Home జాతీయ వార్తలు జూన్ 4న కేరళను తాకనున్న రుతుపవనాలు…

జూన్ 4న కేరళను తాకనున్న రుతుపవనాలు…

 

సాధారణంకన్నా తక్కువ వర్షాలు: స్కైమెట్

న్యూఢిల్లీ: ఈ ఏడాది నైరుతీ రుతుపవనాలు మామూలుకన్నా మూడు రోజులు ఆలస్యంగా జూన్ 4న కేరళను తాకనున్నట్లు ప్రైవేట్ వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ తెలియజేసింది. సాధారణంగా నైరుతీ రుతుపవనాలు జూన్ 1 నాటికి కేరళలో ప్రవేశిస్తాయి. కాగా, రుతుపవనాల వల్ల 2019లో సగటు వర్షపాతంకనా తక్కువ వర్షాలు కురుస్తాయని ఆ సంస్థ మంగళవారం తెలియజేసింది. దీనివల్ల అధిక వ్యవసాయ ఉత్పత్తి, వృద్ధి రేటు అంచనాలు తగ్గనున్నాయి. రుతుపవనాలు అండమాన్, నికోబార్ దీవులకు ఒకటి రెండు రోజులు అటూ, ఇటుగా ఈ నెల 22కల్లా చేరుకుంటాయని, జూన్ 4వ తేదీకల్లా రుతుపవనాలు కేరళలో ప్రవేశించవచ్చని స్కైమెట్ తెలియజేసింది. అయితే ఈ అంచనాలు నాలుగైదు రోజులు అటూ, ఇటయ్యే అవకాశాలు లేకపోలేదని తెలిపింది.

మొదట్లో రుతుపవనాల పురోగతి కాస్త మందకొడిగా ఉండవచ్చని స్కైమెట్ సిఇఓ జతిన్ సింగ్ తెలిపారు. దేశంలోని నాలుగు ప్రధాన రీజియన్లలో కూడా సగటు వర్షపాతంకన్నా తక్కువ వర్షపాతం ఉంటుందని, అయితే ఈశాన్య భారతం, దక్షిణ పీఠభూమితో పోలిస్తే వాయువ్య భారతం, మధ్య భారత ప్రాంతాల్లో తక్కువ వర్షాలు కురుస్తాయని ఆయన చెప్పారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షపాతం సగటు వర్షపాతంకన్నా తక్కువగా ఉండే అవకాశాలు 55 శాతం ఉన్నాయని స్కైమెట్ తెలిసింది. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ రిస్క్ ఎక్కువగా ఉండవచ్చని, ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువగా ఉంటుందని తెలిపింది. అలాగే విదర్భ, మరాఠ్వాడ, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రాంతాల్లో కూడా మామూలుకన్నా తక్కువ వర్షాలు కురవవచ్చని అంచనా వేసింది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం దాదాపుగా సాధారణ వర్షపాతం ఉంటుందని తెలిపింది. భారత దేశ వార్షిక వర్షపాతంలో 70 శాతం వర్షపాతం నైరుతీ రుతుపవనాల వల్లనే అందుతుంది. సకాలంలో కురిసే వర్షాలు వరి లాంటి ఆహార పంటలతో పాటుగా సోయాబీన్, పత్తిలాంటి వాణిజ్య పంటలకు కూడా అనుకూలం అవుతుంది.

Monsoon to hit kerala coast on 4th June