Home Default సినీ ‘మత్తే’భాలు

సినీ ‘మత్తే’భాలు

  • నిర్మాతల కుటుంబాలలోని ఇద్దరు హీరోలు, మరో నిర్మాత, నటుడి ఫ్యామిలీ మెంబర్స్‌కు డ్రగ్స్ సరఫరా?
  • కెల్విన్ చెప్పినట్లు సమాచారం

Tollywood-Drug

హైదరాబాద్: నార్కొటిక్ డ్రగ్స్ కేసు లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు మరింత సమాచారం లభించింది. ఎల్‌ఎస్‌డి, ఎండిఎంఎ డ్రగ్స్ ను విక్రయించే ముఠా నాయకుడు కెల్విన్ మాన్‌కన్స్‌న్రు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు దిమ్మ తిరిగే సమాచా రం లభించింది. సినీ రంగంలో ఇం త వరకు 27 మంది పేర్లు బయటకు రాగా, ఇందులో కేవలం 12 మందికి మాత్రమే నోటీసులు పంపించారు. తాజాగా కెల్విన్ విచారణలో మరో ఏడు మంది పేర్లు బయట పడ్డాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం 34 మంది పేర్లు బయటకు వచ్చినట్లయింది. నాలుగేళ్ళుగా తనకు సినీ రంగంలోని పలువురితో పరిచయాలున్నాయని, ఈ పరిచయాలతో కొంత మందికి డ్రగ్స్‌ను విక్రయించినట్లు కెల్విన్ వెల్లడించినట్లు సమాచారం. ము ఖ్యంగా ఈవెంట్ మేనేజర్లతో లింకులు పెట్టుకొని సినీ రంగంలోని కొంత మందికి డ్రగ్స్‌ను విక్రయించినట్లు వెల్లడించాడని తెలిసింది. నిర్మాతల కుటుంబంలోని ఇద్దరు హీరోలు, వారిలో ఒకరి కుమారుడు, మరో నిర్మాత, నటుడి కుటుంబంలోని ఇద్దరికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు కెల్విన్ చెప్పినట్లు సమాచారం. డ్రగ్స్ సరఫరా చేసిన వారిలో టాలీవుడ్‌లో వీరి కుటుంబం అత్యంత కీలకమైందని తెలిసింది. అదే విధంగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా ఉన్నాడని, ఇతడు ఒక క్రేజీ స్టార్‌తో నిర్మించిన సినిమా కూడా హిట్ అయ్యిందని అధికారులు అంటున్నారు. ఐటి కంపెనీలకు చెందిన కొంత మంది పేర్లు, బహుళ జాతి కంపెనీలకు చెందిన మరో ఇద్దరి పేర్లు కూడా కెల్విన్ విచారణలో వెల్లడయ్యాయని సమాచారం. కెల్విన్ చెప్పిన సమాచారాన్ని ఒకటికి రెండు పర్యాయాలు సరి చూసుకున్న తర్వాతే నోటీసులు జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. కెల్విన్‌తో ఈవెంట్ మేనేజర్లు, నిర్వాహకులకు ఏ మేరకు సంబంధాలున్నాయి, ఎవరెవరితో తరచూ కెల్విన్ మాట్లాడారన్న అంశాన్ని తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
మరో ఇద్దరి అరెస్టు
ప్రతి రోజు కంటే ముందుగానే కార్యాలయానికి వచ్చిన అకున్ సబర్వాల్ కేసు పురోగతిని మరోసారి పరిశీలించారు. జైలు నుంచి డ్రగ్స్ కేసు ప్రధాన ముద్దాయి క్యాల్విన్‌తో పాటు కుద్దూస్, వాహేద్‌లను కస్టడీలోకి తీసుకోవడం, వారిని ఎక్కడ విచారించాలన్న అంశంపై చర్చించి అధికారులకు తగు సూచనలను చేశారు. క్యాల్విన్‌ను నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో విచారిస్తుండగా, మిగతా ఇద్దరిని బాలానగర్ ఎక్సైజ్ కార్యాలయంలో ప్రశ్నించారు. సాయంత్రం కెల్విన్, కుద్దూస్, వాహేద్‌ల నుంచి సేకరించిన సమాచారాన్ని అధికారుల ద్వారా సబర్వాల్ తెలుసుకున్నారు. విచారణలో భాగంగా అధికారులు క్యాల్విన్ సెల్‌తో పాటు అతడి డివైస్‌లకు సంబంధించిన పాస్ వర్డ్‌లను తెలుసుకుని వాటిని డీ కోడ్ చేశారు. ఈ డివైస్‌లలో లభించిన డాటాను ప్రత్యేక బృందం పరిశీలిస్తోంది. మరో పక్క నిందితుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులు ఎజి కాలనీ నుంచి ఒకరిని, రహమత్‌నగర్ నుంచి మరొకరిని అదుపులోకి తీసుకుని సిట్ కార్యాలయానికి తరలించారు. వీరు కూడా డ్రగ్స్ విక్రేతలని తెలుస్తోంది.