Home తాజా వార్తలు నేనూ మాస్క్ ఏస్కున్నా… చూస్కో ( వైరల్ వీడియో)

నేనూ మాస్క్ ఏస్కున్నా… చూస్కో ( వైరల్ వీడియో)

Monkey wears cloth as mask video goes viral

హస్తినలో భళా వానర…వైరల్

న్యూఢిల్లీ : ఎవరో పెద్దలు చెప్పిన మాటలను బుద్ధిగా పాటిస్తున్నదీ కోతి. మంచిగా మాస్కేసుకుని చక్కగా చక్కర్లు కొడుతోంది. దేశ రాజధాని అందులోనూ కోవిడ్ 19 వైరస్ విజృంభణ పర్వం ఎక్కువగా ఉన్న ప్రాంతం. అందుకే తన జాగ్రత్తలు తాను తీసుకుంది. మాస్క్ కాదు ఏకంగా తన కళ్లు ముక్కు, నోరు చివరికి ముఖం కూడా కనబడకుండా చుట్టేసుకున్న ఓ వస్త్రంతో మాస్క్‌ధారిగా తన నిత్యజీవిత సమరంలో సాగుతోంది. తోటి నరులకు కరోనా సోకిన వేళ తాను ఎందుకు జాగ్రత్తలు తీసుకోకూడదు? అసలే కొందరు అజాగ్రత్తపరులైన మనుష్యులు ఉంటారు. వారు పీల్చే గాలి చేసే పనులు వైరస్‌ను నింపేసుకుని తనను చుట్టుముట్టితే తనకు ఇబ్బంది కదా…అనే బోలెడు సామాజిక స్పృహ సంతరించుకుని ఉన్న ఈ కోతిగారు ఇప్పు డు నడివీధులలో మాస్క్ తో తిరగడం వీరలెవెల్లో వైరల్ అయింది.

తాను తిరిగే ఢిల్లీ అంటువంటి ఇటువంటిది కాదు. పర మ వీర భయంకర కాలుష్యపు కాసారం. చుట్టుపక్కల ఆమడదూరాల నుంచి వచ్చి పడే పంట పొలాల మంటల వాయుకాలుష్యం. సిటీలో తిరిగే వాహనాల పొగరొదరొదలు. దీనిని జాగ్రత్తగా గమనించుకున్నట్టువంటిదైన ఈ వానరం ఇప్పుడు మాస్క్‌తో రాజాగా తిరుగుతోంది. ఈ మంకీ ఫోటోను అటవీ అధికారి సుశాంత నందా తీసి ట్విట్టర్‌లో పెట్టారు. ముసుగేసుకుని ఈ కోతి చేస్తున్న విన్యాసాలు మాస్కేసుకోకుండాతిరిగే మనుష్యులను కొంచెం ఇబ్బందిలోకి నెట్టినా నవ్వు తెప్పిస్తున్నాయట. ఈ వస్త్రం ఎక్కడి నుంచితెచ్చుకుందో ఏమో కానీ ఈ కోతి తన మెడ చుట్టూ పర్చుకునేలా చేసుకుంది. దీనితో ఏ వైరస్ దీనికి ఇసుమంతైనా సోకదంటే సోకదంతే. మనుష్యులు కూడా తీసుకోని విధంగా ఇది కరోనా జాగ్రత్తలు తీసుకుని తిరగడం సంచలనం అయింది.

ఇంతకు ముందెప్పుడూ ముఖాలకు ముసుగులు వేసుకోకుండా తిరిగే మనుష్యులు ఈ మధ్యకాలంలో మాస్క్‌లు వేసుకుని తిరుగుతూ ఉండటంతో, తాను అదే పనిచేస్తే పోలే..అనుకున్నట్లుగా ఉంది. ప్రత్యేకించి ఆడవాళ్లు కొంగులను తమ ముఖం కనబడకుండా ముసుగులా తన్నేసుకునే వైనాన్ని పసికట్టి ఈ కోతి ఈ విధంగా తన పని చేసుకుపోతోందని ఫోటో తీసిన సుశాంత నంద వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఈ ఫోటో చూసి పలువురు ప్రముఖులు దీనిపై తమ స్పందనలు వెలువరించారు. డిస్కోడాన్సర్ , నాటి మేటి నటుడు మిథున్ చక్రవర్తి దీనిపై తమ ట్వీటు వెలువరించారు. మాస్క్ వేసుకున్న ఈ కోతి భలే ఉందని తెలిపారు. కొందరు మనుష్యులు అయితే ఎంతైనా కోతి చేష్టలు కదా అని విసుక్కుంటున్నారు.

Monkey wears cloth as mask video goes viral