Home మహబూబ్‌నగర్ తరించిన పుష్కర జనం

తరించిన పుష్కర జనం

Krishna-puskaralu1మన తెలంగాణ/పాలమూరు: పాలమూరు జిల్లాలో ఎటు చూసినా పండుగ వాతావరణం కన్పిస్తోంది. ఓ వైపు కృష్ణా పుష్కరాలు..మరో వైపు శ్రావణ మాసం వరలక్ష్మివ్రతాలు, జెండా పండుగ, రాఖీ పూర్ణమి పండుగలు పాలమూరు ప్రజల్ని ఆనంద సంబరాల్లో ముంచెత్తుతున్నాయి. కృష్ణా పుష్కరాలకు తొలుత ఆతిథ్యమిస్తోన్న పాలమూరు పుష్కరాలను కనివిని ఎరగని రీతిలో జరిపేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమాయత్త మైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 12న ఉదయం 5.58 గంటలకు ఐదో శక్తిపీఠం అలంపూర్‌కు సమీపంలోని గొందిమల్లలో కృష్ణా పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించి కుటుంబ సమేతంగా పుష్కర స్నానమాచరించారు. తొలిరోజు దాదాపు రెండు లక్షల మంది భక్తులు, యాత్రికులు పుష్కరస్నానాలు ఆచరించారు. మరుసటి రోజు నుంచి కృష్ణా తీరం వెంబడి జనం పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంత జనం హాజరౌతున్నారు. ఏ పుష్కర ఘాట్ చూసినా భక్తులతో నిండిపోతున్నాయి. వరుసగా సెలవులు ఉండడంతో భక్తులు తండోప తండాలుగా పుష్కరాలకు తరలి వస్తున్నారు. ఏ పుష్కర ఘాట్ చూసినా జనసంద్రంతో కనువిందులు చేస్తున్నాయి. పుష్కర స్నానాలతో తనవి తీరా కృష్ణమ్మ ఒడిలో తనవి తీరుతున్నారు. పుష్కర స్నానాలతో పాపాలను తొలగించుకోవడమే కాకుండా జన్మజన్నల పుణ్యం వస్తుందన్న నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున పుష్కర ఘాట్‌లకు చేరుకుంటున్నారు. పవిత్ర కృష్ణా జలాలతో పుణ్య స్నానం ఆచరించి దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. పుష్కర ఏర్పాట్లను ప్రభుత్వం పకడ్భంధిగా చేపడుతుండడంతో ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోలేదు. డిజిపి అనురాగ్‌శర్మ,మంత్రి లకా్ష్మరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీదేవి, జిల్లా ఎస్పీ రెమోరాజేశ్వరీలు ప్రత్యేకంగా మూడవ రోజు పుష్కర ఏర్పాట్లను పరీశీలించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబందిత అధికారులకు ఆదేశించారు. డిజిపి అనురాగ్ శర్మ ఇంటలిజెన్సీ ఐజిపి శివధర్‌రెడ్డి, ఐజి సంజీవ్‌కుమార్‌జైన్‌లు కలిసి ప్రత్యేక హెలిక్యాప్టర్ ద్వారా బీచుపల్లి పుష్కర ఘాట్‌తో పాటు పలు పుష్కర ఘాట్లను పరిశీలించగా,జిల్లా కెలెక్టర్ శ్రీదేవి కూడా పుసుపుల,జూరాల,రంగాపూర్, కృష్ణా , మునుగదిన్నె పుష్కర ఘాట్లను పరిశీలించి అక్కడ ఏర్పాట్లపై సంబందిత అధికారులతో సమీక్షించారు. మంత్రి లకా్ష్మరెడ్డి కృష్ణాతో పాటు పసుపుల ఘాట్‌లను పరిశీలించి అక్కడ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఇక్కడ ప్రత్యేకంగా ఆయన పూజలు నిర్వహించారు. పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు.జిలా జాయింట్ కలెక్టర్ రాంకిషన్ బీచుపల్లిలో పరిశీలించారు. మూడవ రోజు దాదాపు 10 లక్షల మంది భక్తులు పుష్కరాల్లో పుణ్య స్నానం ఆచరించి ఉంటారని అధికారులు అంచనా వేశారు.