Wednesday, April 17, 2024

‘మన్రేగా’ ద్వారా మరిన్ని పనులు!

- Advertisement -
- Advertisement -

More work on Mahatma Gandhi Employment Guarantee Scheme

 

ఆపదలు దాపురిస్తేగాని ఆపద్బాంధవులెవరో తేటతెల్లం కాదు. సంక్షోభాల్లోనే ఆదుకునే హస్తాల జాడ తెలుస్తుంది. ఎడ, తెరిపి లేకుండా దాదాపు రెండు మాసాలుగా కొనసాగుతున్న పట్టపగటి చిమ్మ చీకటి వంటి కరోనా లాక్‌డౌన్ దేశమంతటా పేదలు కార్మికుల బతుకుల్లో సృష్టించిన కల్లోలం గురించి మళ్లీ మళ్లీ చెప్పుకోవలసిన పని లేదు. దీని వల్ల గ్రామీణ భారతంలో తలెత్తిన కరవును కడతేర్చగల కరవాలం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకమే(మన్రేగా) నని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. లాక్‌డౌన్ వల్ల చతికిలబడిపోయిన ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకునేలా చేయడానికి సూక్ష్మ చిన్న మధ్య తరహా పారిశ్రామిక వాణిజ్య సంస్థలకు ఇటీవల ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన పథకం గురించి తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మన్రేగాకు అదనంగా రూ. 40 వేల కోట్లు కేటాయించారు. అధిక భాగం రుణ వితరణకే పరిమితమైన కేంద్ర భారీ ఉద్దీపన పథకంలో గ్రామీణ పేదలకు మేలు చేసే గరిష్ఠ నేరు కేటాయింపు ఇదేనని స్పష్టపడుతున్నది.

ఈ పథకం కింద ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రత్యేకించిన రూ. 61 వేల కోట్లకు మించి అదనంగా ఈ రూ. 40 వేల కోట్లు ఖర్చు చేస్తారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అవతరించి 15 సంవత్సరాలు అవుతున్నది. 2006 ఫిబ్రవరిలో కేంద్రంలోని అప్పటి యుపిఎ పాలకులు గ్రామాల్లోని భూమిలేని వ్యవసాయ తదితర వృత్తుల్లోని కార్మికులను ఆదుకోడానికి ఈ పథకాన్ని రూపకల్పన చేసి అమల్లో పెట్టింది. దీని ద్వారా ఒక్కో పేద కుటుంబానికి ఏడాదిలో 100 పని దినాలను కల్పించాలని ఉద్దేశించింది. అప్పటి వరకు గ్రామాల్లోని పెద్ద రైతుల భూముల్లో శ్రమించి, వ్యవసాయ రంగానికి అవసరమైన పని ముట్లను తయారు చేసి, చేనేత తదితర వృత్తుల ద్వారా కుటుంబాలను పోషించుకోడం తప్ప వేరే మార్గం లేని పల్లీయ పేదలకు ఈ పథకం ఒక వరంలా అంది వచ్చింది. సాంకేతిక విప్లవం వల్ల వ్యవసాయాది రంగాలలో యాంత్రీకరణ పెరిగిపోయి కూలి పనులు కూడా దెబ్బతిన్న నేపథ్యంలో ఈ పథకం గ్రామీణ శ్రమ జీవులకు ఆశాకిరణమైంది.

అంతేకాక పెద్ద రైతులకు ఆగ్రహం కలిగిస్తే వారి పొలాల్లో పనులు కోల్పోయి పస్తులుండవలసిన దుస్థితి నుంచి ఇది వారిని కాపాడింది. ఆ విధంగా గ్రామీణ పేదల ఆత్మగౌరవ రక్షణ వ్యవస్థగా గుర్తింపు పొందింది. నగరాలకు, పట్టణాలకు, సుదూర పరాయి ప్రదేశాలకు పొట్ట చేతపట్టుకొని వెళ్లిన కోట్లాది మంది గ్రామీణ వలస కార్మికులు ఆకస్మికంగా విరుచుకుపడిన సార్వత్రిక ఆర్థిక మూసివేత, రవాణా బంద్ వల్ల ఉన్నపళంగా పనులు కోల్పోయి వందల మైళ్ల కాలి నడకన స్వస్థలాలకు చేరుకుంటూ పడుతున్న బాధల దృశ్యాలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. చేతిలో పైసా లేకుండా తిరిగి ఇళ్లకు చేరుకుంటున్న వీరు, వీరిపై ఆధారపడిన కుటుంబాలు ఆకలి చావులకు గురి కాకుండా ఉండాలంటే వారికి సొంత ఊళ్లలో తగిన ఉపాధి వ్యాపకాలు దొరకాలి. వ్యవసాయ పనులు కుంటుపడిపోయే వేసవి కాలంలో అవి ఆశించినంతగా లభించవు. తిరిగి నగరాలకు, పట్టణాలకు చేరుకొని బతకాలంటే కోల్పోయిన పనులు వెంటనే మళ్లీ దొరకవు.

అందుచేతనే ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాల్సిన అవసరాన్ని కేంద్రం గుర్తించింది. అందుకోసం అదనపు నిధులు కేటాయించడంతో పాటు ఈ పథకం కింద చేపట్టవలసిన పనులలో కొత్త వాటిని కూడా చేర్చింది. చెరువులు, గుంటలు వంటి శిథిలమై మూతపడిపోయిన సంప్రదాయ జల వనరుల పునరుద్ధరణ పనులను కూడా చేపట్టాలని నిర్ణయించింది. వర్షాకాలం దగ్గర పడినందున వాన నీటిని కాపాడుకోడానికి పాత చెరువులను, గుంటలను గుర్తించి వాటి పునరుద్ధరణ పనులను మన్రేగా కింద జరిపించాలని రాష్ట్రాలకు సూచించింది. భూగర్భ జలమట్టాలు పెంచడం, వర్ష జలాలను ఎక్కడికక్కడ ఆపడం, మురికి నీటిని శుద్ధి చేయడం వంటి పనులను ఈ పథకం ద్వారా జరిపించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

కరోనా సంక్షోభం తలెత్తిన తర్వా త వాస్తవానికి గ్రామీణ పేదలు ఈ పథకం వైపు ఆశగా చూడడం బాగా పెరిగింది. దీని కింద కార్మికుల నమోదు అధికమైంది. దేశ వ్యాప్తంగా రోజుకి లక్ష మందికి పైగా ఈ పథకం పనుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్టు తేలింది. గత 34 రోజుల్లో 35 లక్షల మంది మన్రే గా పనుల కోసం పేర్లను నమోదు చేయించుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. మన్రేగా ద్వారా పేదలకు పనులు కల్పించడంతో పాటు గ్రామీణ సమాజాల వికాసానికి తోడ్పడే అనేక నిర్మాణాలను జరిపించి జాతి సంపదను పెంచడం కూడా సాధ్యమవుతున్నది. రాజకీయ వైషమ్యాలతో ఇటువంటి పథకాలకు తెర దించకుండా కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా వాటికి జీవం పోస్తూపోడమే అసలైన జనహితం అవుతుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News