Home తాజా వార్తలు ఎటిఎస్‌లను ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు

ఎటిఎస్‌లను ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు

MoRTH Announces rules for RVSF and ATS

 

మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర రవాణా శాఖ

న్యూఢిల్లీ: వాహన సామర్థ పరీక్షలు నిర్వహించే ‘ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్(ఎటిఎస్)ల ఏర్పాటుపై కేంద్ర రోడ్డు రవాణా , రహదారుల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రప్రభుత్వాలు, కంపెనీలు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ వంటి ప్రత్యేక సంస్థలు, అసోసియేషన్లు, కొంత మంది వ్యక్తుల బృందం లేదా ఒకే వ్యక్తి.. ఇలా ఎవరైనా ఎటిఎస్ ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. సింగిల్ విండో పద్ధతిలో ఎటిఎస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలని తెలిపింది. అయితే రిజిస్టరింగ్ అథారిటీ హోదా రాష్ట్ర రవాణా కమిషనర్ వద్ద ఉంటుందని వెల్లడించింది.ఒక వేళ సామర్థ పరీక్షలో విఫలమైతే కొంత రుసుము చెల్లించి మళ్లీ పరీక్షకు వాహన యజమాని దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. అయితే ఆ పరీక్షలో కూడా విఫలమైతే ఆ వాహనం కాలం చెల్లినట్లుగా ధ్రువీకరిస్తారని పేర్కొంది.

ఒక వేళ వాహన యజమాని సామర్థ పరీక్షఫలితాలపై అసంతృప్తి చెందినట్లయితే కొంత రుసుము చెల్లించి ఫిర్యాదు చేయవచ్చు.ఫిర్యాదును పరిశీలించి సంబంధిత అప్పెలేట్ అథారిటీ పాక్షిక లేదా పూర్తిస్థాయి తనిఖీకి ఆదేశించవచ్చు. ఫిర్యాదు అందిన 15 రోజుల్లోగా ఈ పరీక్ష పూర్తి కావాలి. ఒక వేళ తనిఖీలో వాహనం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలితే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ జారీకి అప్పెలేట్ అథారిటీ ఆదేశాలివ్వాలి. అప్పెలేట్ అథారిటీదే తుది నిర్ణయం. కాగా ఎటిఎస్‌లు కేవలం సామర్థ పరీక్షా కేంద్రాలుగా మాత్రమే పని చేయాలని కేంద్రం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. వాహన మరమ్మతులు, విడిభాగాల విక్రయం సహా ఇతర ఏ సేవలకు అనుమతి లేదని పేర్కొంది. అలాగే టెస్టింగ్ కేంద్రాల్లో సరిపడా స్థలం ఉండాలని తెలిపింది. వాహన్ పోర్టల్‌కు అనుసంధానించగలిగే వ్యవస్థ సైతం ఉండాలని తెలిపింది. వాణిజ్య వాహనాలకు ఎనిమిదేళ్ల దాకా ప్రతి రెండేళ్లకోసారి, ఆ తర్వాత ప్రతి సంవత్సరం సామర్థ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది.

ఇక వ్యక్తిగత వాహనాలు రిజిస్ట్రేషన్ రెన్యువల్ (15oఏళ్ల తర్వాత) సమయంలో పరీక్షకు వెళ్లాలి. ఆతరావత అయిదేళ్లకోసారి లేదా ఆ లోపు రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఉంటే అప్పుడు సామర పరీక్షకు వెళ్లాల్సిందే. ఇక ఎటిఎస్‌లను ప్రతి ఆరు నెలలకోసారి ‘ నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ క్యాలిబ్రేషన్ లేబరేటరీస్’ (ఎన్‌ఎబిఎల్) ఆడిట్ చేస్తాయి. ఆడిట్ ఖర్చును ఎటిఎస్ నిర్వాహకులే భరించాల్సి ఉంటుంది. తొలి దశలో 75 ఎటిఎస్‌లకు అనుమతిస్తామని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు. తర్వాతి దశలో మరో 450 500ఎటిఎస్‌లకు అనుమతిస్తామన్నారు. ప్రస్తుతం 26 ఎటిఎస్‌లకు అనుమతి లభించిందని, వీటిలో ఏడు ఇప్పటికే మనుగడలోకి వచ్చాయని మంత్రి తెలిపారు. కాలం చెల్లిన వాహనాలు రోడ్లపై తిరగడం వల్ల కాలుష్య కారకాలు ఎక్కువ మొత్తలో విడుదల అవుతున్నాయి. వీటిని నియంత్రించడానికి కేంద్రం తుక్కు విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీనిప్రకారం సొంత వాహనాలు 20 ఏళ్లు, వాణిజ్య వాహనాలైతే 15 ఏళ్లకు సామర్థ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ పరీక్షలో విఫలమైతే రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు.

MoRTH Announces rules for RVSF and ATS