సోమశిల పుష్కర ఘాట్‌లో లక్ష మంది, బీచుపల్లిలో దాదాపు 4 లక్షల మంది, గొందిమళ్లలో 2 లక్షల మంది, రంగాపూర్‌లో 3 లక్షల మంది దాక భక్తులు పుష్కర స్నానాలు చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. నారాయణపూర్ నుంచి వరద ప్రవాహం తగ్గడంతో జూరాల గేట్లు మూసి వేయడంతో వరద ఉద్రితి తగ్డుముఖం పట్టింది. అయినప్పటి పుష్కర ఘాట్ల వద్ద నీరు పుష్కలంగా ఉండడంతో భక్తులు పుణ్య స్నానాలు చేశారు. బీచుపల్లి పుష్కర ఘాట్ హైకోర్టు ఉన్నత న్యాయమూర్తి ఏ. సీతారామాన్‌తో పాటు పలువురు న్యాయమూర్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. రంగాపూర్ పుష్కర ఘాట్‌లో సినీహీరో శ్రీకాంత్ పుణ్యస్నానం చేశారు. ఏర్పాట్లు బాగున్నాయని ఈ సందర్భంగా శ్రీకాంత్ సంతృప్తి వ్యక్తం చేశారు. నదీ అగ్రహారంలో రంగారెడ్డి జిల్లా జడ్జీ పుణ్య స్నానం చేశారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా జడ్జీ వెంకటకృష్ణయ్యతో పాటు నారాయణ,ఈశ్వరయ్యే వంటి న్యాయమూర్తులు పుణ్క స్నానం చేశారు. పెద్ద చింతరేవుల ఘాట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి భాస్కర్ తన కుటుంబ సభ్యులు పుణ్య స్నానం చేశారు, ఇక్కడే డిపిఆర్‌ఓ వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా పుణ్య స్నానం చేశారు. సోమ శిల పుష్కర ఘాట్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ, షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డిలు పుణ్య స్నానం చేశారు. ఎమ్మెల్సీ పట్నం నరేంద్ర రెడ్డి కృష్ణ ఘాట్‌లో స్నానాలు చేశారు. జాతీయ రహదారిపై టోల్ గేట్లను ప్రభుత్వం ఎత్తివేయడంతో ట్రాఫిక్‌కు ఎలాంటి అవాంతరాలు కల్గలేదు. గత రెండు రోజుల క్రితం టోల్ గేట్లు ఎత్తి వేయక పోవడంతో ట్రాపిక్ సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీదేవి ప్రత్యేక చొరవ తీసుకొని టోల్ గేట్లను ఎత్తివేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వాహనాల నుంచి వచ్చే భక్తులకు టోల్ రుసులు లేక పోవడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు లేక పోవడంతో సులభంగా పుష్కర స్నానాలు చేసి వెనుదిరుగుతున్నారు. గొందిమళ్ల ఘాట్‌కు ఆంద్రా రాష్ట్ర ం నుంచే కాకుండ కర్నాటక రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఎత్తున భక్తులు గొందిమళ్ల ఘాట్‌కు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పుష్కర స్నానాలు ఆచరించిన భక్తులు చెంతనే ఉన్న 5వ శక్తి పీఠం జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. సుమారు 4 లక్షలకు పైగానే అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ తిరుపతి లడ్డు ప్రసాదాలను భక్తులకు ఇస్తున్నారు. పుష్కర స్నానాలకు వచ్చేభక్తులు స్థానికంగా ఉన్న దేవాలయాలతో పాటు ఇతర పుణ్య క్షేత్రాలను కూడా సందర్శిస్తుండడంతో దేవాలయాలు భక్తులతో సందడి నెలకొంది. అనేక దేవాలయాలను చేరుకొని పూజలు చేస్తున్నారు. అంతేకాకుండా పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నారు. పుష్కర పండుగ ఇలా ఉంటే ఇక శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాలు, జెండా పండుగ సంబరాలు పాలమూరులో మిన్నంటాయి. ఇక అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకకగా చెప్పుకునే రాఖీ పండుగ కూడా గురువారం ఉండడంతో పుష్కర స్నానాలు ఆచరించిన భక్తులు ముఖ్యంగా మహిళలు, బాలికలు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు రాఖీ దుకాణాలకు ఎగబడుతున్నారు. వరలక్ష్మి వ్రతం, పుష్కరాలు ఒకే రోజు ఆరంభం కావడంతో ఆ రోజు మహిళలు ఇండ్లల్లో వ్రతాలు చేసుకుంటున్న కారణంగా తొలిరోజు పుష్కరాలకు అంతంత మాత్రమే జనం హాజరయ్యారు. మరుసటి రోజు భక్తుల సందడి పెరిగిపోయింది. మూడు, నాలుగు, ఐదో రోజు పుష్కర భక్తుల సంఖ్య రెటింపు స్థాయిలో దాదాపు పాతిక లక్షలకు చేరుకుందని అధికారులు చెబుతున్నారు.
