Home కలం తీపి, చేదు వాస్తవాల మునగాల గాథల మాల

తీపి, చేదు వాస్తవాల మునగాల గాథల మాల

Story-Books

 

నైజాం రాజ్యంలో బ్రిటీష్ ద్వీపంగా మునగాల పరగణా చైతన్యంతో తొణికి సలాడిస్తుంది. నాటి మునగాల పాలకుడు నాయని వెంకటరంగారావు బహద్దూర్ నిజాం రాజ్యంతో అంటకాగాడు రైతు కూలీలను నానా యాగీ, యాతనలకు గురిచేసిండు. ఈ విషయాలన్నీ కనుమరుగై రాజా వారి వితరణలు, తెలుగు సాహిత్యసేవగా ఆయన ఆధ్వర్యంలో నెలకొల్పబడ్డ శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, కొమర్రాజు వెంకటలక్ష్మణ రావుగారికి ప్రోత్సాహం వంటివి మాత్రమే ప్రముఖంగా వెలుగులోకొచ్చాయి.

విజ్ఞులు నిన్నటిని విస్మరించరు. స్మరిస్తారు. నేటిని గుర్తిస్తారు రేపటిని దర్శిస్తారు. చరిత్రని బేరీజు వేస్తారు. ఇటువంటి కోవకు చెందినవారే గుడిపూడి సుబ్బారావు. ఆయన ఆలోచన ప్రతిరూపమే ‘మునగాల పరగణా కథలు గాథలు’ మునగాల పరగణా పాలకుల చరిత్రని పరిచయం చేసి ముక్తాయింపుగా వారన్న మాటలు ఆయన తాత్వికతని తెలిపేటివి. ఒక నాడు మేము తెలంగాణలోనే ఉంటామని ఎంతోకాలం పోరాడి ఓడిన భద్రాలచం ఏడు మండలాల ప్రజలను భద్రాచలం నుండి విడగొట్టి ఆంధ్రలో కలిపారు. ఏ గొడవా చేయని ఒకనాటి కృష్ణాజిల్లా మునగాల పరగణాను తెలంగాణలోనే వుంచారు. ఇదీ చరిత్ర పోకడ! ఎప్పుడు ఎలా! ఎందుకు ఏం జరుగుతుందో సామాన్య ప్రజలకు తెలియదు. సామాన్యులు జీవించడం కోసమే బతుకుతుంటారు. తమ వునికికే ప్రమాదం వాటిల్లినప్పుడు ఎంతకైనా తెగిస్తారు ఈ సామాన్యులు. సంపన్నులుబలవంతులు, మేధావులు, చరిత్రను తమ చర్యలతో ఈ సామాన్యులతో కలిసి అనేక మలుపులు తిప్పడంలో భాగస్వాములవుతారు ఎప్పుడో!”

ప్రస్తుతం తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోనిదైన మునగాల పరగణా నాడు బ్రిటీషాంధ్ర ప్రాంతంగా, మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేదన్న విషయం నేటి తరంలో చాలామందికి తెలియని సంగతి. చుట్టు పక్కల ప్రాంతం బ్రిటీష్ పాలనలో ఉండటం విచిత్రంగా తోస్తుంది. అంతకు మునుపు కుత్బుషాహీల, అసఫ్జాహీల పాలనలో ఉండింది. నైజాం రాజ్యంలో బ్రిటీష్ ద్వీపంగా మునగాల పరగణా చైతన్యంతో తొణికిసలాడిస్తుంది. నాటి మునగాల పాలకుడు నాయని వెంకటరంగారావు బహద్దూర్ నిజాం రాజ్యంతో అంటకాగాడు రైతు కూలీలను నానా యాగీ, యాతనలకు గురిచేసిండు. ఈ విషయాలన్నీ కనుమరుగై రాజావారి వితరణలు, తెలుగు సాహిత్యసేవగా ఆయన ఆధ్వర్యంలో నెలకొల్పబడ్డ శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, కొమర్రాజు వెంకటలక్ష్మణ రావుగారికి ప్రోత్సాహం వంటివి మాత్రమే ప్రముఖంగా వెలుగులోకొచ్చాయి.

