Home తాజా వార్తలు కేంద్రం చేసింది సున్న

కేంద్రం చేసింది సున్న

 

కాళేశ్వరం ప్రాజెక్టుకు సాయం చేయలేదు, ఇప్పటికీ జాతీయ హోదా ఇవ్వలేదు
కిసాన్ సమ్మాన్‌తో రైతులకు ఒరిగేదేమీలేదు
రైతుబంధే అన్నింటా మిన్న
అమెరికాలో బాధలు పడుతున్న విద్యార్థులను ఆదుకోవాలి
లోక్‌సభలో టిఆర్‌ఎస్ ఎంపి జితేందర్‌రెడ్డి

మన తెలంగాణ/న్యూఢిల్లీ, హైదరాబాద్: ప్రజల అవసరాలే కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం, వాటిని పకడ్బందీగా అమలుచేయడంతో ప్రజలు మరోసారి తమ పార్టీకి అధికారాన్ని అప్పగించారని, తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధుతో పోలిస్తే కేంద్రం అమలుచేయనున్న కిసాన్ సమ్మాన్ పథకంతో రైతులకు పెద్దగా ఒరిగేదేమీ లేదని టిఆర్‌ఎస్ ఎంపి జితేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. లోక్‌సభలో సోమవారం చర్చ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ, తాజాగా ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రెండు పాఠాలను నేర్పాయని, రైతులను విస్మరించరాదనే అంశం ఒకటైతే, రైతుల రుణాలను మాఫీ చేయలనేది రెండో అంశమన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా ముందుచూపుతో రైతుల కష్టాలను స్వయంగా చూసి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, ఎన్నికల్లో అది చాలా గుణాత్మకమైన ప్రభావాన్ని చూపిందన్నారు. ఇక తెలంగాణకు దీర్ఘకాలంగా ఉన్న సాగునీటి సమస్యకు కారణాలను విశ్లేషించి ప్రతిష్ఠాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని, ‘వాటర్ మాన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్రసింగ్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ అధికారులు, నీతి ఆయోగ్ ప్రతినిధులు స్వయంగా క్షేత్రస్థాయిలో ఈ ప్రాజెక్టు పనులను చూసి ప్రశంసలు కురిపించారని, కానీ దురదృష్టవశాత్తూ కేంద్రం ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయడంగానీ, రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నట్లుగా ఇప్పటికీ జాతీయ హోదా ఇవ్వకడపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఈ ప్రాజెక్టును సందర్శించి రాష్ట్ర విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించాలని కోరారు. కేంద్ర బడ్జెట్‌లో ఆ ప్రాజెక్టుకు నిధులనే కేటాయించలేదని గుర్తుచేశారు. రైల్వే డబ్లింగ్, బ్రిడ్జిల నిర్మాణం కోసం దక్షిణ మధ్య రైల్వేకు నిధులు కేటాయించడాన్ని స్వాగతించిన జితేందర్‌రెడ్డి వరంగల్‌లో గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటుకు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మరిన్ని ఉన్నత విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు స్వయంగా ప్రధాని మోడీయే వ్యాఖ్యానించారని, దీన్నిబట్టి తెలంగాణకు కేంద్రం నుంచి ఏ మేరకు సహకారం ఉందో స్పష్టమవుతోందని అన్నారు.
భారతీయ విద్యార్థుల బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే :
అమెరికాలోని భారతీయ విద్యార్థులను నేరస్థులుగా చూస్తూ ఆ దేశం తీసుకున్న చర్యలను తప్పుపట్టిన జితేందర్‌రెడ్డి ఉన్నత చదువుల కోసం ఆ విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ పంపించారని, ఇప్పుడు అర్ధాంతరంగా స్వదేశానికి పంపించడంతో ఆర్థిక బాధలు తీరేదెట్లా అని ప్రశ్నించారు. వారి చదువులు కొనసాగేందుకు, ఆప్పుల భారం లేకుండా చూసే బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని కోరారు. అమెరికా హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం అధికారుల చర్యల కారణంగా సుమారు 600 మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని, ఇందులో 129 మందిని పోలీసులు అరెస్టు చేశారని గుర్తుచేశారు. ఆ విశ్వవిద్యాలయం చట్టవిరుద్ధంగా నడుస్తుందనే విషయం విద్యార్థులకు తెలియదని, చట్టబద్ధంగానే వీసా తీసుకుని వెళ్ళిన భారతీయ విద్యార్థులను వారి అభీష్టానికి భిన్నంగా తిరిగి స్వదేశానికి పంపాలని ఆ దేశం తీసుకున్న నిర్ణయం సహేతుకం కాదన్నారు. విద్యార్థులను మోసం చేయడానికి ఏజెంట్లు తప్పుడు మార్గం అనుసరించి ఉండవచ్చుగానీ విద్యార్థుల తప్పేమీ లేనప్పుడు వారిని కూడా దోషులుగా చూసే తీరు గర్హనీయమన్నారు. ఈ విద్యార్థుల్లో తెలంగాణకు చెందినవారు కూడా ఉన్నారని, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆ దేశ కాన్సుల్ జనరల్‌తో సమావేశమై ఈ అంశాన్ని చర్చించారని, విదేశా శాఖ కూడా తన వంతు ప్రయత్నం చేయాలని కోరారు. విద్యార్థుల తప్పేమీ లేనప్పుడు వారిని బలవంతంగా అక్కడి నుంచి తిరిగి స్వదేశానికి పంపడంతో ఆర్థికంగా మాత్రమే కాక విద్యాపరంగా కూడా నష్టపోతున్నారని, విదేశాంగ శాఖ మానవతా దృక్పథంతో లీగల్ సాయంతో పాటు ఆర్థిక సాయం కూడా చేసి విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా చూడాలని కోరారు. ఇకపైన విద్యార్థులు వేధింపులకు గురికాకుండా చొరవ తీసుకోవాలని కోరారు.

MP Jithender Reddy Fire on Central Govt