Home జయశంకర్ భూపాలపల్లి ఎన్నికల్లో పొరపాట్లు జరగకుండా చూడాలి : కలెక్టర్ నారాయణరెడ్డి

ఎన్నికల్లో పొరపాట్లు జరగకుండా చూడాలి : కలెక్టర్ నారాయణరెడ్డి

Mulugu Collectorములుగు జిల్లా : ఈనెల 11 వ తేదీన జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏలాంటి పొరపాట్లు జరుగకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఎన్నికల సిబ్బందికి సూచించారు. మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నోడల్, సెక్టోరియల్ , తహసిల్దార్, ఎఁపిడిఒలతో నిర్వహించిన కోఆర్డినేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తన నియామవళి ఉల్లంఘన జరుగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ఈనెల 9 వ తేది సాయంత్రం 4 గంటల నుంచి 11 వ తేది సాయంత్రం 5 గంటల వరకు మద్యం షాపులను మూసివేయాలని ఆయన ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని, 9 వ తేది సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారం గడువు ముగిసిన నేపథ్యంలో  ర్యాలీలు సమావేశాలు నిషేధించడం జరిగిందని అన్నారు. జిల్లాలో 61 పోలింగ్ స్టేషన్ లో లైవ్ వెబ్కాస్టింగ్ చేస్తున్నామని, ఏలాంటి సమస్యలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలింగ్ స్టేషన్ లో పవర్ కట్ కాకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించుటకు విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకునే బాధ్యత సెక్టోరియల్ అధికారుల పై ఉందని అన్నారు. అన్ని పిఎస్ లలో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలని,  అదే విధంగా 108, 104 వాహనాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేస్తూ ఏలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని అన్నారు. ప్రతి పిఎస్ వద్ద బిఎల్‌ఓ అధికారి అందుబాటులో ఉండాలన్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థను పటిష్ట పర్చుకుని ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానిరి చొరవ చూపాలని చెప్పారు. పోలింగ్ స్టేషన్స్ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలన్నారు. ఇవిఎంల విషయంలో ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో ఓఎస్డీ సురేష్, నోడల్ అధికారులు, సెక్టోరియల్ అధికారులు, ఎంపిడిఓలు, తహసిల్దార్ లు తదితరులు పాల్గొన్నారు.

Mulugu Collector Comments on Loksabha Elections