గతానికి భిన్నంగా గుడిపూడి సుబ్బారావు మునగాల పరగణా, రాజావారి గురించి ప్రజల నోళ్లలో రాసిన గాథలను, కథలను చరిత్ర నేపథ్యంతో ప్రకటించాడు. మునగాల పరగణా పాలకుల చరిత్రను ముందుగా పరిచయం చేయడం వల్ల పుస్తకాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగడానికి సాఫీదనం ఏర్పడింది. మునగాల పరగణా చరిత్రను కుర్రా జితేంద్రబాబు గతంలో తెలిపినప్పటికీ, పూర్తి స్థాయిలో దాని చరిత్రను స్వకీయం చేసుకుని కథలుగా, గాథలుగా తవ్విపోసింది మాత్రం సుబ్బారావే. స్వాతంత్య్ర సమరయోధులు కోదాటి నారాయణరావు ‘చిన్ననాటి ముచ్చట్లు’లో రాజావారు బయట వారికే ఉదారులు. సంస్థాన ప్రజలకు చేసిందేమీ లేదన్నాడు. ఇదే విషయాన్ని రంగాచార్య ‘జీవనయానం’లోనూ ప్రస్తావించాడు ఈ కోవలోనే గుడిపూడి సుబ్బారావు రచన నాటి విషయాలని కథన రూపంలో వివరిస్తుంది. రచయిత ఈ ప్రాంతం వారు కావడం, కొన్ని సంఘటనలని కన్నవాడు, విన్నవాడు కావడం వల్ల స్థానిక సంగతులు, పలుకుబళ్లతో రచనకు నిండుదనం చేకూరింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఇక్కడ విస్మృతికిలోనైన అనేక విషయాలపై రచయితలు దృష్టి పెట్టారు. తమ స్థానికతని రచనల్లో బలంగా ప్రతిఫలింపజేస్తున్నారు. ఆ కోవకు చెందిన రచనల్లో మునగాల పరిగణా కథలుగాథలు ప్రత్యేకమైనవి. రచయిత సుబ్బారావు తన జీవితాన్నో, అనుభవాలనో కాకుండా మునగాల ప్రాంతీయుల్ని కథలుగా, గాథలుగా మలిచాడు. సాక్షీభూతుడుగా చిత్రించాడు. దీనిలోని కథాంశాలు చాలా వరకు రాజావారి గఢీతో ముడిపడినవి కావడం విశేషం. 302 పేజీలున్న ఈ గ్రంథంలో నలభై ఐదు కథాంశాలు ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో రాజకీయంగా చిత్రవిచిత్రమైన పరిస్థితులున్నాయి. నిన్నటిదాకా ‘మా నిజాం రాజు జన్మజన్మల బూజు’ అంటే, నేడు నిజాం అంతటోడు లేడని కీర్తించడం కనిపిస్తుంది. సుబ్బారావు మాత్రం చారిత్రక, సామాజిక వాస్తవాలనే చెప్పాడు. ప్రజల్ని పీడించే విషయంలో నిజాం ప్రభువు తొత్తయిన రాజా వెంకట రంగారావుని ఆయన చర్యల ఆధారంగా గుర్తించాడు. అవసరమైన చోట ఎత్తికూలేశాడు. దాచేస్తే దాగని సత్యాలు చెప్పాడు.

క్రీ.శ. 1622 నుంచే మునగాల చరిత్ర లభిస్తుందన్న విషయాన్ని రచయిత సష్టం చేశాడు. నలభై రెండు గ్రామాల మునగాల పరగణా నిజాం నవాబు చేత బ్రిటీష్ పాలకులకు బహుమతిగా ఇవ్వబడింది. రాజా నాయన వెంకట రంగారావు దాయాదుల పోరు మధ్య సంస్థానాధిపతి అయిన తీరుని తెలిపి, ఆయన జీవితంలో మరకలతో పాటు మెరుపులనీ ప్రకాశించింది. కొమర్రాజు వేంకట లక్ష్మణరావు విజ్ఞాన చంద్రికా మండలి రాజావారి చల్లని చూపుతో ప్రకాశించింది. అదే చూపు హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్ ఉచ్చస్థితికి చేరడానికి దోహదపడింది. ఉన్నవ లక్ష్మీ నారాయణగారి శారదా నికేతనానికి గుంటూరులో ఐదెకరాల స్థల వితరణ, ప్రఖ్యాత ఇంజనీర్ కె. యల్. రావు చదువుకి ఆర్థిక తోడ్పాటు, మునగాల సంస్థానంలో పింగళి వెంకయ గారు పత్తి వెంకయ్యగా ప్రసిద్ధుడైన వైనం వంటి విషయాలు చదువరులతో ఆసక్తిని కలిగిస్తాయి. అయ్యరదేవర కాళేశ్వర రావు, ఆచంట లక్ష్మీపతి, కట్టమంచి రామలింగారెడ్డి, వనపర్తి, గద్వాల సంస్థానాల రాజావార్లు నాయని వారికి సన్నిహితంగా మెలిగిన విషయాన్ని ప్రస్తావించాడు. విద్వత్ ప్రియుడిగా వెలుగొందిన రాజావారు సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతులమీదుగా కళాప్రపూర్ణ గౌరవం పొందడం ఆయనకు తగినదే. కానీ పరగణా ప్రజలను శిస్తుల పేరుతో పీల్చి పిప్పి చేశాడు.

