Home తాజా వార్తలు లావణ్యకు రిమాండ్

లావణ్యకు రిమాండ్

MRO-Lavanya

మనతెలంగాణ/హైదరాబాద్/కేశంపేట : రంగారెడ్డి జిల్లా కేశంపేట ఎంఆర్‌ఓ లావణ్యను ఎసిబి అధికారులు గురువారం అరెస్టు చేసి ఎసిబి కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఎసిబి కోర్టు ఆమెకు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. రైతు నుంచి రూ. 4లక్షలతో పట్టుబడ్డ కేసులో విచారణ చేపట్టిన ఎసిబి అధికారులు సూత్రధారి ఎంఆర్‌ఒగా పాత్రధారి విఆర్‌ఒగా గుర్తించారు. ఈక్రమంలో ఎసిబి అధికారులు ఎంఆర్‌ఒ లావణ్య భారీ మొత్తంలో రూ. 93 లక్షల నగదు, 400 గ్రాము ల బంగారు ఆభరణాలు లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అవినీతి కేసును అధికారులు మరిం త లోతుగా శోధిస్తున్నారు. గతం లో ఆమె పనిచేసిన ప్రాంతాలలో అవినీతిపై ఎసిబి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఇదిలావుండగా బుధవారం రాత్రి వరకు లావణ్య నివాసంలో తనిఖీలు చేసిన ఎసిబి అధికారులు గురువారం ఉదయం ఆమెను అరెస్టు చేశా రు.

ఆమె భర్త వెంకటేశ్ నాయక్ పరారీలో ఉన్నట్టు ఎసిబి అధికారులు వివరిస్తున్నారు. ఎంఆర్‌ఒ లావణ్య భర్త మున్సిపల్ పరిపాలనా విభాగంలో పనిచేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. కాఆ బుధవారం కొందుర్గు విఆర్‌ఒ అంతయ్య రైతు నుంచి రూ. 4లక్షలు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడగా ఎంఆర్‌ఒ లావణ్య వ్యవహారం వెలుగుచూసింది. ఎంఆర్‌ఒ లావణ్య ఆదేశాల మేరకే అనంతయ్య లంచం తీసుకుంటున్నట్టు ఎసిబి విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో హయత్‌నగర్‌లోని ఆ మె నివాసంలో ఎసిబి అధికారులు సోదాలు చేపట్టగా రూ.93లక్షల నగదు, 40తులాలకు పైగా బంగారం లభ్యమైంది. దీంతో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్టు తేలడంతో ఎంఆర్‌ఒ లావణ్య, విఆర్‌ఒ అంతయ్యలను అరెస్టు చేసి ఎసిబి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.
ఆశ్చర్యపోయిన ఎసిబి అధికారులు
ఎంఆర్‌ఒ లావణ్య ఇంట్లో సోదాలు మొదలుపెట్టిన ఆధికారులు భారీ ఎత్తున నగదును చూసి ఎసిబి అధికారులు ఆశ్చర్యపోయారు. ఇంట్లో ఎక్కడ వెతికినా భారీ ఎత్తున నగదు లభ్యంకావడంతో అధికారులు విస్తూపోయారు. ఈ క్రమంలో సోదాలలో మొత్తం రూ.93 లక్షలుగా లెక్క తేల్చారు. ఈ నగదుకు సంబంధించి వివరాలు కావాలని ఆమెను అడగ్గా. సమాధానం చెప్పలేదు. వీటితో పాటు బంగారు ఆభరణాలను 40 తులాలుగా గుర్తించారు. నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎంఆర్‌గా లావణ్య 2016 నుంచి కేశంపేటలో పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఆమె భర్త సైతం జిహెచ్‌ఎంసిలో సూరింటెండెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కేశంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఎసిబి అనిశా అధికారులు రికార్డులను పరిశీలించారు. విఆర్‌ఒ అంతయ్యతో పాటు ఎంఆర్‌ఒ వి.లావణ్యపై కేసు నమోదు చేశామని ఎసిబి ఉన్నతాధికారి రమణకుమార్ మీడియాకు తెలిపారు. ఎంఆర్‌ఒ లావణ్య అరెస్ట్ విషయం తెలుసుకున్న ఆమె భర్త వెంకటేష్ పరారయ్యారు. అడ్మినిస్ట్రేట్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న లావణ్య భర్త వెంకటేష్ ఎసిబి అధికారులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లాడని ఎసిబి అధికారులు వివరిస్తున్నారు.
సూత్రధారి ఎఆర్‌ఒ..పాత్రధారి విఆర్‌ఒ
డిజిటల్ పాసుపుస్తకం కోసం ఆశ్రయించిన రైతునుంచి బుధవారం రూ.4 లక్షలు తీసుకుంటూ విఆర్‌ఒ అడ్డంగా దొరకిన కేసులో ఎంఆర్‌ఒ లావణ్య సూత్రధారి అని ఎసిబి అధికారులు పేర్కొంటున్నారు. కేశంపేట మండలంలోని దత్తాయపల్లి గ్రామానికి చెందిన రైతు మామిడిపల్లి చెన్నయ్యకు సర్వే నంబరు 85/ఆలో 9ఎకరాల 7 గుంటల పొలం ఉంది. గత నెల మెదటి వారంలో డిజిటల్ పాస్‌పుస్తకాల కోసం ఆ రైతు విఆర్‌ఒ అంతయ్యను సంప్రదించాడు. ఈ విషయాన్ని విఆర్‌ఒ వెంటనే ఎంఆర్‌ఒ లావణ్యకు తెలియజేశాడు. కొంతకాలం రైతను ఆఫీసు చుట్టూ తిప్పాలని ఎంఆర్‌ఒ ఆదేశించింది. ఈ క్రమంలో విఆర్‌ఒ వారం రోజుల తర్వాత తనను కలవాల్సిందిగా రైతుకు సూచించాడు.
రైతు మళ్లీ జూన్ 18న విఆర్‌ఒను సంప్రదించాడు. పట్టా పాసుపుస్తకాలను రైతుకు అందజేసిన విఆర్‌ఒ సదరు భూమి వివరాలను మాత్రం ఆన్‌లైన్‌లో ఉంచలేదు. విషయాన్ని గమనించిన రైతు మరోసారి విఆర్‌ఒను కలిశాడు. అప్పటికే ఎంఆర్‌ఒ తనకు రూ. 5లక్షలు ఇవ్వాలని విఆర్‌ఒకు ఆదేశాలిచ్చింది. దీంతో విఆర్‌ఒ తనకు రూ.3లక్షలు, ఎంఆర్‌ఒ లావణ్యకు రూ.5లక్షలు.. మొత్తం రూ.8లక్షలు ఇవ్వాల్సిందిగా రైతును డిమాండ్ చేశాడు. దీంతో సదరు రైతు ఎసిబి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఎసిబి అధికారుల బృందం వారం రోజులుగా నిఘా ఉంచింది. ఎట్టకేలకు బుధవారం రూ.4లక్షలు కొందుర్గు ఎంఆర్‌ఒ కార్యాలయంలో రైతు నుంచి వీఆర్వో తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఈ కేసును విచారించిన ఎసిబి అధికారులు రూ. 4లక్షల లంచం చేసులో ఎంఆర్‌ఒ కీలక భూమిక పోషించినట్లు తేల్చారు. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో ఉత్తమ ఎంఆర్‌ఒగా అవార్డు అందుకున్న లావణ్య ప్రస్తుతం అవినీతి కేసులో జైలు ఊచలు లెక్కపెట్టాల్సి కావడం గమనార్హం.

MRO Lavanya Arrested By ACB Officals