Home తాజా వార్తలు కొడుకుతో సహా తల్లి నీటి సంపులో పడి ఆత్మహత్య

కొడుకుతో సహా తల్లి నీటి సంపులో పడి ఆత్మహత్య

Suicide

 

హైదరాబాద్ : కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన ఓ మహిళ తన 13 నెలల కుమారుడితో కలిసి నీటి సంపులో పడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సిఐ ఎ.గంగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్ బండ్ల మర్రిపురం ప్రాంతానికి చెందిన బోహినూలం మల్లేష్, సత్యమ్మలు దంపతులు. వీరు గత 30 సంవత్సరాల క్రితం బతుకు దెరువు నిమిత్తం జగద్గిరిగుట్ట షిర్డిహిల్స్‌కు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. మల్లేష్ ఇంటి వద్దే కిరాణ షాపు నడుపుతూ జీవనొపాధి పోందుతున్నాడు.

అయితే సత్యమ్మకు సంతానం కలగకపోవడంతో ఆరు సంవత్సరాల క్రితం సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలం చందాపూర్ గ్రామానికి చెందిన శంకరయ్య కూతురు లావణ్య(30) ను వివాహం చేసుకున్నాడు. లావణ్యకు ఒక పాప మానస (5) కుమారుడు మనోజ్ (13 నెలలు) ఉన్నారు. ఈ క్రమంలో మొదటి భార్య సత్యమ్మ, భర్త మల్లేష్‌లు లావణ్యతో తరచూ గొడవలు జరుగుతుండేవని దీంతో మనస్థాపం చెందిన లావణ్య తన 13 నెలల కుమారుడు మనోజ్‌తో కలిసి ఇంటి అవరణంలోని నీటి సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది.

సమాచారం అందుకున్న బాలానగర్ ఎసిపి గోవర్ధన్, సిఐ గంగారెడ్డి, పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని లావణ్య మృతికి కారకులైన మల్లేష్, సత్యమ్మలను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Mother and Son Commited Suicide with Family Quarrels