Home బిజినెస్ రియల్ ఎస్టేట్ తో ఎక్కువ ఉపాధి

రియల్ ఎస్టేట్ తో ఎక్కువ ఉపాధి

eta

 క్రెడాయ్ 6వ ఎడిషన్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో మంత్రి ఈటల
 జిఎస్‌టి తగ్గింపుపై కేంద్రాన్ని కోరుతానని హామీ

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్నది రియల్ ఎస్టేట్ రంగమేనని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 10 లక్షలకు పైగా చదువుకున్నవారికీ, శ్రామికవర్గానికీ రియల్ ఎస్టేట్ రంగం తోడ్పాటునందిస్తోందన్నారు. ఉద్యోగ అవకాశాల కల్పనలో తెలంగాణ వారికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని రియల్టర్లకు ఈటల విజ్ఞప్తి చేశారు. ‘క్రెడాయ్’ 6వ ఎడిషన్ ప్రాపర్టీ షోను మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం హైటెక్స్‌లో ప్రారంభించారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన 120 మంది డెవలపర్లు సుమారు 15 వేల ప్రాజెక్టులను స్టాళ్లలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రం కంటే తెలంగాణ అత్యంత నివాసయోగ్యమైన ప్రదేశమన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత హైదరాబాద్‌లోనే శేష జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటున్నారని, కేంద్ర మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ జెఎం లింగ్డో, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (ఆర్‌ఏడబ్లూ) చీఫ్ రాజేందర్ ఖన్నా .. ఇలా ఎంతో మంది ఇక్కడే నివాసం ఉంటున్నారని గుర్తుచేశారు. జిఎస్టిలో భవన నిర్మాణ రంగానికి తొలుత ఉన్న 18 శాతం పన్నును 12%కి తగ్గించే అవకాశముందన్నారు. ఈ నెలాఖరుకు జిఎస్‌టి సంస్కరణలపై కేంద్రం ఆలోచించే అవకాశం ఉందని అన్నారు. జిఎస్‌టి తర్వాత చిరువ్యాపారులు, వర్తక వాణిజ్య సంస్థలు, భారీ షాపింగ్ మాల్స్ పన్ను ఎగవేతకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాల్లో ఇంకా కొన్ని షాపులు టాక్స్ లేకుండానే లావాదేవీలను జరుపుతున్నాయని, వినియోగదారులు బిల్లులు అడిగితే రాయితీలను ఎత్తేస్తున్నారని వ్యాఖ్యానించారు. జిఎస్‌టిలో ఎక్కువ పన్ను విధింపు ఉంటే వాణిజ్య సంస్థలు దానిని కట్టకపోగా ఎగ్గొట్టే అవకాశాలే ఎక్కువగా ఉంటాయన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని, సిఎం కెసిఆర్ ఆదేశాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణలో నిఘా ఉంటోందని, అభివృద్ధి చెందిన సింగపూర్ తర్వాత ఆ స్థాయి నిఘావ్యవస్థ ఇక్కడే ఉందని అన్నారు. అందుకే ఎన్నో అంతర్జాతీయ స్థాయి సదస్సులు హైదరాబాద్‌లో జరుగుతున్నాయని, హైదరాబాద్ ‘లవెబుల్’ సిటీ మాత్రమే కాక ‘లివబుల్’ కూడా అని మంత్రి కెటిఆర్ తరుచూ చేసే వ్యాఖ్యను ఈటెల గుర్తు చేశారు. సభకు అధ్యక్షత వహించిన క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షులు ఎస్. రామ్‌రెడ్డి మాట్లాడుతూ నగరవ్యాప్తంగా 120 మంది డెవలపర్లను ఈ ప్రాపర్టీ షో ద్వారా ఏకతాటిపైకి తీసుకువచ్చామన్నారు. మూడు రోజులు ఈ ప్రాపర్టీ షోలో టౌన్ షిప్‌లు, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, కమర్షియ ల్ కాంప్లెక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ కల్గిన గ్రీన్ బిల్డింగ్స్‌ను ప్రదర్శనకు ఉంచామన్నారు. భవన నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగం నిపుణులు, కేంద్ర , రాష్ట్ర పన్నులశాఖ అధికారులు, బ్యాంకర్లు స్వంత ఇంటి కలపై సందేహాలను నివృత్తిచేస్తారని తెలిపారు. భవన నిర్మాణ రంగంపై విధించిన జిఎస్‌టి పన్నును తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. క్రెడాయ్ ప్రధాన కార్యదర్శి పి. రామకృష్ణారావు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం, గృహ నిర్మాణ రంగంపై జిఎస్‌టి పన్నును 5 శాతానికే పరిమితం చేస్తే బావుంటుందన్నారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే పౌరులకు జిఎస్టి దోహదపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బిఐసిజిఎం స్వామినాథన్, క్రెడాయ్ ప్రతినిధులు ఆదిత్య గౌర, ఆనంద్ రెడ్డి, డా. ఎంఎస్ ఆనంద్ రావు, డి. మురళీకృష్ణారెడ్డి, కె. రాజేశ్వర్, సిజి. మురళీ మోహన్, వి. రాజేశ్వర్ రెడ్డి, బిల్డర్లు, డెవలపర్లు, స్టేక్ హోల్డర్లు పాల్గొన్నారు.