హైదరాబాద్: దళిత బంధు లాంటి స్కీమ్ దేశ చరిత్రలో ఎవరూ పెట్టలేదని మాజీ ఎంఎల్‌ఎ మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు. మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. దళితబంధు అమలైతే దళితులు బాగుపడుతారని, దళితులను బాగుచేసే మగాడు ఎవరొస్తారా అని ఇన్నాళ్లు చూశానని, ఇప్పుడు సిఎం కెసిఆర్ వచ్చారని పొగిడారు. దళితుల కోసం కెసిఆర్ గొప్ప పథకం తీసుకొచ్చారని మెచ్చుకున్నారు. హుజూరాబాద్‌లో మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌ను ఓడిస్తామన్నారు. అన్ని పార్టీలు దళిత బంధులు స్వాగతించాలని, దళితబంధు పథకంపై తనకు మనసు నిండా తృప్తి ఉందని, తరతరాలుగా అణగదొక్కబడిన దళితుల ఆకలి తీర్చే పథకమని ప్రశంసించారు.
ఈటెల రాజేందర్ అక్రమించిన అసైన్డ్ భూముల్లో తానే జెండాలు పాతుతానని హెచ్చరించారు. దళితబంధుకు అడ్డంపడుతున్న వారిని పక్కకు నెట్టి ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్దామని సూచించారు. 40 ఎకరాల అసైన్డ్ భూములు ఈటెల దగ్గర ఉన్నాయని ఆయనే స్వయంగా చెప్పారని, అసైన్డ్ భూములను తిరిగి ఇవ్వకుంటే ఈటెలకు పుట్టగతులు ఉండవని మోత్కుపల్లి హెచ్చరించారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఈటెలను బహిస్కరించాలని పిలుపునిచ్చారు. ఈటెల బావమరిది దళితుల పట్ల చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే ఈ సారి డిపాజిట్ కూడా రాదని మోత్కుపల్లి విమర్శించారు.