ఈ వైవిధ్యాంశాలు ఈ రచన ద్వారా వెలుగులోకొచ్చాయి. మునగాల పరగణా కథలు గాథలులోని తెలివితేటలు ఎవడబ్బ సొమ్ము. సిద్ధార్థ కరువు, సావాసగాడు, పింగళి వెంకయ్యగారి దుస్థితి, ఇంగితం మర్చిపోయిన రాజావారు, ఉస్తాదొంక ఉస్తాద్, పైరవీకార్ ముంగలి కౌషయ్య, కోతికి పుండైతే గీకానాకా, సరస్వతీ నమస్తుభ్యం, ఆ ఒక్కరోజు, తిలా పాపం తలాపిడికెడు, అనుబంధాలు, అనేవి నాటి కాలిక స్థానిక సామాజికతలను నింపుకొన్నవి. కొన్నింటిలో రచయిత చమత్కారం ప్రియత్వం గోచరిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో గొప్ప వ్యక్తిగా, కార్యశీలిగా, వితరణ శీలిగా, అభ్యుదయవాదిగా పేరుగడించిన రాజావారు మునగాల పరగణా ప్రజల్లో అప్రతిష్ట మూటగట్టుకున్న తీరుని రచయిత పలు సందర్భాల్లో యాది చేశాడు. కష్టజీవుల జీవతాల్ని అల్లోకల్లోలం చేసిన కాలం.తెలంగాణ ప్రజానీకం చేసిన సాయుధ పోరాటం ఫ్రెంచి విప్లవం కంటే తక్కువదేం కాదన్న సుబ్బారావు వ్యాఖ్య అక్షర సత్యం. తెలంగాణ రైతాంగ పోరాటం దేశమంతటా ఎంతోమందికి స్ఫూర్తి నింపిన పోరాటం. ఈ రచన ద్వారా సిరిపురం గడీ, రేపాల లక్ష్మీ నరసింహ స్వామి తిరునాళ్లు , నడిగూడెం గడీ వంటి స్థానిక ప్రదేశాల ప్రాధాన్యం లోకానికి తెలిపింది. సంపన్న రైతులు కొల్లు పాపయ్య చౌదరి, కోటయ్య , వెంకయ్యల ఔదార్యం, మల్లం పాపన్న, కస్తూరి రంగయ్య, బచ్చు నరసయ్య వంటి వారి విశిష్టత హృదయాన్ని తడుతుంది.

మునగాల పరగణాకు పక్కనే ఉన్న అన్నవర గూడెంలో పుట్టి పెరిగిన సుబ్బారావు గారికి స్థానికతను కథలుగాథల్లో చిత్రీకరించడానికి సాధికారతని పరిసరాలే కల్పించాయి. పరగణా ప్రజల కష్టసుఖాలు, ఆర్థిక వనరుగా ఎక్కువమంది భూమిని నమ్ముకొని బతకడం, నాటి సంక్షుభిత స్థితిగతులను చాలా వరకు వెలికి తీశారాయన. ఇటువంటి ప్రయత్నం ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. ఆ క్రెడిట్ అంతా పరగణా కథాశిల్పిగా సుబ్బారావుకే దక్కుతుంది. రాజావారి వ్యక్తిగత జీవిత విషయాలను తెలిపినప్పుడు, ప్రజల గోసం గురించి వివరించినప్పుడు సుబ్బారావు లోకజ్ఞత హృదయార్త్రత ఆవిష్కృతమయ్యాయి. గురజాడ వెంకట అప్పారావు రాసినట్టు

“ పట్టమేలే రాజు గర్వం
మట్టి గలిసెను, కోట పేటలు
కూలి పిల్లల కాట పట్లై అమరె
పట్టమేలే రాజు పోయెను
మట్టి కలిసెను కోట పేటలు
పద్యం పద్యం పట్టి నిలిచెను
కీర్తులపకీర్తుల్‌”, దానికి తార్కాణమే గుడిపూడి సుబ్బారావు మునగాల పరగణా కథలు గాథలు అన్న విషయం చదివితే గ్రహిస్తారు.

                                                                                  – డా॥ కొల్లు వెంకటేశ్వరరావు

Munagala Paragana stories Kathalu Book