Home కలం భాషలో గజిబిజికి భరతవాక్యం పలికే యుక్తవాక్యం

భాషలో గజిబిజికి భరతవాక్యం పలికే యుక్తవాక్యం

Much Water Has Flowed Under the Bridge

 

భాషాపరంగా ఎన్నో వాక్యాల్లోని తప్పులను సహేతుకంగా చూపించడంతో పాటు, సరైన విధంగా రాసే పద్ధతిని కూడా విశ్లేషణాత్మకంగా వివరించారు రచయిత. వాక్యాల్లోని దోషాలను మొత్తం ఎనిమిది రకాలుగా వర్గీకరించి, అనేక సూచనలు చేశారు. భాషలో సందేహా లుండే వారికి బాసటగా నిలిచే గ్రంథ మిది. పత్రికా రచయితలకు, భాషా వ్యవహర్తలకు అనేక విధాలుగా ఈ గ్రంథం ఉపకరిస్తుంది.

‘వంతెన కింద చాలా నీరు ప్రవహించింది’. ఒక వాక్యంలోని ఈ భాగాన్ని చూస్తే తప్పేమీలేదనిపిస్తోంది కదా! ‘మచ్ వాటర్ హాస్ ఫ్లోడ్ అండర్ ద బ్రిడ్జ్’ అనే వాక్యానికి అనువాదంగా ఈ వాక్యాన్ని రాశారు. ఆంగ్లం నుండి తెలుగులోకి తర్జుమా చేసేప్పుడు అనువాదకులకు రెండు భాషల్లోనూ పూర్తి అవగాహన లేని సందర్భాల్లో ఇలాంటి తప్పులు తరచుగా దొర్లుతాయి. పరిశీలించి చూస్తే తప్ప అందులోని తప్పు తెలియదు. ఈ వాక్యానికి ముందున్న వాక్యాన్నో లేదా ఆ వాక్యాన్ని పూర్తిగానో పేర్కొంటే తప్పు స్పష్టమవుతుంది. ఆ అనువాదకుడు రాసిన ఆ పూర్తి వాక్యం ఇలా ఉంది. “రైల్వే స్టేషనులో వాళ్లిద్దరూ కలుసుకున్నప్పటి నుండి వంతెన కింద చాలా నీరు ప్రవహించింది”. ఈ వాక్యం చదివితే ఆ ఇద్దరూ రైల్వే స్టేషనులో కలుసుకున్నారన్న విషయం అర్థమవుతోంది. అయితే రైల్వే స్టేషనులో వాళ్లిద్దరూ కలుసుకోవడానికి, వంతెన కింద నీళ్లు రావడానికి సంబంధం ఏమిటి? సాధారణ పాఠకుడికి అర్థం కాదు.

బహుశా ఆ రైల్వే స్టేషను దగ్గర ఒక వంతెన ఉందేమో, ఆ వంతెన కింద చాలా నీరు ప్రవహించిందేమోనని భావిస్తాడు. వర్షం పడడమో లేదా వంతెన ఎగువ ప్రాంతం నుండి నీటిని వదలడమో జరిగి ఉంటుందని ఊహిస్తాడు. కానీ మూల రచయిత ఉద్దేశ్యం వేరు. ‘ఆ ఇద్దరూ కలుసుకున్నప్పటి నుండి చాలా విషయాలు జరిగాయ’ని చెప్పడం ఆ రచయిత ఉద్దేశ్యం. జాతీయాన్ని సాధారణార్థంలో అనువదించడం గందరగోళానికి తావిచ్చింది. “ప్రశ్నాపత్రాలు మీ స్కూలుకి వచ్చాయా?” ఒక భాషోపాధ్యాయుడిని మండల విద్యాధికారి వేసిన ప్రశ్న. ‘ప్రశ్నపత్రాలు వచ్చాయి సార్!’ ఉపాధ్యాయుడి జవాబు. సూక్ష్మంగా తరచి చూస్తే తప్ప ఈ సంభాషణలో భాషాపండితుడి అంతరార్థం బోధపడదు.

