Saturday, April 20, 2024

ముంబైకి ఏడో విజయం

- Advertisement -
- Advertisement -

Mumbai Indians win over Chennai Super Kings

 

చెలరేగిన బుమ్రా, బౌల్ట్, రాణించిన డికాక్, కిషన్, చెన్నైపై ఇండియన్స్ గెలుపు

షార్జా: ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్ ఏడో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై పది వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తుగా ఓడించింది. 115 పరుగుల లక్ష్యాన్ని డిఫెండింగ్ చాంపియన్ 12.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండానే ఛేదించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, క్వింటన్ డికాక్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు ఘన విజయం అందించారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన కిషన్ 37 బంతుల్లోనే ఐదు సిక్సర్లు, మరో ఆరు ఫోర్లతో అజేయంగా 68 పరుగులు చేశాడు. మరోవైపు డికాక్ రెండు సిక్స్‌లు, ఐదు ఫోర్లతో 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో ముంబై జట్టుకి పొలార్డ్ సారధ్యం వహించాడు.

వణికించారు..

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (౦)ను ట్రెంట్ బౌల్ట్ ఔట్ చేశాడు. అప్పటికీ చెన్నై ఖాతానే తెరవలేదు. తర్వాతి ఓవర్‌లోనూ సిఎస్‌కెకు షాక్ తగిలింది. వన్‌డౌన్‌లో వచ్చిన స్టార్ బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు (2)ను బుమ్రా వెనక్కి పంపాడు. తర్వాతి బంతికే ఎన్.జగదీశన్ (౦)ను కూడా బుమ్రా ఔట్ చేశాడు. మరో ఓపెనర్ డుప్లెసిస్ (1)ను బౌల్ట్ పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో చెన్నై 3 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన రవీంద్ర జడేజా (7) కూడా నిరాశే మిగిల్చాడు. ఈ వికెట్ కూడా బౌల్ట్‌కే దక్కింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు. రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో 16 పరుగులు చేసిన ధోనీని రాహుల్ చాహర్ ఔట్ చేశాడు. ఆ వెంటనే దీపక్ చాహర్ (0) కూడా వెనుదిరిగాడు. అతన్ని కూడా చాహర్ ఔట్ చేశాడు. దీంతో చెన్నై 43 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.

కరన్ ఒంటరి పోరాటం

ఈ దశలో చెన్నై స్కోరు 70 దాటడం కూడా కష్టంగా కనిపించింది. అయితే యువ సంచనలం శామ్ కరన్ అసాధారణ పోరాట పటిమతో జట్టును ఆదుకున్నాడు. అతనికి శార్దూల్ ఠాకూర్ (11) అండగా నిలిచాడు. ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న కరన్ స్కోరును ముందుకు నడిపించాడు. మరోవైపు చెన్నై ఇన్నింగ్స్‌ను త్వరగా కుప్పకూల్చాలనే ప్రత్యర్థి బౌలర్ల వ్యూహాన్ని కరన్ సమర్థంగా తిప్పికొట్టాడు. అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచిన శామ్ కరన్ 47 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 52 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి ఔటయ్యాడు. కాగా తాహిర్ 13 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించడంతో చెన్నై స్కోరు 114 పరుగులకు చేరింది. ప్రత్యర్థి బౌలర్లలో బౌల్ట్ నాలుగు, రాహుల్, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News