Home తాజా వార్తలు మోర్గాన్ మోత

మోర్గాన్ మోత

Ian-Morgan

ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. పసికూన అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇయాన్ మోర్గాన్ (148) విధ్వంసక సెంచరీతో కదం తొక్కడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 8 వికెట్లకు 247 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయం చవిచూసింది.

మాంచెస్టర్: ప్రపంచకప్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు అ ఫ్గాన్ ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఓడి అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టాని కి 397 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (148) విధ్వంసక సెం చరీతో ఇంగ్లండ్‌కు భారీ స్కోరు అందించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 247 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయం చవిచూసింది. ఇంగ్లండ్ బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి అఫ్గాన్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. హష్మతుల్లా షాహిది (76) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రహమత్ షా (46), అస్ఘర్ (44) తప్ప మిగతావారు రాణించక పోవడంతో అఫ్గాన్‌కు భారీ ఓటమి తప్పలేదు.
సమన్వయంతో..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ప్రారంభంలో నెమ్మదిగా ఆడింది. ఓపెనర్లు జానీ బైర్‌స్టో, జేమ్స్ విన్సి సమన్వయంతో ఆడుతూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. కుదురుగా ఆడిన విన్సి 3 ఫోర్లతో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో 44 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్‌ను కోల్పోయింది. అయితే తర్వాత వచ్చిన స్టార్ ఆటగాడు జో రూట్‌తో కలిసి బైర్‌స్టో పోరాటం కొనసాగించాడు. ఈ క్రమంలో ఇద్దరు ధాటిగా ఆడడం ప్రారంభించారు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే చెత్త బంతులను భారీ షాట్లుగా మలుస్తూ ముందుకు సాగారు. ఈ జోడీని విడగొట్టేందుకు అఫ్గాన్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ప్రపంచకప్‌లో భీకర ఫామ్‌లో ఉన్న బైర్‌స్టో, రూట్‌లు అఫ్గాన్‌పై కూడా అదే జోరును కొనసాగించారు. ఈ జంటను కట్టడి చేయడం అఫ్గాన్ బౌలర్ల తరం కాలేదు. ఇద్దరు తమ మార్క్ షాట్లతో స్కోరును పరిగెత్తించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన బైర్‌స్టో 3 సిక్సర్లు, మరో 8 ఫోర్లతో 90 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇదే సమయంలో రూట్‌తో కలిసి రెండో వికెట్‌కు 120 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌ను కూడా నమోదు చేశాడు.
మోర్గాన్ మెరుపులు..
బైర్‌స్టో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వచ్చి రావడంతోనే అఫ్గాన్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. అప్పటి వరకు అఫ్గాన్ బౌలర్ల అదుపులో ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా చేజారింది. మోర్గాన్ తన కెరీర్‌లోనే అత్యంత విధ్వంసక ఇన్నింగ్స్‌ను ఆడాడు. జో రూట్ అతనికి అండగా నిలిచాడు. మోర్గాన్ వరుస సిక్సర్లతో విరుచుకు పడడంతో అఫ్గాన్ బౌలర్లు దిక్కుతోచని స్థితికి పడిపోయారు. మోర్గాన్ ఎలా కట్టడి చేయాలో వారికి అర్థం కాలేని పరిస్థితి నెలకొంది. బౌలర్ ఎవరైనా మోర్గాన్ చీల్చి చెండాడాడు. అతని ధాటికి మైదానంలో సిక్సర్ల మోతా మోగింది. ఈ బౌలర్ ఆ బౌలర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి తన బ్యాట్ రుచి చూపించాడు. రూట్ కూడా తన మార్క్ షాట్లతో చెలరేగి పోవడంతో ఇంగ్లండ్ స్కోరు తుఫాన్‌ను తలపించింది. సమన్వయంతో ఆడిన రూట్ ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 88 పరుగులు చేశాడు. ఈ క్రమంలో మూడో వికెట్‌కు 189 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు.
సిక్సర్ల రికార్డు..
మరోవైపు ఇంగ్లండ్ సారథి మోర్గాన్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. అఫ్గాన్ బౌలర్లను ఊచకోత కోసిన మోర్గాన్ భారీ సిక్సర్లతో ప్రకంపనలు సృష్టించాడు. అర్ధ సెంచరీని 36 బంతుల్లో పూర్తి చేసిన మోర్గాన్ ఆ తర్వాత మరింత రెచ్చి పోయాడు. ప్రత్యర్థి బౌలర్లపై అసాధారణ రీతిలో విరుచుకు పడిన మోర్గాన్ 67 బంతుల్లోనే శతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో 11 భారీ సిక్సర్లు కొట్టాడు. అంతేగాక వన్డేల్లో నాలుగో వేగవంతమైన సెంచరీ సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన మోర్గాన్ కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. సునామీని తలపించిన మోర్గాన్ 71 బంతుల్లోనే 17 భారీ సిక్సర్లు, మరో నాలుగు ఫోర్లతో 148 పరుగులు చేశాడు. అంతేగాక ఓ వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లను కొట్టిన తొలి బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు క్రిస్‌గేల్ (వెస్టిండీస్), రోహిత్ శర్మ (భారత్)ల పేరిట ఉన్న 16 సిక్సర్ల రికార్డును మోర్గాన్ బద్దలు కొట్టాడు. మోర్గాన్ వీరవిహారం నేపథ్యంలో ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 397 పరుగుల రికార్డు స్కోరును నమోదు చేసింది. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు ఇదే అత్యుత్తమ స్కోరు కావడం విశేషం. ఇదిలావుండగా మోర్గాన్ వీర విహారంతో అఫ్గాన్ సంచలన బౌలర్ రషీద్ ఖాన్ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. రషీద్ 9 ఓవర్లలో ఏకంగా 110 పరుగులు ఇచ్చుకున్నాడు. 12.22 ఎకానమీతో రషీద్ ఈ పరుగులు సమర్పించుకున్నాడు. వన్డే క్రికెట్‌లో ఇది అత్యంత చెత్త బౌలింగ్‌గా రికార్డులకు ఎక్కింది.

 Morgan rains sixes as England thrashes Afghanistan