‘పాత స్కీము తిరిగి పునరుద్ధరణ’. ఒక పత్రికాఫీసులో వార్తలకు తుదిరూపం ఇస్తున్న ఉప సంపాదకుడు పెట్టిన ఒక శీర్షిక ఇది. కాసేపటికి ఎడిటర్ నుండి పిలుపు. “మొన్న కొన్ని రోజులు సెలవు తీసుకున్నారు కదా! సెలవు నుండి తిరిగి పునరాగమనం ఎప్పుడు జరిగింది?” భాషాపరిజ్ఞానం అణువణువునా మూర్తీభవించిన ఆ ఎడిటర్ వేసిన ప్రశ్నను కుశలప్రశ్నల్లో భాగంగానే భావించాడా ఉప సంపాదకుడు.మరో పత్రికాఫీసులో సబ్ ఎడిటర్ ను ఒక డెస్క్ ఇన్‌ఛార్జి సంజాయిషీ అడుగుతున్నారు “ఒక్క వార్తలో ఇన్ని పొరబాట్లా?” అని. “మళ్లీ ఈ పొరపాట్లు రాకుండా చూసుకుంటా సార్‌” అంటూ ‘పొరపాటు’్ల అనే పదాన్ని నొక్కి మరీ హామీ ఇచ్చాడు ఆ సబ్ ఎడిటర్ .

అదొక బస్ స్టేషన్. బస్సు వేళలను అనౌన్స్ చేసే ఉద్యోగికి బయటికి వెళ్ళాల్సిన పనిపడింది. కొద్ది సేపు అనౌన్స్‌మెంట్ చేయవలసిందిగా మరో ఉద్యోగిని రిక్వెస్ట్ చేసి, తన స్థానంలో కూర్చోబెట్టాడు. వెంటనే ఆ ఉద్యోగి అడిగిన ప్రశ్న “సార్! ‘ప్రయాణికులు’ అనాలా? ‘ప్రయాణీకులు’ అనాలా?” అని. కొన్ని పదాలను పేర్చుకుంటూపోతే వాక్యం తయారవుతుందనుకుంటాం. అది నిజం కూడా. కానీ సరైన పదాలను రాయడంలో, ఆ పదాలను ఒక పద్ధతి ప్రకారం పేర్చుకోవడంలో ఉన్నది చిక్కంతా. ఏ మాత్రం తేడా వచ్చినా అర్థాలు మారిపోతాయి. అందుకే పద ప్రయోగం, వాక్య నిర్మాణం ఎలా చేయాలనే విషయం భాషా వ్యవహర్తలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. కేవలం జర్నలిస్టులకో, పండితులకో తెలిస్తే సరిపోదు. గతంలో చేకూరి రామారావు వంటివారు వాక్య నిర్మాణ పద్ధతులపై వ్యాసాలు, గ్రంథాలు రచించారు. అయితే వాటిలో అధికశాతం వ్యాసాలు, గ్రంథాలు పండితుల కోసమో, పత్రికారచయితల కోసమో ఉద్దేశించినవి.

భాషను నేర్చుకుంటున్న వారికోసం రూపొందించినవి మరికొన్ని. అధికశాతంలో ఉండే సాధారణ భాషా వ్యవహర్తల కోసం ఉద్దేశించిన భాషా గ్రంథాలు చాలా తక్కువగా వచ్చాయని భావించవచ్చు. అలాంటి కోవలోకి వచ్చేదే ప్రముఖ కవి, రచయిత, అనువాదకులు ఎలనాగ రాసిన ‘యుక్తవాక్యం’ గ్రంథం. భాషకు సంబంధించిన ప్రత్యేక అవసరాలు ఎక్కువగా ఉండే పత్రికారచయితలకు ఈ గ్రంథం కరదీపికగా ఉపయోగపడుతుంది. పైన వివరించిన సంఘటనల్లో పేర్కొన్న అంశాలకు కూడా సరైన వివరణ అందజేశారు రచయిత. మనమందరం చేసే కొన్ని సామాన్యమైన తప్పులుంటాయి. వాటిని కూడా ఎత్తిచూపారు ఎలనాగ. ఉదాహరణకు ‘టిఫిన్ చేయడం’ అనే పదబంధం. ‘చేశాను’ అనే పదానికి ‘తిన్నాను’ అనే అర్థం ఉన్నా, తయారుచేయడమనే భిన్నమైన భావాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. అందువల్ల ‘టిఫిన్ తినడం’ అనే పదబంధాన్ని వాడాలని ఎలనాగ పేర్కొన్నారు. ఇలాంటిదే ‘భోజనం చేయడం’ కూడా. కానీ అందులో అపసవ్యత కనబడదు కాబట్టి ఉపయోగించవచ్చని సూచించారు.