గద్వాల/అయిజ: కృష్ణమ్మ పుష్కర వైభవం కొన సాగు తుంది. ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. గద్వాల ని యోజ కవర్గంలోని నదిఅగ్రహారం, బీరెల్లి, పెద్ద చిం తరేవుల, ఉప్పేరు, రేకులపల్లి ఘాట్లకు భక్తులు తరలించి కుటుంబ సమేతంగా పుష్కర స్నానం ఆచరించారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. మాజీ మంత్రి డికె. సమరసింహారెడ్డి నది అగ్రహారంలో తన అనుచరులతో క లిసి పుష్కరస్నానం చేశారు. ఆలయ అధికారులు, పో లీసులు వారిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు.
పుణ్యస్నానం ఆచరించిన వరంగల్ కలెక్టర్ అరుణ
అలంపూర్‌టౌన్: వరంగల్‌జిల్లా కలెక్టర్ కరుణ మంగ ళవారం కుటుంబ సమేతంగా జోగుళాంబ పుష్కరఘాట్‌లో పుణ్యస్నానం ఆచరించారు. ఘాట్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పుష్కరస్నానాలకు ఎంత మంది వస్తు న్నారు ఘాట్‌లో కాకుండా నదిలో స్నానమాచరిస్తున్న భక్తు లకు పూర్తి రక్షణ కల్పించాలని అధికారులకు సూ చించారు. అనంతరం శ్రీజోగుళాంబ బాలబ్ర హ్మేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు చేశారు.
ఘాట్‌ను పరిశీలించిన భద్రాచలం ఎఎస్పి
గొంది మళ్ల, జోగుళాంబ పుష్కరఘాట్‌ను భద్రాచలం ఎఎస్పీ భాస్కర్ మంగళవారం పరిశీలించారు. ఈ సం దర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఎక్కువ సేపు నీటిలో స్నానమాచరించకుండా భక్తులను బయటికి రప్పించాలన్నారు. ఘాట్‌లో నిఘా వ్యవస్థను పెంచాలని సూచించారు. భక్తులు ఘాట్‌లో ఎక్కువ సేపు ఉండడం వల్ల మి గతా భక్తులు స్నానమాచరించకుండా భద్రత లేని నదిలో స్నానమాచరిస్తున్నారని తెలిపారు.
గొందిమళ్ల గ్రామస్తుల వితరణ….గొందిమళ్ల పుష్కర ఘాట్‌లో ప్రభుత్వం భోజన వసతి కల్పించకపోవడంతో భక్తులు అనేక ఇబ్బందులు గురైయ్యారు. భక్తుల ఇబ్బందులను గుర్తించిన గొందిమళ్ల గ్రామస్తులు భక్తులకు ఉచితంగా భోజన సదు పాయం కల్పించాలని సంక ల్పించారు. ఈ నెల 13 నుంచి భ క్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి రోజు ఐదు వేల మంది భక్తులకు అన్నదానం చేస్తున్నారు.
