Home తాజా వార్తలు అడవికి అండ

అడవికి అండ

santhosh-Kumar

హరితహారంలో భాగంగా కీసరగుట్ట రిజర్వుఫారెస్టును
దత్తత తీసుకున్న ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్

n కెటిఆర్ పుట్టినరోజు పిలుపుకి స్పందన
n 2042ఎకరాల ప్రాంతంలో ఎకోటూరిజం పార్కు, అడవి పునరుజ్జీవన చర్యలు
n అడవుల అభివృద్ధికి తోడ్పడాలంటూ మాజీ ఎం.పి కవిత, హీరోలు విజయ్ దేవరకొండ, నితిన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, పారిశ్రామిక వేత్త ముత్తా గౌతమ్‌కు ట్యాగ్ చేసిన సంతోష్

మన తెలంగాణ/హైదరాబాద్: స్పందించే హృదయంతో, తానున్నానంటూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటంలో ముందుంటూ, అందరూ సంతన్నగా ప్రేమగా పిలుచుకునే రాజ్యసభ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ మరో వి నూత్న నిర్ణయం తీసుకున్నారు. టిఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు (వర్కింగ్ ప్రెసిడెంట్) కెటిఆర్ బుధవారం తన పుట్టిన రోజును జరుపుకుంటున్న నేపథ్యంలో ఓ రిజర్వ్ ఫారెస్ట్ ను అభివృద్ది చేసేందుకు దత్తత తీసుకుంటున్నట్లు సంతోష్‌కుమార్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కెటిఆర్ తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి హం గూ ఆర్భాటాలూ, అనవసర ఖర్చులు చేయవద్దని ఇప్పటికే సూచించారు. ఆ డబ్బుతో ఆపదలో ఉన్న వారికి వీలైనంత సహాయం చేసి ఆదుకోవాల్సిందిగా ఆయన టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అలాగే సమాజహితం కో సం పనిచేయాలని కెటిఆర్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే గిఫ్ట్ ఏ స్మైల్ అనే నినాదాన్ని ట్వి ట్టర్ లో కెటిఆర్ పోస్ట్ చేశారు. దీనిని స్ఫూర్తిగా తీ సుకున్న ఎంపి సంతోష్, హైదరాబాద్ శివారులో ఉన్న కీసరగుట్ట రిజర్వ్ ఫారెస్ట్‌లో 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు మంగళవారం ప్రకటించారు.

ప్రభుత్వం అటవీ శాఖ ద్వారా అమలు చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్దిలో భాగంగా ఈ ప్రాంతంలో ఎకో టూరిజం పార్కును తన ఎంపి నిధులతో తీర్చిదిద్దుతామని సంతోష్ వెల్లడించారు. త్వరలోనే కీసరగుట్ట అటవీ ప్రాంతంలో పర్యటించి, అభివృద్ది ప్రతిపాదనలు సిద్దం చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ది చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు అద్భుతంగా ఉన్నాయని, పట్టణ ప్రాంత వాసులు సేదతీరేందుకు, ఆరోగ్యకర జీవనవిధానం అలవర్చుకునేందుకు ఇవి తోడ్పాటునిస్తాయని సంతోష్ అన్నారు. వారాంతాల్లో కుటుంబంతో సహా సేద తీరే చక్కని ప్రాంతాలుగా, పిల్లల్లో పర్యావరణం, అటవీ, జీవ వైవిధ్యం ప్రాధాన్యతలు తెలుసుకునే ప్రాంతాలుగా ఈ అర్బన్ ప్రాంతాల అభివృద్ది జరుగుతోందన్నారు. కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని మంచి ఎకో టూరిజం ప్రాజెక్టుగా తీర్చి దిద్ది హైదరాబాద్ వాసులకు బహుమతిగా ఇస్తామన్నారు. 2042 ఎకరాల అటవీ ప్రాంతంలో కొంత భాగాన్ని ఎకో టూరిజం ప్రాజెక్టును అభివృద్ది చేసి, మిగతా ప్రాంతాన్ని అంతటిని అటవీ పునరుజ్జీవనం కింద రక్షిత అటవీ ప్రాంతంగా తీర్చిదిద్దుతామని సంతోష్ కుమార్ వెల్లడించారు.

యాదాద్రి, కీసరగుట్టలకు వచ్చే భక్తులు, పర్యాటకులకు కూడా ఈ ఎకో టూరిజం పార్కు అందుబాటులో ఉంటుదని తెలిపారు. అలాగే తన ట్విట్టర్ ద్వారా మరికొందరు ప్రముఖులను కూడా ట్యాగ్ చేసిన సంతోష్ అటవీ ప్రాంతాల అభివృద్దిలో, అర్బన్ లంగ్ స్పేస్ ల అభివృద్దిలో పాలుపంచుకోవాల్సిందిగా గిఫ్ట్ ఏ స్త్మ్రల్ ఛాలెంజ్ విసిరారు. ఇందులో మాజీ ఎంపీ కవిత, హీరోలు విజయ్ దేవరకొండ, నితిన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, పారిశ్రామిక వేత్త ముత్తా గౌతమ్‌లకు ట్యాగ్ చేశారు. కాగా ఎంపి సంతోష్‌కుమార్ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు పెద్దఎత్తున ఆహ్వానం పలికారు. హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన పోస్టులపై ప్రశంసిస్తూ తిరిగి మెసేజ్‌లను పోస్ట్ చేశారు. సంతోష్‌కుమార్ చేసిన పోస్టుపై దర్శకుడు వంశీ పైడిపల్లి వెంటనే స్పందించారు. ఎంపి స్పూర్తిని అభినందిస్తున్న పేర్కొన్నారు. మంచి నిర్ణయంలో తనను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఎంపి సంతోష్‌కుమార్‌కు పైడిపల్లి కృతజ్ఞతలు తెలిపారు.

MP Santosh Kumar adopts keesaragutta Reserve Forest