Home తాజా వార్తలు వృద్ధి రేటుకు ‘ప్యాకేజీ’ బూస్ట్

వృద్ధి రేటుకు ‘ప్యాకేజీ’ బూస్ట్

Moody's ups FY21 India growth forecast to (-) 10.6pc

 

రెండో త్రైమాసికంలో మెరుగుపడనుందంటున్న ఏజెన్సీలు
మైనస్ 9.5 శాతానికి వృద్ధి రేటు: ఇక్రా
భారత్ వృద్ధి రేటు 10.6 శాతం : మూడీస్

న్యూఢిల్లీ : రెండవ త్రైమాసికంలో భారతదేశం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు సంకేతాలను చూపుతున్నాయి. రేటింగ్ ఏజెన్సీలు రెండో త్రైమాసికంలో అంచనాలను సవరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) రెండో త్రైమాసికంలో జిడిపి గణాంకాలను నవంబర్ 27న సమర్పించే అవకాశముంది. దీన్ని సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సిఎస్‌ఒ) విడుదల చేస్తుంది.

ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది
రెండో త్రైమాసికంలో జిడిపి గత సంవత్సరంతో పోలిస్తే మైనస్ 9.5 శాతానికి పడిపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా (ఐసిఆర్‌ఎ) పేర్కొంది. అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం అనేక రాయితీలు ఇవ్వడంతో వ్యాపార కార్యకలాపాలను పెంచడానికి దోహదం చేస్తుందని సంస్థ తెలిపింది. అంతకుముందు మొదటి త్రైమాసికంలో కఠినమైన లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా వృద్ధి రేటు మైనస్ 23.9 శాతంతో చారిత్రాత్మక క్షీణత నమోదైంది. ఐసిఆర్‌ఎ చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ మాట్లాడుతూ, నిర్మాణ, తయారీ రంగం రెండో త్రైమాసికంలో ఊహించిన దానికంటే మెరుగైన రికవరీని నమోదు చేసింది. ఇది పారిశ్రామిక స్థూల విలువ ఆధారిత (జివిఎ)ను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.

ఉద్దీపన ప్యాకేజీతో జోష్ : మూడీస్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (202021) భారతదేశం వృద్ధి రేటు అంచనాను మూడీస్ పెంచింది. భారత్ మైనస్ 10.6 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ అంచనా వేసింది. గతంలో మైనస్ 11.5 శాతం వృద్ధి రేటును అంచనా వేసింది. తాజాగా తయారీ రంగం, ఉపాధి సృష్టి కోసం ఉద్దీపన ప్యాకేజీ ప్రాధాన్యతనివ్వడం దీర్ఘకాలిక వృద్ధికి దోహదం చేస్తుందని రేటింగ్ సంస్థ నివేదిక తెలిపింది. గత వారం ప్రభుత్వం రూ.2.7 లక్షల కోట్ల కొత్త ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. మూడీస్ ప్రకారం, ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీతో భారత్ తయారీ రంగం పోటీతత్వం పెరుగుతుంది, అలాగే ఉపాధి అవకాశాలను సృష్టించింది. అదే సమయంలో మౌలిక సదుపాయాల పెట్టుబడులకు కావాల్సిన రుణ లభ్యత లభించనుంది.

వేగంగా రికవరీ: బార్‌క్లేస్
రెండో త్రైమాసికంలో భారత జిడిపి వృద్ధి రేటు క్షీణించనుందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ బార్‌క్లేస్ పేర్కొంది. భారతదేశ జిడిపి వృద్ధి మైనస్ 8.5 శాతానికి పడిపోవచ్చని అంచనా వేసింది. ఇంతకుముందు 7 శాతానికి పడిపోనుందని అంచనా వేసింది. అదే సమయంలో ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో జిడిపి 0.4 శాతానికి పెరుగనుందని తెలిపింది. ఇటీవల తయారీ విభాగంలో మెరుగుదల -కోవిడ్ 19 ముందస్తు స్థాయిని దాటిందని బ్యాంక్ తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు మెరుగ్గా ఉండగలదని మాజీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ మైనస్ 7.5 శాతం పడిపోతుందని ఆయన అన్నారు.

Moody’s ups FY’21 India growth forecast to (-) 10.6pc