Home హైదరాబాద్ సిసిటీవి ఫుటేజీలున్నాఇంకా పట్టుబడలేదు!

సిసిటీవి ఫుటేజీలున్నాఇంకా పట్టుబడలేదు!

Murder

జూబ్లీహిల్స్‌లో వాహనంతో ఉడాయించిన దోపిడీదారులు
చాదర్‌ఘాట్‌లో కత్తులతో దాడిచేసి పరారైన నిందితులు
సిసిటివి కెమెరాలపైనే ఆధారపడుతున్న పోలీసులు
నగరంలో సర్వసాధారణంగా మారిన నేరాలు

మన తెలంగాణ/సిటీబ్యూరో : ఓవైపు పాట్రోలింగ్ వాహనాలు, బ్లూకోట్స్, ట్రాఫిక్ పోలీసులు, మరో వైపు వేలాదిగా సిసిటివి కెమెరాలు… అయినా నేరస్థులు తమతమ పనులను పూర్తిచేసుకుని నింపాదిగా వెళ్లిపోతున్నారు. ఇదీ నగర పోలీసుల పనితీరుకు అద్దంపడుతోంది. నగలు వేసుకుని బయటకు వెళితే స్నాచింగ్‌లు, ఇంటికి తాళం వేస్తే చోరీలు, అందరూ చూస్తుండగానే దోపిడీ దొంగల భీభత్సం. ఇక సర్వసాధారణమైన భయంకరమైన హత్యలు, అపహరణలు, అత్యాచారాలు. ప్రధానంగా బయటకు వెళితే ఏ నేరానికి తాము గురవుతామోననే ఒత్తిడి నగరవాసుల్లో కనిపిస్తున్నది. సిసిటివి కెమెరాలు వచ్చే సరికి నగరంలో పోలీసులు సదా కనిపించే విధానం (విజుబుల్ పోలీసింగ్) సన్నగిల్లింది. ఫలితంగానే నిందితులు బహిరంగంగానే తమతమ పనులను పూర్తి చేసుకుని పలాయనం చిత్తగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందోననే ఆందోళన నగరవాసుల్లో మొదలైంది. సంఘటనలు జరగకుండా చూడటానికి అధిక ప్రాధాన్యతనివ్వడంలేదని, నేరాలు జరిగిన అనంతరం సిసిటివి ఫుటేజీలను పరిశీలించి కారకులను పట్టుకునేందుకే పోలీసు యంత్రాంగం పెద్దపీట వేస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంకా పట్టుబడలేదు : పట్టపగలు నడిరోడ్డుపై జూబ్లీహిల్స్‌లో యాదగిరి అనే ఓ ప్రైవేట్ ఉద్యోగిపై ముగ్గురు నిందితులు దాడికి దిగి అతడి ద్విచక్రవాహనం, పర్సును ఎత్తుకెళ్ళారు. ఆ దోపిడీ జరిగి నెలలు గడుస్తున్నాయి. కానీ దోపిడీదారులు పోలీసులకు పట్టుబడలేదు. అలాగే, బహుదూర్‌పురాలోనూ ఆ మరునాడే మరో దోపిడీ యత్నం జరిగింది. గత శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చాదర్‌ఘాట్ ప్రాంతంలో ఓ వ్యాపారిని కత్తులతో పొడిచి రూ. 1.90 లక్షలను నగదును ఎత్తుకెళ్లారు. ఆదివారం రాత్రి సరూర్‌నగర్‌లో ఒక ఇంటిలోకి చొరబడిన దోపిడీదారులు యజమాని ప్రతిఘటనతో కత్తులతో దాడిచేసి పరారయ్యారు. ఇప్పటికీ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోలేదు.
వరసకట్టిన నేరాలు : నగరంలో ప్రస్తుతం వరుసకట్టిన నేరాలు. వీటిల్లో కొందరు పరోక్షంగా, ప్రత్యక్షంగా కూడా పోలీసులు సైతం పాలుపంచుకోవడం గమనార్హం. ప్రతి రోజు ఏదో ఒక నేరం హత్య, చోరీ, స్నాచింగ్, దోపిడీ, మోసం వంటివి చోటుచేసుకుంటున్నాయి. దీంతో పోలీసు విభాగం సమర్థవంతంగా విధులను నిర్వర్తించడంలో వెనుకబడుతుందనేది నగ ర వాసుల అభిప్రాయం. ఈ మధ్య పెట్రోలింగ్ వాహనాలు రాత్రి 10.55 గం.ల ప్రాంతంలో మద్యం దుకాణాల వద్ద, 11.55 గంటల సమయంలో బార్ల వద్ద దర్శనమిస్తున్నాయనేది బహిరంగ రహస్యం. బ్లూకో ట్స్, బీట్స్‌లను చూసే పోలీసు అధికారులు బాధ్యతాయుతంగా తమతమ ప్రాంతాలను చేరుకోవడంలేదని, పర్యవేక్షణ చేయడంలేదనే ఆరోపణలున్నాయి.
సిసిటివి కెమెరాలపైనే : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి, నూతన వాహనాలు చేతుల్లోకి, సిసిటివి కెమరాలు కార్యరూపంలోకి వచ్చిన తర్వాత పోలీ సు యంత్రాంగం విధినిర్వాహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదనేది బహిరంగ రహస్యం. కేవలం సిసిటివి కెమెరాలు అందించే ఫుటేజీ సమాచారంపైనే ఆధారపడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేరాలు జరిగిన తర్వాత పట్టుకోవడం కన్నా నేరాలకు తావులేకుండా చేయడమే ప్రధానమనే విషయాన్ని అధికారులు విస్మరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్, బహదూర్‌పురా, అఫ్జల్‌గంజ్ పోలీసు స్టేషన్‌ల పరిధిలో జరిగిన సిసిటీవి ఫుటేజీల ఆధారంతోనూ నిందితులు పట్టుకోవడంలో వెనుకబడటంపై నగరవాసుల్లో అసహనం వ్యక్తమవుతోంది.