Home రాష్ట్ర వార్తలు పల్లెకు పట్టం… గ్రామాల దశ మారుస్తాం

పల్లెకు పట్టం… గ్రామాల దశ మారుస్తాం

నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు

ప్రజల సొమ్ము కానుకలు ఇస్తున్నానని అవగాహన లేని ప్రకటనలు చేస్తున్నారు
కమ్యూనిస్టులకు కాలం చెల్లింది
కాంగ్రెస్ ప్రాజెక్టులను అడ్డుకుంటోంది
రాజకీయ బతుకుల కోసం ప్రజల నోట్లో మట్టి కొట్టొద్దు
గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లడం ఇంటి గుట్టు రచ్చకీడ్వడమే

ఉభయ గోదావరి జిల్లాలను తలదన్నేలా పంటలకు నీరిస్తాం
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేస్తాం
కాళేశ్వరంతో వరంగల్ పరిసరాల్లో దండిగా నీళ్లు
కురవి సందర్శన తరువాత మీడియాతో సిఎం కెసిఆర్

KCR

మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసే దిశగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం అడు గులు వేస్తోందని, రాష్ట్ర అభివృద్ధికి రూ.36 వేల కోట్లతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. శుక్రవారం ఆయన మహాశివరాత్రి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని దర్శించుకుని, స్వామివారికి బంగారు మీసాలు సమర్పించారు. అనంతరం చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామంలో డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో వరంగల్ జిల్లా పరిసర ప్రాంతంలో మూడు పంట లకు సాగునీరు అందుతుందన్నారు.

ఉభయ గోదావరి జిల్లాలను తలదన్నేలా పంటలకు నీరు అందిస్తామని చెప్పారు. దాదాపు 40 ఏళ్లు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చినా చేయలేని అభివృద్ధి పనులు టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన కొద్ది సమయంలోనే చేస్తోందని, ఇది తట్టుకోలేక ప్రజలను ఉసిగొల్పి ప్రాజెక్టులను అడ్డుకునేం దుకు కుటిల యత్నం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభు త్వ హయాంలో జనగామ నియోజకవర్గంలోని  రిజర్వాయర్ నిర్వాసితులకు ఎకరాకు రూ.60వేల నుంచి రూ.1.80 లక్షలు ఇచ్చారని, ఇప్పడు టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రాజక్టులు నిర్మాణం చేపడితే ఒక్క ఎకరాకు రూ.20లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలంటున్నారని ఏనోరు పెట్టుకుని అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రాజక్టులు అడ్డుకోవాలనే కాంగ్రెస్ కుటిల యత్నంపై ప్రజలు, పత్రికలు మౌనం వీడాలని, యుధ్దం ప్రకటించాలని ఆయన అన్నారు. ప్రజల సొమ్ము కాను కలు ఇస్తున్నానని అవగాహనలేని ప్రకటనలు చేస్తున్న కమ్యూనిస్టుల కు కాలం చెల్లిందని, నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

వలస చేనేత కార్మికులను రప్పిస్తాం

సూరత్, షోలాపూర్ ప్రాంతాలకు వలసలకు వెళ్ళి బతుకుతున్న చేనేత కార్మికుల కుటుంబాలను తెలంగాణ స్వరాష్టానికి రప్పిస్తామని, వరంగల్‌లో దేశంలోనే అతి పెద్దదైన టెక్స్‌టైల్‌పార్కు ఏర్పాటుచేస్తామని సిఎం హామీ ఇచ్చారు. ప్రాజక్టులకు ఎన్విరోన్‌మెంటల్ క్లియరెన్స్ తీసుకోలేదని కాంగ్రెస్ పార్టీ గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్ళడం ఇంటి గుట్టును రచ్చకీడ్చేపనని, ప్రాజక్టులకు ఈ నెపంతో ఆపుతారా అని, రాజకీయ బతుకుల కోసం రైతుల నోట్లో మట్టి కొట్టద్దని ఆయన హెచ్చరించారు. ఆంద్రా వలసపాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బానిస బతుకులు బతికారని, చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పీఠాల క్రింద భూకంపం వచ్చేలా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామన్నారు. రూ.4వేల కోట్లతో 8లక్షల గొర్రెలను యాదవులకు పంపిణీ చేసి వారి జీవన విధానంలో మార్పులు తీసుకువస్తామని, యాదవులు గొర్రెలను అద్భుతంగా పెంచే నైపుణ్యం ఉందని యాదవ రత్నాలని సిఎం కొనియాడారు.

అలాగే 40లక్షల మంది ముదిరాజులకు ఉచితంగా చేపపిల్లలను చెరువుల్లో వదిలి వారు ఆర్ధికంగా మెరుగుపడేందుకు చర్యలు తీసుకుంటున్నామని వేల కోట్ల మత్స సంపదను పెంపొందిస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ మనుషులను ఓటుగానే చూస్తున్నారని, బతుకే ఓటుగా రాజకీయాలు చేస్తున్నారని సిఎం విమర్శించారు. ఉచిత విద్యుత్ ఇవ్వలేరని ఎద్దేవా చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు 9,500మెగావాట్ల విద్యుత్‌ను ఇస్తుంటే ముక్కున వేలేసుకుందన్నారు. గ్రామాల ముఖ చిత్రాలను టిఆర్‌ఎస్ ప్రభుత్వ మారుస్తుందని గ్రామాల్లో నాయీ బ్రాహ్మణులకు అధునాతన సెలూన్‌లు ఏర్పాటుచేయిస్తామని, రజకులకు డ్రయర్స్, లాండ్రీలు ఏర్పాటు చేస్తామని, బిసి వర్గాలకు రూ.12వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తామని సిఎం ప్రకటించారు. అలాగే సంచార జాతులైన ఎంబిసిలు రాష్ట్రంలో 64లక్షల మంది ఉన్నారని వారి అభివృద్దికి ఎంబిసికి ప్రత్యేక కార్పోరేషన్ రూ.1000కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్నారు. ఈ సమావేశంలో డిప్యూటి సిఎం కడియం శ్రీహరి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన శాఖమంత్రి అజ్మిర చందూలాల్, మహబూబాబాద్ ఎంపి సీతారాంనాయక్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండ సురేఖ, కొండ మురళీ, మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు తక్కళ్ళపల్లి రవీందర్‌రావు, టిఆర్‌ఎస్ నాయకులు రామసహాయం రంగారెడ్డి, గుడిపూడి నవీన్, ధరంసోత్ రవిచంద్ర, రామసహాయం సత్యనారాయణరెడ్డి, మాజీ ఓడిసిఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్‌రెడ్డి, ఒంటికొమ్ము యుగంధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.