Home తాజా వార్తలు భారత అపర కుబేరుడు మళ్లీ ముకేశ్

భారత అపర కుబేరుడు మళ్లీ ముకేశ్

Mukesh Ambani

వరసగా 12వ సారి ఫోర్బ్ జాబితాలో అగ్రస్థానం
రెండో స్థానంలో అదానీ,17వ స్థానానికి పడిపోయిన అజీం ప్రేమ్‌జీ
తొలిసారి జాబితాలో చోటు దక్కించుకున్న బైజూ రవీంద్రన్

న్యూఢిల్లీ: భారత్‌లో అపరకుబేరుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు. 2018సంవత్సరానికి గాను ఫోర్బ్ మ్యాగజైన్ విడుదల చేసిన ‘భారతీయ సంపన్నుల’ జాబితాలో వరసగా 12వ సారి ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన సంపద విలువ 51.4 బిలియన్ డాలర్లుగా ఉంది. జియో రాకతో ముకేశ్ సంపద 4.1 బిలియన్ డాలర్లు పెరిగిందని ఫోర్బ్ మ్యాగజైన్ పేర్కొంది. ఇక అదానీ పోర్ట్ అధినేత గౌతమ్ అదానీ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఆయన సంపద 15.7 బిలియన్ దాలర్లుగా ఉంది.

కాగా గత ఏడాది ఫోర్బ్ భారతీయ సంపన్నుల జాబితాలో రెండో స్థానంలో నిలిచిన విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ ఈ సారి 17వ స్థానానికి పడిపోయారు. ఈ ఏడాది మార్చిలో అజీమ్ ప్రేమ్‌జీ తన సంపదలో అధిక భాగం స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకోసం విరాళంగా ఇచ్చేసిన విషయం తెలిసిందే. అంబానీ, అదానీల తర్వాత అశోక్ లేలాండ్ యజమానులు హిందుజా సోదరులు, పల్లోంజీ గ్రూపు అధినేత పల్లోంజీ మిస్త్రీ, ఉదయ్ కోటక్ తొలి అయిదు స్థానాల్లో నిలిచారు. ఉదయ్ కోటక్ టాప్ 5లో స్థానం సంపాదించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

బైజూ రవీంద్రన్‌కు చోటు
కాగా ఈ సారి ఫోర్బ్ సంపన్నుల జాబితాలో ఆరుగురు కొత్తవారికి స్థానం లభించింది. ప్రముఖ ఎడ్యుకేషన్ యాప్ బైజూ అధినేత బైజూ రవీంద్రన్ తొలిసారిగా ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు.1.91 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన 72వ స్థానంలో నిలిచారు. ఒక సాధారణ అధ్యాపకుడిగావిద్యార్థులకు పాఠాలు బోధించిన రవీంద్రన్..బైజూ యాప్‌ను ప్రారంభించి ఏడేళ్లలోనే బిలియనీర్‌గా ఎదిగారు.

Mukesh Ambani tops Forbes richest list for 12th year