Wednesday, November 6, 2024

ముంబయి మహారాష్ట్రలో భాగం.. ఎవరూ వేరు చేయలేరు

- Advertisement -
- Advertisement -

ముంబయి: ముంబయి మహానగరం ఎప్పటి నుంచో మహారాష్ట్రలో భాగమని, భవిష్యత్తులో కూడా దీన్ని ఎవరూ మార్చలేరని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్పష్టం చేశారు. ముంబయి నగరాన్ని కర్నాటకలో కలపాలంటూ కర్నాటక ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సావడి బుధవారం డిమాండు చేసిన నేపథ్యంలో అజిత్ పవార్ నుంచి గురువారం ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. సావడి డిమాండుపై బిజెపి తన వైఖరేమిటో స్పష్టం చేయాలని పవార్ డిమాండు చేశారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ భాగస్వామ్యంలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం అధికారంలో ఉంది. మహారాష్ట్రకు పొరుగున కర్నాటక సరిహద్దుల్లో మరాఠీ భాష మాట్లాడే ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యల దరిమిలా కర్నాటక ఉప ముఖ్యమంత్రి సావడి బుధవారం స్పందిస్తూ ముంబయిని కర్నాటకలో విలీనం చేయాలని, అప్పటి వరకు దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండు చేశారు.

ఈ వ్యాఖ్యలపై అజిత్ పవార్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ, మా ముఖ్యమంత్రి(ఉద్ధవ్ థాక్రే) చేసిన వ్యాఖ్యలపై కర్నాటక ప్రజలను సంతృప్తి పరచడానికే ముంబయి పేరును సావడి లేవనెత్తారు అని వ్యాఖ్యానించారు. ముంబయి మహారాష్ట్రకు చెందినది. ముంబయి నిన్న కూడా మాదే..నేడు కూడా మాదే..రేపు కూడా మాదే..దీన్ని ఎవరూ మార్చలేరు. ఈ విషయం అందరికీ తెలుసు. అందువల్ల ఆయన(సావడి) మాటలను పట్టించుకోనవసరం లేదు అంటూ పవార్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే చేసిన డిమాండుకు ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలన్న డిమాండుకు సంబంధం ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. అందులో ఎటువంటి హేతుబద్ధత లేదని, అది కేవలం కర్నాటక ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నమేనని పవార్ చెప్పారు. కర్నాటకలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలు తమకు చెందినవేనని చెప్పడానికి గతంలో కర్నాటక కొన్ని చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు. అయితే..ఆ ప్రాంతాలు తమకు చెందాలని కోరుతూ సుప్రీంకోర్టును మహారాష్ట్ర ఆశ్రయించిందని, రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడినపుడు కేంద్రం జోక్యం చేసుకుని దాన్ని పరిష్కరించాలన్నది మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదంపై బిజెపి తన వైఖరేమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండు చేశారు.

ఇదిలా ఉండగా, కర్నాటక ఉప ముఖ్యమంత్రి సావడి డిమాండుతో ఏకీభవిస్తారో లేదో చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, అసెంబీలో ప్రతిపక్ష బిజెపి నాయకుడు ఏవేంద్ర ఫడ్నవీస్‌ను మహారాష్ట్ర ఎన్‌సిపి ప్రతినిధి మహేష్ తాపసే డిమాండు చేశారు. మీరు మహారాష్ట్రతో ఉన్నారా లేక కర్నాటకతోనా అన్న విషయమై స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు.

Mumbai belongs to Maharashtra says Ajit Pawar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News