Wednesday, April 24, 2024

ప్రధాన కోచ్‌గా ద్రవిడ్‌ను నియమించాలి

- Advertisement -
- Advertisement -

న్యూఢిలీ: టీమిండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను ఎంపిక చేయడమే ఉత్తమమని సెలెక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అభిప్రాయపడ్డాడు. వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత రవిశాస్త్రి కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నాడు. అతని పదవీ కాలం నవంబర్ 14తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్‌ని ఎంపిక చేసే పక్రియను బిసిసిఐ వేగవంతం చేసింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ, భారత మాజీ ఆటగాళ్లు వివిఎస్.లక్ష్మణ్, అనిల్ కుంబ్లేల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కాగా కొత్త కోచ్ ఎంపికకు సంబంధించి పలువురు మాజీ క్రికెటర్లు తమ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. తాజాగా మాజీ చీఫ్ సెలెక్టర్ ప్రసాద్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. రవిశాస్త్రి తర్వాత ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ ఉంటే టీమిండియాకు ఎంతో ప్రయోజనంగా ఉంటుందన్నాడు. ఇదే సమయంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని మెంటార్‌గా ఎంపిక చేయాలని సూచించాడు. వీరిద్దరి పర్యవేక్షణలో టీమిండియా మరింత బలమైన శక్తిగా ఎదగడం ఖాయమన్నాడు. యువ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన ద్రవిడ్ తన సత్తా చాటాడన్నాడు. ఎంతో మంది యువ క్రికెటర్లను టీమిండియాకు పరిచయం చేసిన ఘనత అతనికే దక్కుతుందన్నాడు. ద్రవిడ్ శిక్షణలోనే భారత అండర్19 జట్టు వరల్డ్‌కప్ గెలిచిన విషయాన్ని ప్రసాద్ గుర్తు చేశాడు. ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్‌గా వస్తే సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అతనికి అండగా నిలిచే అవకాశం ఉంటుందన్నాడు.

ద్రవిడ్ అంటే ప్రతి క్రికెటర్‌కు ఎంతో గౌరవమని, ప్రస్తుతం భారత జట్టుకు ఆడుతున్న ఎక్కువ మంది యువ ఆటగాళ్లు అతని శిక్షణలోనే రాటుదేలారన్నాడు. ఇక ధోనిని మెంటార్‌గా నియమిస్తే టీమిండియాకు మరింత ప్రయోజనం కలుగుతుందన్నాడు. ఎంతో అపార అనుభవం కలిగిన ధోని యువ క్రికెటర్లను మెరుగైన క్రికెటర్లుగా తీర్చిదిద్దడం ఖాయమన్నాడు. ఇద్దరు కలిస్తే భారత క్రికెట్ స్వరూపమే మారిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదని ప్రసాద్ పేర్కొన్నాడు. కెప్టెన్‌గా సుదీర్ఘ కాలం టీమిండియాకు సేవలు అందించిన ఘనత ధోని సొంతమని, యువ క్రికెటర్ల ప్రతిభను గుర్తించి వారిని ఉత్తమ ఆటగాళ్లుగా తీర్చిదిద్దిన ఘనత అతనికే సొంతమన్నాడు. ధోని, ద్రవిడ్‌లను ఎంపిక చేయాలన్నది తన సూచన మాత్రమేనని, దీనిపై నిర్ణయం తీసుకునే అధికారం బిసిసిఐకి మాత్రమే ఉందని ప్రసాద్ స్పష్టం చేశాడు.

MSK Prasad wants Dravid to replace Ravi Shastri

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News