Home ఖమ్మం ఉద్రిక్తత

ఉద్రిక్తత

మున్సిపల్ కార్మికుల సమ్మెపై ఖమ్మంలో విపక్షాల భారీ ప్రదర్శన
కలెక్టరేట్ వద్ద నాయకులు, పోలీసులకు తోపులాట
నేతల అరెస్టు – నిరసనగా రాస్తారోకో
నిరంకుశ పాలన : అజయ్
కెసిఆర్ ఏకపక్ష ధోరణి : బాగం

DSC_1910ఖమ్మం కలెక్టరేట్ : కార్మికుల సమ్మెకు మద్దతుగా మంగళవారం ఖమ్మంలో విపక్షాలు భారీ ప్రదర్శన నిర్వహించాయి. సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ ఎన్‌డి, కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్ సిపి నేతలు, కార్యకర్తలు ప్రదర్శనలో పాల్గొన్నారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయం ఎదుటు ఐదో రోజు దీక్షలను సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు, ఎన్‌డి రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్ ప్రారంభించారు. దీక్షా శిబిరం నుంచి ప్రారంభమైన ప్రదర్శన బస్టాండ్, జడ్‌పి సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు చేరుకుంది. ఆందోళనకారులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకుని పోయే ప్రయత్నం చేశారు. పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

DSC_1965పోలీసులు కలెక్టరేట్ గేట్లు మూసివేసి రోప్ పార్టీల సాయంతో ఆందోళన కారులను నిలువరించే ప్రయత్నం చేశారు. ముందుగా స్థానిక శాసన సభ్యులు పువ్వాడ అజయ్ కుమార్‌తో సహా సిపిఐ, సిపిఎం, ఎన్‌డి, టిడిపి తదితర పార్టీలకు చెందిన నేతలను అరెస్టు చేశారు. నేతల అరెస్టులను కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులు కార్యకర్తలను ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేశారు. పోలీసు వాహనాలకు కార్యకర్తలు అడ్డుగా కూర్చోవడంతో పోలీసు అసహనంగా మహిళలని కూడా చూడకుండా ఈడ్చేశారు. పలు వాహనాల్లో ఆందోళనకారులను అరెస్టు చేసి ఖమ్మం అర్బన్ పోలీసు స్టేషన్‌తో సహా పట్టణంలోని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. నేతల అరెస్టును నిరసిస్తూ కార్యకర్తలు అర్బన్ పోలీసు స్టేషన్ ఎదుట రాస్తారోకో చేపట్టారు. వారిని కూడా అరెస్టు చేశారు.
నిరంకుశ పాలన : ఎంఎల్‌ఎ అజయ్
DSC_1946రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతుందని ప్రజల సమస్యలను పట్టించుకునే స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి లేడని ఖమ్మం శాసన సభ్యులు పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. ఆందోళనకారులను ఉద్దేశించి అజయ్‌కుమార్ మాట్లాడుతూ నెల రోజుల నుండి మున్సిపల్, పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వానికి కనీస స్పందన లేదన్నారు. కార్మికులను దేవుళ్లని పొగిడిన నోటితోనే విమర్శలు చేస్తున్నాడని అన్నారు. ప్రజా సమస్యలను విస్మరించి పాలన సాగిస్తున్న కెసిఆర్ తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఇప్పటికైనా మున్సిపల్, పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు.
ఏకపక్ష ధోరణి : బాగం
కెసిఆర్ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ బడుగు, బలహీన వర్గాలపై తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నాడని సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు ఆరోపించారు. ప్రతిపక్షాలను దూషించడమే లక్షంగా పెట్టుకున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నపుడు అవసరమైన సంఘాలు ఇప్పుడు దిక్కుమాలిన సంఘాలుగా మిగిలాయా అని హేమంతరావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎన్నికైన తర్వాత కెసిఆర్ గతాన్ని మరిచిపోతున్నాడని తెలంగాణ సాధించిన ప్రజలు కెసిఆర్‌ను గద్దె దించేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. అన్ని ప్రభుత్వ కార్పొరేషన్ రంగాల్లో కెల్లా అతి తక్కువ వేతనం పొందుతున్న అట్టడుగు కార్మికుల పట్ల కొనసాగుతున్న ప్రభుత్వ వివక్షకు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు, ఎన్‌డి రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్, టిడిపి జిల్లా అధ్యక్షులు తుళ్లూరి బ్రహ్మయ్య, వైఎస్‌ఆర్ సిపి నాయకులు మందడపు వెంకటేశ్వర్లు తదితరులు ప్రసంగించారు.

ఈ ఆందోళన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పోటు ప్రసాద్, శింగునర్సింహారావు, కార్యవర్గ సభ్యులు పోటు కళావతి, ఎస్‌కె.జానిమియా, మహ్మద్ సలాం, తాటి వెంకటేశ్వర్లు, జిల్లా సమితి సభ్యులు బి.జి.క్లెమెంట్, మేకల శ్రీనివాసరావు, యానాలి సాంబశివారెడ్డి, తాటి నిర్మల, సిపిఎం జిల్లా నాయకులు కల్యాణం వెంకటేశ్వరరావు, అప్రోజ్ సమీన, ఆ పార్టీ డివిజన్ నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, కోదాటి గిరి, ఎన్‌డి ఖమ్మం డివిజన్ నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య, కాంగ్రెస్ జిల్లా నాయకులు కొత్త సీతారాములు, కూల్‌హోం ప్రసాద్, శాసన మండలి మాజీ సభ్యులు పోట్ల నాగేశ్వరరావు, టిడిపి జిల్లా కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, వైఎసిపి నాయకులు వై.శ్రీను తదితరులు పాల్గొన్నారు.