కొన్ని పదాలను కొందరు తప్పుగా రాస్తుంటారు. వాటిని పేర్కొన్నారు రచయిత. కొందరు ‘హృదయం’ అనే పదాన్ని ‘హ్రిదయం’ అని, ‘కృష్ణ’ అనే పదాన్ని ‘క్రిష్ణ’ అని రాస్తుంటారు. ఇందులోని తప్పును రచయిత తెలియజేశారు. ‘తృతీయ’, ‘హృదయం’ మొదలైన పదాలను ‘త్రుతీయ’, ‘హ్రుదయం’ అని పలకగూడదని, ‘త్రితీయ’, ‘హ్రిదయం’ అని పలకాలని వివరించారు. రాసేటప్పుడు మాత్రం ‘తృతీయ’, ‘హృదయం’ అనే రూపాల్లోనే రాయాలని తెలిపారు. చాలామంది రాసే ‘తరుణోపాయం’ పద ప్రయోగం కూడా తప్పు అని, ‘తరణోపాయం’ సరైనదని పేర్కొన్నారు. అదేవిధంగా ‘హిందూత్వ’ శబ్దం కూడా చాలా చోట్ల వినిపిస్తుంది. అది కూడా తప్పుడు పదమేనని, ‘హిందుత్వ’ అనే పదం సరైనదని వివరించారు.

కొందరు కొన్ని ప్రత్యయాలను తప్పుగా వాడుతుంటారు. ఉదాహరణకు ‘సారూప్యం’, ‘తాదాత్మ్యం’, ‘నైపుణ్యం’, ‘వివక్ష’ మొదలైన నామవాచకాలకు ‘త’ అనే ప్రత్యయాన్ని చేర్చి, ‘సారూప్యత’, ‘తాదాత్మ్యత’, ‘నైపుణ్యత’, ‘వివక్షత’ అని రాయగూడదని ఎలనాగ నిక్కచ్చిగా పేర్కొన్నారు. తప్పుడు ప్రత్యయాన్ని ప్రయోగించడమూ కొన్ని చోట్ల కనబడుతుంది. ‘భర్తను ప్రియుడితో హత్య చేసిన భార్య’ అనే వాక్యంలో ‘తో’ అనే ప్రత్యయం వాడడం అసంబద్ధమని ఈ రచయిత తెలిపారు. ‘భర్తను ప్రియుడితో/ ప్రియుడి చేత హత్య చేయించిన భార్య’ అని రాయాలని సూచించారు. కొంతమంది పదాల వరుసను తప్పుగా రాస్తుంటారు. దాని వల్ల కొన్నిసార్లు మరో అర్థమూ ధ్వనించే అవకాశం ఉంటుంది.

