ దరిదాపుల్లోనైనా ఉంచకుండా యుపిఎను, కాంగ్రెస్‌ను చాలా వెనుకకు నెట్టేశాయి. ఇంతకాలం చర్చల్లో, విశ్లేషణల్లో బాహాటంగా కనిపించిన మోడీ వ్యతిరేకత ఏమైంది? అదంతా పోయి ఉన్నట్టుండి ఇంతటి సానుకూల వాతావరణం కమలనాథులకు ఎలా సంక్రమించి ఉంటుంది? ఇది మళ్లీ మరో మోడీ ప్రభంజనమా? పెద్ద నోట్ల రద్దు, వస్తుసేవల పన్ను అవకతవక అమలు, కనీవినీ ఎరుగని నిరుద్యోగం, తీవ్ర వ్యవసాయ సంక్షోభం వగైరాలేవీ ప్రజల్లో మోడీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచలేకపోయాయా? అవే తమకు మంచి పరిణామాలని ఓటర్లు భావించారా? రాహుల్ గాంధీ ఘనంగా చెప్పిన ‘న్యాయ్’ (నెలనెలా పేదలకు నికరాదాయం) పథకం ఎవరినీ ఆకట్టుకోలేకపోయినట్టేనా? కశ్మీర్‌లోని పుల్వామాలో సిఆర్‌పిఎఫ్ వాహన శ్రేణిపై విరుచుకుపడి 40మందికిపైగా జవాన్లను హతమార్చిన ఘాతుక, ముష్కర టెర్రరిస్టు ఆత్మాహుతి దాడి, దాని అనంతర పరిణామాల కారణంగా ఓటర్లు జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నరేంద్ర మోడీ వల్లనే దేశం సురక్షితంగా ఉంటుందని భావించారా? పుల్వామా దారుణం తర్వాత పాకిస్తాన్‌లోని బటాలాపై మన వైమానిక దళం విజయవంతంగా జరిపిన మెరుపుదాడులను మోడీ ఖాతాలో వేసి, యోగి ఆదిత్యనాథ్ పొగిడినట్టు భారత సైన్యాన్ని మోడీ దళంగానే ప్రజలు కూడా భావించారా? వాస్తవమేదైనప్పటికీ ఎగ్జిట్ ఫలితాలే అసలువిగా 23వ తేదీన వెలువడితే అందుకు గల కారణాల లోతులను తరచి చూడాల్సి వుంటుంది.

ఈ ఎన్నికల్లో ఉత్తర, దక్షిణ భారతాల ఓటు పడిన విధం ఎటువంటిదో చూడక తప్పదు. యుపి సహా ఉత్తరాది , తూర్పు భారతం మోడీని నెత్తిన పెట్టుకుంటే దక్షిణాది అందుకు భిన్నంగా బిజెపిని తిరస్కరిస్తే అది రెండు భారతాల మధ్య రాజకీయ దూరాన్ని మళ్లీ చూపిస్తుంది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో బిజెపి ఉత్తరప్రదేశ్‌పై దాదాపు ఆశలు వదులుకుంది. అదే యుపిలో ఇంచుమించు సగం స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అలాగే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని తిరస్కరించిన మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో దానికి మంచి విజయాలు సిద్ధించగలవని ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ తీవ్రంగా దెబ్బతినగలదని ఈ ఫలితాలు ప్రకటించాయి.

పశ్చిమబెంగాల్‌లో కూడా బిజెపి బాగా గెలుచుకోగలదని చెప్పాయి. ఇవన్నీ నిజంగానే నిజమైతే పుల్వామా ఘటన భారతీయ జనతా పార్టీకి ఈ ఎన్నికల్లో బాగా కలిసొచ్చిందని అనుకోవాల్సి వుంటుంది. బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం హిందుత్వ రాజకీయాలు బలోపేతమై బిజెపి అనూహ్యంగా పుంజుకునేలా చేశాయి. 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్‌ను కేంద్రంలో అధికారంలోకి తెచ్చిన దేశ ప్రజలు ఆ పాలనలో అవినీతి మితిమించిపోవడంతో 2014లో ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయకుండా ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీశారు. యుపిఎ ఆనవాయితీ ప్రకారమైతే ఈసారి కూడా ఎన్‌డిఎ మళ్లీ అధికారంలోకి రావడం సహజం. అయితే మోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి వంటి నిర్ణయాల పట్ల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకిన దృశ్యం ఈ ఎన్నికల్లో పనిచేయలేదా అనే ప్రశ్నకే రేపటి ఫలితాల్లో జవాబు దొరకవలసి ఉంది.

Monday rally just the beginning of exit poll results hold true