Friday, April 19, 2024

పిల్లి – కోతి స్నేహం…

- Advertisement -
- Advertisement -

 

ఒక కోతి పిల్లితో స్నేహం చేసింది. అవి రెండూ ఎంతో అన్యోన్యంగా ఉండసాగాయి. కోతి తాను తీసుకొని వచ్చిన అరటిపండ్లు, కొబ్బరిముక్కలు పిల్లికి పెట్టేది. పిల్లికి ఏ ఆహారం దొరికేది కాదు. అందువల్ల కోతిపైనే అది ఆధారపడేది. ఇలా ఉండగా వీటి స్నేహాన్ని చూసిన నక్కకు కన్నుకుట్టింది. అది ఎలాగైనా పిల్లిని, కోతిని వీడదీయాలనుకుంది. అందుకే పిల్లిని మొదట పిలిచి తన ఇంట్లో పాయసం వండి పెట్టింది. తర్వాత కోతిపై చాడీలు చెప్పింది. పిల్లి దాని మాటలు నమ్మింది.

అలాగే నక్క కోతిని కూడా విందుకు పిలిచింది. కోతికి కూడా పిల్లిపై ఉన్నవీ, లేనివీ కల్పించి చెప్పింది.  “నీవు తీసుకొని వచ్చిన ఆహారం తినడం తప్ప ఒక్కరోజైనా పిల్లి తెచ్చిందా” అని ప్రశ్నించింది. అది విని కోతి కూడా నక్క మాటలు నమ్మింది. కోతి తాను ఆహారం తిని పిల్లికి తేవడం మానుకుంది. కోతిలో వచ్చిన మార్పును పిల్లి గమనించి “కోతి బావా! నీవు నాకు ఎందుకు ఆహారం తెచ్చి ఇవ్వడం లేదు”అని ప్రశ్నించింది. “నీకు తెచ్చి ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు” అని అంది కోతి. అప్పుడు పిల్లి “ఇది నక్క పనే” అని గ్రహించి, కోతికి నక్క చెప్పిన చాడీల మాటలన్నీ పూసగుచ్చినట్లు చెప్పింది. అవి రెండూ నక్క ముందు నాటకం ఆడాలని నిర్ణయించుకున్నాయి.

నక్క మరొక్క రోజు పిల్లిని విందుకు పిలిచింది. తాను నక్క ఇంటికి వెళుతున్నట్లు పిల్లి చెప్పింది. కోతి పిల్లిని వెళ్ళమని, తాను తర్వాత వస్తానని చెప్పింది. ఆ సంగతి నక్కకు చెప్పవద్దని కోతి కోరింది. అందుకు పిల్లి సరేనంది. ముందు కోతిని నానామాటలు అంది. అప్పుడే అక్కడకు కోతి వచ్చింది. కోతికి కూడా నక్క పాయసం పెట్టక తప్పలేదు. అప్పుడు కోతి నక్కతో “నీ పాయసానికి ఆశపడి నేను రాలేదు. నా మిత్రురాలైన పిల్లికి నా మీద లేనిపోని చాడీలు చెప్పి దానిని నాకు దూరం చేస్తావా? నీ పని చెబుతా నుండు” అని కోపంతో అంది. వెంటనే పిల్లి కూడా “దుర్మార్గులారా! నేను నీ మాటలు నమ్మానని అనుకుంటున్నావా! నీ పని పడతా ఆగు” అని నక్కతో అంది.

పిల్లి, కోతి రెండూ కలిసి నక్కను రక్కుదామని చూశాయి. అప్పటికే నక్క అక్కడ నుండి పలాయనం చిత్తగించింది. కోతి, పిల్లి అప్పటి నుండి ఒకరి కష్టాలు మరొకరితో చెప్పుకొని, ఇతరులు చెప్పిన చాడీలు వినకుండా ఎంతో అన్యోన్యంగా స్నేహధర్మాన్ని పాటించాయి.

నీతి: ఇతరులపై చాడీలు చెప్పరాదు.

సంగనభట్ల చిన్న రామకిష్టయ్య, 9908554535

Monkey and cat story in telugu
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News