ఒక్కోసారి ఆ వాక్యం తప్పు కాకపోయినా మరింత సమర్థవంతంగా భావాన్ని తెలియపర్చాలంటే పదాల వరుసను మార్చవలసి ఉంటుంది. అటువంటి అనేక వాక్యాలను ఉదాహరించారు ఎలనాగ. ఉదాహరణకు ‘కాసేపయ్యాక బజారుకు వెళ్లిన పిల్లవాడు తిరిగి వచ్చాడు’, ‘కాస్త పెదవులకు కోల్డ్ క్రీవ్‌ు రాసుకో’, ‘శూన్యంలోంచి అడిగిన వస్తువును తీసిచ్చే బాబా’ లాంటి వాక్యాలను ‘బజారుకు వెళ్లిన పిల్లవాడు కాసేపయ్యాక తిరిగి వచ్చాడు’, ‘పెదవులకు కాస్త కోల్డ్ క్రీవ్‌ు రాసుకో’, ‘అడిగిన వస్తువును శూన్యంలోంచి తీసిచ్చే బాబా’ అనే విధంగా రాయాలని పేర్కొన్నారు.

కొన్నిసార్లు నామవాచకాలను విశేషణాలుగాను, విశేషణాలను నామవాచకాలుగాను పొరబడి రాయడమూ కనబడుతుంది. ‘ెటల్ పరిసరాల్లో అపరిశుభ్రం’ అనే వాక్యంలో ఉన్న ‘అపరిశుభ్రం’ నామవాచకం కాదు. ఆ పదం విశేషణం. అందువల్ల ఆ వాక్యాన్ని ‘ెటల్ పరిసరాల్లో అపరిశుభ్రత’ అనిగాని, ‘ెటల్ పరిసరాలు అపరిశుభ్రం’ అనిగాని రాయాలని పేర్కొన్నారు. ‘వికృతం’ అనే విశేషణాన్ని నామవాచకంగా భ్రమిస్తామనేందుకు కూడా ఉదాహరణ ఇచ్చారు రచయిత. అందువల్లే ‘పరాకాష్ఠకు చేరిన వికృతత్వం’ అని రాయవలసిన వాక్యాన్ని ‘పరాకాష్ఠకు చేరిన వికృతం’ అని రాస్తున్నారని వివరించారు. ఈ కారణం వల్లే ‘మలినం పేరుకుపోయిన ప్రాంతాన్ని సందర్శించిన జి.హెచ్.ఎం.సి. కమీషనర్’ అనే వాక్యానికి బదులుగా ‘మాలిన్యం పేరుకుపోయిన….’ అని రాయాలని సూచించారు.

‘విశేషణాలకు బహువచనాలుంటాయా?’ అంటూ ఆసక్తికరమైన చర్చ లేవనెత్తారు ఎలనాగ. ఆంగ్లంలో ‘వండర్స్’ అనే పదం ఉంటుంది కానీ ‘వండర్‌ఫుల్స్’ అనే పదం ఉండదు కదా అంటూ ఆంగ్ల పదాలను తన వాదనకు సమర్థనగా తీసుకున్నారు. ఈ చర్చకు ముక్తాయింపు ఏమిటంటే టీవీల్లో కూడా తరచుగా వినబడే ‘ఆపాత మధురాలు’ అనే పద బంధం తప్పు అని. ఇక్కడ ‘మధురాలు’ అనే పదం సరైంది కాదని, ‘మాధుర్యాలు’ అనేది సరైనది అని తెలిపారు. ఈ పదబంధంలో ‘ఆపాత’ తప్పుగా ఉపయోగించిన పదమని, దీన్ని ‘ఆ పాత’ అని వేర్వేరుగా రాయాలని వివరించారు. వెరసి ‘ఆపాత మధురాలు’ అనే పదబంధాన్ని ‘ఆ పాత మాధుర్యాలు’ అని రాయాలని పేర్కొన్నారు. ‘భక్తి రంజని’ పదాన్ని వ్యుత్పత్తి సహాయంతో ఈ గ్రంథ రచయిత పరిశీలించారు. ‘భక్తిని రంజింపజేయడం’ అసంబద్ధమైన విషయంగా పేర్కొన్నారు. ‘భక్తులను రంజింపజేసేది’ అయితే ‘భక్త రంజని’ అని ఉండాలని అభిప్రాయపడ్డారు.