కాశ్మీర్ అందాలను తలపిస్తున్న అమరగిరి
కొల్లాపూర్: మండల పరిధిలోని ఎల్లూరు అవాస గ్రా మమైన అమరగిరి గ్రామాని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ఉదయం అక్కడ పుష్క రాలలో భాగంగా ఏర్పాటు చేసిన ఘాటును పరి శీలించారు. అమరగిరిలోని సుందరమైన ప్రదేశాలను ఆ యన లాంచీ ద్వారా ప్రయాణించి తిలకించారు. అక్కడి నుండి దాదాపు 6కిలో మీటర్ల దూరం సోమశిల ఘాట్లకు చేరుకోని అక్కడ పుష్కరాలకు సుదూర ప్రాంతలనుండి వచ్చిన భక్తులతో అభిప్రాయాలను తెలుసుకున్నారు. భక్తులు సౌకర్యాలు చాలా బాగున్నాయని కితాబ్ ఇచ్చారు. అనంతరం మంత్రి హరిత హోటల్‌లో తయారు చేస్తున్న భోజనంపై ఆరా తీశారు. అక్కడే విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, కొల్లాపూర్‌కు 7కిలో మీటర్ల దూరంలో ఉన్న అమరగిరి అందాలు కాశ్మీర్‌ను తలపిస్తాయని ఆయన అన్నారు. అక్కడ కూడా పుష్కరాలకు ఘాటు నిర్మించామని భక్తులు అక్కడ వెళ్ళావచ్చు అని అన్నారు. సోమశిలలో సప్త నదుల సంఘమము, ద్వాదశి జ్యోతిర్నిలింగాలు కల్గి ఉండటం ఇక్కడి ప్రత్యేక అన్నారు. ఇక్కడి అందాలు హిమలయ కొండలు పోలి ఉంటాయన్నారు. ఇరుగట్ల మద్య కృష్ణానది ప్రవహం చాలా చూడముచ్చటగా ఉంటుందన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. 2004 తెలం గాణలో ఎక్కడ పుష్కరాలు భక్తులు లేకుండా జరి గాయని ప్రస్తుతం తెలంగాణ వచ్చిన తర్వాత సియం కెసి ఆర్ నాయకత్వంలో లక్షాలాది మంది భక్తులు పుష్కరాలలో పాల్గోంటున్నారని అన్నారు. కెసిఆర్ క్యాబి నేట్‌లో ఉండి ఇంతటి పుష్కరాలను నిర్వహించడం తమకు ఆనందం కల్గుతుందన్నారు. తెలంగాణ వచ్చాక కరెంటు కోత తీరిందని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు.
కొల్లాపూర్: మండల పరిధిలోని సప్తనదుల సంఘమము అయిన సోమశీలకు మంగళవారం భక్తులు వేలాదిగా తరలివచ్చి కృష్ణానదిలో పుణ్యస్నానం అచరించారు. ఉదయంనుండే భక్తులు బారులు తీరారు. హైదరాబాద్, మహబుబ్‌నగర్‌తో పాటు ఇతర జిల్లాలనుండి భక్తులు అధికంగా వివిధ వాహనాలలో తరలివచ్చారు. అధికారుల అంచన ప్రకారం దాదాపు 50వేల మంది భక్తులు వచ్చినట్లు అంచన వేశారు. విఐపి ఘాటుతో పాటు జనరల్ ఘాటులో భక్తులు బారులు తీరారు. స్నానం అచరించడానికి ఇబ్బందిగా ఉన్నావారికి పైన మోటర్ ద్వారా నీటిని సరఫార చేశారు. తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన లాంచీలో భక్తులు కృష్ణానదిలో ప్రయాణిస్తూ తమ అనందని పంచుకున్నారు. తమ సెల్ పోన్‌లో అదృశ్యలను బందించారు. ఈలాంటి సుందర ప్రదేశాని ఎక్కడ చూడలేదని వారు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. పుష్కర స్నానాలకు వచ్చిన భక్తులు తమ పెద్దలకు పిండ ప్రదానం చేశారు. అనంతరం ద్వాదశ జ్యోతిర్నింగాలు ఉన్నా శ్రీలాలిత సోమేశ్వరుని వేలాదిగా దర్శించుకోని తమ మోక్కులు తీర్చుకున్నారు. భక్తులకు వివిధ స్వచ్ఛంద సంస్థలు, శ్రీసత్యసాయి సేవ సమితి, విశ్వహిందూ పరిషత్, కోసా,రెడ్ క్రాస్ సోసైటి వాలింటిర్లు భక్తులకు తమ సేవాలు అందిస్తున్నారు. వృద్దులకు ప్రత్యేకంగా శ్రీసత్యసాయి సేవా సమితి ఆటోను ఏర్పాటు చేసి వారిని ఘాట్ దగ్గరకు చేర్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాం కల్గకుండా పుఫ్కర ఘాటు సిబ్బంది తగు చర్యలు తీసకున్నారు. స్వచ్ఛ సోమశిల సేవా సమితి సభ్యులు దేవాలయంలో భక్తులకు అసౌకర్యం కల్గకుండా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ సరుర్‌నగర్‌కు చెందిన మైత్రి వెలుమ సంఘం వేలాది మంది భక్తులకు అన్న దానం చేశారు. ఈకార్యక్రమంలో గ్రామ స్రర్పంచ్ వెంకటస్వామి
నాగర్‌కర్కూల్ ఆర్‌డిఓ దేవేందర్‌రెడ్డి, కొల్లాపూర్ తహశీల్దార్ పార్థసారథి, బిజనపల్లి తహశీల్దార్ రాజేందర్‌రెడ్డి, విఐపి ఘాటు ఇంచార్జీ పాపయ్య, శ్రీనివాస సూరి నాగర్‌కర్కూల్ తహశీల్దార్ ,విఆర్‌ఓలు గోవింద్‌రెడ్డి,సుధాకర్, దేవాలయ కమిటి సభ్యులు గోవింద్‌రెడ్డి, రాంమోహన్, రామకృష్ణ, బుడ్డన్న తిరుపాలు, రమణ, తదితరులు పాల్గొన్నారు.
