Home ఫీచర్స్ ప్రియమైన అమ్మా…

ప్రియమైన అమ్మా…

Mother

 

అమ్మ కొంగుచాటు ఆడపిల్ల ఒక్కసారిగా పుట్టింటి గారాలనొదిలి, అత్తింటి సరాగాల్లో చేరినప్పుడు ఓ కొత్త ప్రపంచంలోకి అడుగిడినప్పుడు ఈత రాని పిల్ల నీళ్లలోకి దూకినట్టు ఉక్కిరిబిక్కిరవటం సహజం. అంతవరకు లేని బాధ్యతలొచ్చి నెత్తిమీద నృత్యమాడుతుంటే తన తల్లి వీటినెంత సునాయాసంగా టాకిల్ చేసిందో గుర్తు చేసుకుంటూ అమ్మకు ఓ ఉత్తరం రాస్తే ఎలా ఉంటుంది. ఇది నిజమో, నిజంలాంటి ఊహో… ఏదైనా గుండెకు హత్తుకునేలా ఉంది. అందుకే వాట్సప్‌లో వైరలవుతున్న ఈ ఉత్తరాన్ని సకుటుంబం పాఠకాత్మీయులతో పంచుకుందామనిపించి…

ప్రతి అమ్మాయిలాగే నేను కూడా నా పెళ్లి గురించి, వైవాహిక జీవితం గురించి ఎన్నో కలలుగన్నాను. నేనెప్పుడూ అనుకోలేదు పెళ్లి అంటే పూలబాటకాదని. అత్తగారింట్లోకూడా నేను రాకుమారిలాగే ఉంటానని అనుకున్నాను. ఇప్పుడు పెళ్లయిన అమ్మాయిగా చెబుతున్నాను. పెళ్లంటే పూలతోట కాదు. సినిమాల్లో, నవలల్లో చూపించినట్లు భర్తను అంటిపెట్టుకుని సినిమాలు, షికార్లు తిరగడం కాదు. నిజజీవితం ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. పెళ్లంటే బాధ్యతలు, త్యాగాలు, సర్దుకుపోవడాలు. కుటుంబ సభ్యులందరి కోరికలు, వారి అవసరాలను తీర్చడం. ఇవన్నీ పెళ్లిలో భాగాలే అని ఇప్పుడు అర్థమైంది.

ఎప్పుడు పడితే అప్పుడు నిద్రలేవడం కుదరదిక్కడ. నేను అనుకున్నట్లుగా లేవడం వీలుకాదు. అందరి కంటే ముందే లేవాలి. చక్కగా తయారవ్వాలి. అందరికీ ఏమేం కావాలో అవన్నీ సిద్ధంగా ఉంచాలి. రోజంతా అలిసిపోయినా సరే, బట్టలు మార్చుకోవడానకి కూడా నాకు టైం దొరకదు. ఉదయం బట్టలతోనే రోజంతా ఉండాలి. నేను అనుకున్నట్లుగా రోజు గడవదు. సమయం నా చేతిలో ఉండటం లేదు. ఎక్కడికైనా వెళ్లాలంటే వెళ్లలేకపోతున్నాను. నేను కోరుకున్నట్లు కాకుండా ఇంట్లో వాళ్ల అనుమతి తీసుకుని వెళ్లాలి. కుటుంబ సభ్యుల ప్రతి అవసరాన్ని కనిపెట్టుకుని తీర్చాలి. ఒకవేళ అలిసిపోయినా కాసేపు నడుం వాల్చడానికి కుదరదు.

అందరి ముందు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండటానికి ప్రయత్నించాలి లేదా నటించాలి. ఇక్కడివాళ్లు నన్ను మహారాణిలా చూసుకోవాలని కోరుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ కనీసం నా గురించి ఆలోచించాలనుకుంటున్నాను. కానీ ఎవరూ నన్ను పెద్దగా పట్టించుకుంటున్నారనే భావన కలగడం లేదు. అప్పుడు నాకు నేనే ప్రశ్నించుకుంటున్నాను. అసలు నేనెందుకు పెళ్లి చేసుకున్నానని.. !

అమ్మా..నేను నీదగ్గరే చాలా సంతోషంగా ఉన్నాను. ఒక్కోసారి అనిపిస్తుంది తిరిగి నీదగ్గరకు
వచ్చేద్దామని. నీ గారాబంతో మళ్లీ నన్ను ఆనందంగా ఉంచవా అమ్మా.. నీ చేత్తో నాకిష్టమైన వంటలన్నీ చేయించుకుని తినాలని ఉంది. ప్రతి రోజు సాయంత్రం స్నేహితులతో కలిసి తిరిగి రావాలనుంది. నీ ఒడిలో హాయిగా నిద్రపోవాలనుంది.
మళ్లీ హఠాత్తుగా నన్ను నేను సంభాళించుకుంటాను. ఒకవేళ నువ్వు కూడా నాలాగే ఆలోచించి పెళ్లి చేసుకోకుండా ఉంటే, నాకు నీలాంటి అమ్మ దొరికే అదృష్టం ఉండేదికాదుగదా!

నీ జీవితంలో ఎన్ని త్యాగాలు చేసావో, ఎన్ని బాధ్యతలు మోసావో ..అవన్నీ ఆలోచిస్తే అమ్మో అనిపిస్తుంది. అప్పుడే కదా నీతో నాకెన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. అంతే వెంటనే తేరుకుంటున్నాను. నిన్ను ఆదర్శంగా తీసుకుని నా బాధ్యతలను చక్కగా సంతోషంగా నెరవేర్చాలనుకుంటున్నాను. నా వైవాహిక జీవితంలో ఎప్పుడూ ఆనందాన్ని నా కుటుంబ సభ్యులకు పంచుతానమ్మా. ఇందుకు నువ్వే నాకు స్ఫూర్తి. నేను కచ్చితంగా చెబుతున్నాను. నీలాగే ఈ జీవితాన్ని కూడా ప్రేమిస్తాను. దీంట్లోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తాను. నీకు నా ప్రత్యేక ధన్యవాదాలమ్మా. మా కోసం నువ్వు నీ జీవితాన్ని అర్పించినందుకు. నా వాళ్లు కూడా నాకు అంతే శక్తిని, ప్రేమను అందిస్తారనే ఆశిస్తున్నాను.

 

Mother’s Sacrifices for the Family