Home తాజా వార్తలు ఇరు జట్లకూ పరీక్ష!

ఇరు జట్లకూ పరీక్ష!

vrt

నేడు బెంగళూరుతో ముంబయి ఢీ

బెంగళూరు: వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు మంగళవారం ముంబయి ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్ కీలకంగా మారింది. మరోవైపు ముంబయి కూడా వరుస పరాజయాలతో కొట్టు మిట్టాడుతోంది. అయితే చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించి జోరుమీదుంది. మరోవైపు కోల్‌కతాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు పరాజయం చవిచూసింది. దీంతో ముంబయితో జరిగే మ్యాచ్ కోహ్లి సేనకు కీలకంగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న రెండు జట్లకు వరుస ఓటములు వెంటాడుతున్నాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబయి ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం రెండింటిలోనే జయకేతనం ఎగుర వేసింది. బెంగళూరు కూడా ఏడింటిలో కేవలం రెండు మ్యాచ్‌లలోనే గెలిచింది. ఈ పరిస్థితుల్లో మంగళవారం జరిగే మ్యాచ్ రెండు జట్లకు చావోరేవోగా మారింది. డివిలియర్స్, కోహ్లి, మెకొల్లమ్, డికాక్, మన్‌దీప్ సింగ్, గ్రాండోమ్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లతో కూడిన బెంగళూరు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. దీంతో వరుస ఓటములు తప్పడం లేదు. అయితే ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా మళ్లీ గాడిలో పడాలని జట్టు తహతహలాడుతోంది. ఇక, ముంబయి కూడా కిందటి మ్యాచ్‌లో లభించిన గెలుపుతో జోరుమీదుంది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫాంలోకి రావడం జట్టుకు ఊరటనిచ్చే అంశం. సూర్యకుమార్, ఎవిన్ లెవిస్, హార్దిక్, కృనాల్ తదితరులతో ముంబయి బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా టాప్ ఆర్డర్ రాణిస్తే బెంగళూరును ఓడించడం రోహిత్ సేనకు కష్టమేమి కాదు.