ఘాట్లలో జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ
నడిగడ్డ/ఇటిక్యాలరూరల్: కృష్ణ పుష్కరాలకు ఐదవ రోజు భక్తుల రద్దీ కొంత మేర తగ్గింది. గత నాలుగు రోజులుగా భక్తులు రెండు లక్షలకు పైగా ప్రతి రోజు పుణ్యస్నానాలను ఆచరించగా మంగళవారం మాత్రం లక్ష వరకు భక్తులు తరలివచ్చారు. ఏర్పాటు చేసిన ఘాట్లలో మంగళవారం స్నానాల కోసం వచ్చిన భక్తులకు వరద నీరు కూడా తగ్గిపోవడంతో స్నానమాచరించేందుకు కొంత ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా సాధారణ ఘాట్‌లోని కృష్ణమ్మ విగ్రహానికి ఎడమ వైపున, అదేవిధంగా వీఐపి ఘాట్ దగ్గర నీళ్లు భారీగా తగ్గిపోవడంతో స్నానమాచరించేందుకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. కొంత మంది వృద్దులు, పిల్లలు కృష్ణమ్మ విగ్రహం కింద ఏర్పాటు చేసిన షవర్ల ద్వారానే స్నానమాచరించారు. అ డీఐజి అకున్‌సబర్వాల్, మాజీ డీజీపీ హెచ్‌జే దొర, జిల్లా కలెక్టర్ శ్రీదేవిలు ఘాట్లను సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ డీజీపీ హెచ్‌జే దొర పుణ్యస్నానాలు ఆచరించి పూజలు నిర్వహించారు.
కలెక్టర్ పర్యవేక్షణ….కలెక్టర్ టీకే శ్రీదేవి బీచుపల్లి ఘాట్‌ను సందర్శించారు. వీఐపి, సాధారణ ఘాట్ మొత్తం కలియ తిరుగుతూ పుణ్యస్నానాలు చేయడానికి వచ్చిన భక్తులను పలకరించి ఏర్పాట్లపై ఆరాతీశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేయడంతో కలెక్టర్ వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆమె అక్షయపాత్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన శిబిరాన్ని సందర్శించి మధ్యాహ్నం అక్కడే భోజనం చేశారు. అనంతరం ఆమె విలేకరులతో ముఖాముఖి మాట్లాడుతూ అక్షయపాత్ర సంస్థ ద్వారా ప్రతి రోజు 25వేల మంది వాలంటీర్లకు జిల్లా వ్యాప్తంగా భోజనం పంపిణీ చేస్తున్నారని పేర్కొన్నారు.