ఏకవచన నామవాచకాలకు ‘లు’ ను చేర్చడం ద్వారా బహువచనాలుగా మారుస్తాం. అయితే కొన్నిసార్లు ‘పోస్ట్‌మెన్’, ‘గన్‌మెన్’, ‘బ్యాట్స్‌మెన్’ మొదలైన బహువచన రూపాలకు కూడా ‘లు’ చేర్చి ‘పోస్ట్‌మెన్లు’/ ‘పోస్ట్‌మెన్‌లు’, ‘గన్‌మెను’్ల/ ‘గన్‌మెన్‌లు’ మొదలైన పదాలను వాడుతుంటాం. ఇలా రాయడం సరైనది కాదని తేటపర్చారు ఎలనాగ. రాసేవారిలో భాషాజ్ఞానంతో పాటు లోకజ్ఞానం కూడా అవసరమని పేర్కొంటారు ఎలనాగ. అందువల్లే ఈ గ్రంథంలో భాషకు సంబంధించిన విషయాలతో పాటు జనరల్ నాలెడ్జికి సంబంధించిన అనేక అంశాలను చర్చించారు. ఉదాహరణకు ‘మా నాన్నగారికి గుండెలో స్టంటు అమర్చారు’ అనే వాక్యం. నిజానికి ఈ వాక్యంలో ‘స్టంట్’ అని ఉన్నచోట ఉండవలసిన పదం ‘స్టెంటు’. ‘స్టంట్’ అంటే పోరాటం. సినిమాల్లో హీరో చేసే సాహసకార్యంలాంటిది. సాధారణ భాషా బోధకులు ఈ విషయం చెప్పి ముగిస్తారు.

కానీ ఈ రచయిత ఆ వాక్యంలో మరో తప్పును కూడా ఎత్తి చూపారు. అయితే అది భాషకు సంబంధించింది కాకపోవడం వల్ల భాషా బోధకుల దృష్టికి రాకపోవచ్చు. వచ్చినా ఆ విషయాన్ని వారు పెద్దగా లెక్కలోకి తీసుకోకపోవచ్చు. కానీ తప్పుల్లేకుండా రాయాలంటే కేవలం భాషపై మాత్రమే దృష్టిని కేంద్రీకరిస్తే సరిపోదు. అంశంపై కూడా దృష్టిపెట్టాలి. ఈ వాక్యంలో ‘స్టెంట్ పెట్టింది గుండెలో’ అని పేర్కొన్నారు. కానీ ‘గుండెలో’ అని కాకుండా ‘రక్తనాళంలో’ అని ఉండాలంటారు ఎలనాగ. ఇలాంటి సామాన్య పరిజ్ఞానం కూడా భాషా వ్యవహర్తలకు ఉండాలని ఆయన అభిప్రాయపడతారు.భాషాంశాలపై ఎలనాగ గతంలో రాసిన ‘భాషా సవ్యతకు బాటలు వేద్దాం’ అనే మరో చిన్న పుస్తకాన్ని ‘యుక్తవాక్యం’ గ్రంథానికి అనుబంధంగా చేర్చారు. అక్షర దోషాలను ఈ గ్రంథం ఎత్తిచూపుతుంది. అపసవ్యతకు దారి తీయకుండా ఉత్తమ వాక్యాలను ఏ విధంగా రాయాలో ఉదాహరణపూర్వకంగా వివరిస్తుంది.

భాషాపరంగా ఎన్నో వాక్యాల్లోని తప్పులను సహేతుకంగా చూపించడంతో పాటు, సరైన విధంగా రాసే పద్ధతిని కూడా విశ్లేషణాత్మకంగా వివరించారు రచయిత. వాక్యాల్లోని దోషాలను మొత్తం ఎనిమిది రకాలుగా వర్గీకరించి, అనేక సూచనలు చేశారు. భాషలో సందేహాలుండే వారికి బాసటగా నిలిచే గ్రంథమిది. పత్రికా రచయితలకు, భాషా వ్యవహర్తలకు అనేక విధాలుగా ఈ గ్రంథం ఉపకరిస్తుంది. భాషలో గజిబిజికి, గందరగోళానికి భరతవాక్యం పలుకుతుంది.

Much Water Has Flowed Under the Bridge