Friday, April 19, 2024

కేంద్ర మంత్రి దాన్వేపై శివ’మెత్తిన’సేన

- Advertisement -
- Advertisement -
MP Sanjay Raut fires on Union Minister Raosaheb Danveదాన్వేను బర్తరఫ్ చేయాలి: ఎన్‌సిపి

ముంబయి: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని శివార్లలో ఆందోళన చేస్తున్న రైతుల వెనుక చైనా, పాకిస్తాన్ ఉన్నాయంటూ ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి రావుసాహెబ్ దాన్వే శివసేన ఎంపి సంజయ్ రౌత్ మండిపడ్డారు. అదే నిజమైతే పొరుగు దేశాలకు కేంద్ర ప్రభుత్వం బుద్ధి చెప్పాలంటూ ఆయన సవాలు చేశారు. దాన్వే ఆరోపణలపై శరద్ పవార్ సారథ్యంలోని ఎన్‌సిపి కూడా ధ్వజమెత్తింది. రైతుల నిరసనపై కేంద్ర ప్రభుత్వ వైఖరి అది కాని పక్షంలో దాన్వే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎన్‌సిపి డిమాండు చేసింది. శివసేనకు చెందిన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ గురువారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి దాన్వే చేసిన ప్రకటనను శివసేన తీవ్రంగా పరిగణిస్తోందని, ఆ రెండు పొరుగు దేశాలకు గుణపాఠం నేర్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని తాము భావిస్తున్నామని అన్నారు.

ఒక ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తినందుకు దాన్వేకు తాము ధన్యవాదాలు తెలియచేస్తున్నామని ఆయన వ్యంగ్యంగా అన్నారు. సింఘూ పొలిమేరల్లో లక్షలాదిమంది రైతులు తమ డిమాండ్లపై మొండిపట్టుదలతో నిరసన తెలియచేస్తున్నారని, ఈ ప్రతిష్టంభనను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వానికి ఉంటే ఇప్పటికే ఒక పరిష్కారం కనుగొని ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. దేశమంతటా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఒకే విధంగా ఉన్నాయని కూడా ఆయన అన్నారు. వ్యవసాయ సంస్కరణలను కేంద్రం అమలు చేయాలని భావిస్తే ముందుగా బిజెపి పాలిత రాష్ట్రాలలో వాటిని అమలు చేయాలని, అక్కడ విజయవంతమైతే మిగిలిన రాష్ట్రాలలో అమలు చేయాలని ఆయన సూచించారు. కొన్నేళ్ల క్రితం బీహార్‌లో రద్దు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ(ఎపిఎంసి) గురించి ప్రస్తావిస్తూ తనకు తెలిసిన సమాచారం మేరకు బీహార్‌లో ఆహార ధాన్యాల ధర రూ.900 ఉందని, అదే పంజాబ్‌లో రూ. 1500 ఉందని చెప్పారు.

తమ పంటలు అమ్ముకోవడానికి బీహార్ నుంచి రైతులు పంజాబ్‌కు వెళ్లాలా అని ఆయన ప్రశ్నించారు. కాగా..ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి దాన్వే చేసిన వ్యాఖ్యలపై న్‌సిపి జాతీయ ప్రతినిధి, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తీవ్రంగా మండిపడ్డారు. ఇది ప్రభుత్వ వైఖరా లేక దాన్వేదా అన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆయన డిమాండు చేశారు. ఇదే ప్రభుత్వ వైఖరైతే రైతులతో కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఎందుకు చర్చలు జరుపుతున్నారని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా రైతు సంఘాల ప్రతినిధులతో ఎందుకు సమావేశమయ్యారని ఆయన నిలదీశారు. అది ప్రభుత్వ వైఖరి కాని పక్షంలో దాన్వే తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండు చేశారు. ఇలా ఉండగా, దాన్వే ఆరోపణలను సిగ్గుచేటుగా ఎన్‌సిపి ముఖ్య అధికార ప్రతినిధి మహేష్ తపసే అభివర్ణించారు. దాన్వేను కేంద్ర మంత్రివర్గం నుంచి వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News