పుష్కర స్నానం కోటి జన్మల పుణ్యఫలం
krishna-puskaralu2వనపర్తి/పెబ్బేరు/వనపర్తిటౌన్,(రంగాపూర్‌ఘాట్‌నుండి): కృష్ణానదిలో స్నానం ఆచరించడం కోటి జన్మల పుణ్యఫలమని భావించి పవిత్ర కృష్ణానదిలో స్నానం ఆచరించేందుకు అయిదవ రోజు వివిద ప్రాంతాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు.220 మీటర్ల పోడవున వున్న రంగాపూర్ పుష్కరఘాట్‌లో మంగళవారం భక్త జన సందడితో కోలాహలంగా మారింది.ఉదయం ఆరు నుండి పది గంటల వరకు భక్తుల సంఖ్య తక్కువగా వున్నప్పటికి పది నుండి సాయంకాలం అయిదు గంటల వరకు భక్తుల రద్ది బాగా పెరిగింది.దాదాపు లక్ష మందికి పైగా భక్తులు రంగాపూర్‌ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు.దాదాపు 20 నుండి 30వేల మందికి పైగా భక్తులు పిండ ప్రదానాలు చేశారు.రంగాపూర్‌ఘాట్‌లో అన్ని సౌకర్యాలు కల్పిం చడంతో ఘాట్‌కు వచ్చిన అయిదు నిమిషాల్లో కృష్ణమ్మను దర్శించుకొని పుణ్య స్నానం ఆచరిస్తున్నారు. రంగాపూర్ ఘాట్‌కు భక్తుల రద్ది బాగా వుండటంతో రంగాపూర్ ఊరి చివర పోలీసులు పుష్కర స్నానానికి వచ్చే భక్తుల వాహనాలను మునగమాన్‌దిన్నె పుష్కర ఘాట్‌కు మళ్లించారు.
వీపనగండ్ల, పాన్‌గల్: మండలంలోని జటప్రోల్, చెల్లెపాడ్ పుష్కరఘాట్లలో మంగళవారం భక్తుల తాకిడి అధికమైంది. చెల్లెపాడ్ పుష్కరఘాట్‌లో ఆర్‌డబ్లూఎస్‌ఈఈ సుబ్రమణ్యం సతీమణి ఇందిర పుస్తే జారిపోవడాన్ని గమనించలేదు. ఈఈ దంపతులు ఘాట్‌లో పుణ్యస్నానం అనంతరం ఆలయంలో పూజలు చేస్తుండగ పుస్తే పోవడాన్ని చూసుకుంది. వెంటనే తహశీల్దార్ ప్రభాకర్‌రావుకు విషయాన్ని తెలియజేయడంతో అక్కడే ఉన్న గజ ఈతగాళ్లను తహశీల్దార్ ఘాట్‌లో పుస్తే పోయిందని వెతకండని ఆదేశించారు. గజ ఈతగాళ్లు నీటిలో ఉన్న పుస్తేను గుర్తించి తహశీల్దార్‌కు అప్పగించారు. అనంతరం తహశీల్దార్ ఈఈ సతీమణికి పుస్తేను అందజేసి గజ ఈతగాళ్లకు ప్రభుత్వ పరంగా రూ.116 ఇవ్వగ ఈఈ దంపతులు వారికి 500 ఉచితంగా ఇచ్చారు. అదేవిధంగా జటప్రోల్ పుష్కరఘాట్‌లో మహిళలు కృష్ణానదికి హరతి ఇచ్చే కార్యక్రమాన్ని అధ్బుతంగా నిర్వహించారు. వికలాంగులు పుణ్యస్నానం చేసేందుకు ఘాట్లను చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించారు.
మఖ్తల్: కృష్ణా పుష్కరాలలో భాగంగా 5వ రోజు అయిన మంగళవారం నాడు మఖ్తల్ మండల పరిధిలోని పస్పుల, పంచదేవ్‌పహాడ్ పుష్కర ఘాట్‌లలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై పుష్కర స్నానాన్ని ఆచరించారు. పుష్కర స్నానం అనంతరం కృష్ణనది ఒడ్డున వెలసిన శ్రీ వల్లభపుర దత్తాపీఠం, శ్రీపాదవల్లభుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా స్పెషల్ ఆఫీసర్ రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ ప్రమేలా సత్‌పతి, పుష్కర ఘాట్ల వద్ద పరిశీలిస్తూ పోలీసు సిబ్బందితో భక్తులను వరుస క్రమంలో పుష్కర స్నానం అచరించేందుకు పలు జాగ్రత్తలు చేపట్టారు. పుష్కర స్నానానికి హాజరయ్యే వికలాంగులను, వృద్దులను జిల్లా రెడ్‌క్రాస్ అధ్యక్షులు నగరాజు, వారి వాలెంటీర్లు స్వయన వృద్దులను, వికలాంగులను పుష్కర స్నానం ఆచరింపచేశారు. 5వ రోజు అయిన మంగళవారం నాడు పస్పుల పుష్కర ఘాట్ భక్తులతో కిటకిటలాడింది.