72 పట్ణణాల్లో 2,523 మహిళా గ్రూపులకు నిధులు
1.20 లక్షల స్వయం సహాయక గ్రూపులకు రూ. 472.80 కోట్లు
3958 మురికివాడల సమాఖ్యలకు రూ. 65.34 కోట్లు
69 పట్టణాల్లో ఏర్పడాల్సిన సెల్ప్ హెల్ప్ గ్రూపులు
హైదరాబాద్ : పట్టణాల్లో పేదరిక నిర్మూలనకు పురపాలక శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. ఈ మేరకు పట్టణాల్లోని ప్రతి మురికివాడల్లోని మహిళల ఆర్థికాభివృద్ధికి స్వయం సహాయక బృందాలు(సెల్ఫ్ హెల్స్ గ్రూప్)ను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని పట్టణాల్లో ఈ బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే, మొత్తం 141 పట్టణ ప్రాంతాల్లో 72 పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లోనే 75 నుంచి 100 శాతం వరకు స్వయం సహాయక బృందాలు ఏర్పడ్డాయి. మిగతా 69 మున్సిపాలిటీల్లో వివిధ స్థాయిలో ఉన్నాయి. 67 పురపాలక సంఘాల పరిధిలో 0 నుంచి 25 శాతం బృందాలున్నాయి.
ఒక మున్సిపాలిటీలో 26 నుంచి 50 శాతం, ఒక మున్సిపాలిటీలో 51 నుంచి 75 శాతం మాత్రమే స్వయం సహాయక గ్రూపులున్నాయి. అధికంగా జిహెచ్‌ఎంసి పరిధిలోనే 1149, వరంగల్‌లో 187, మహబూబ్‌నగర్ 65, కరీంనగర్‌లో 54, నిజామాబాద్‌లో 52 గ్రూపులు ఏర్పడ్డాయి. అయితే, పురపాలికలకు ఎన్నికలు జరిగి పాలక వర్గాలు ఏర్పడిన నేపథ్యంలో అన్ని మున్సిపాలిటీల్లోని మురికివాడల్లో ఈ బృందాలు ఏర్పాటు చేసి, అక్కడి మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు జరిగేలా ప్రణాళికలను సిద్దం చేసే యోచనలో పురపాలక విభాగమున్నది.
2867 గ్రూపులు లక్ష్యంగా
గత ఏడాది వరకు పురపాలక 72 పురపాలక సంఘాల పరిధిలో మొత్తం 2,867 స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ భావించింది. అయితే, 2,707 గ్రూపులను మాత్రమే ఏర్పాటు జరిగినట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇందులో లబ్ది పొందిన గ్రూపులు 2,523 ఉన్నాయి. ఎల్లందులో 1, హుజురాబాద్‌లో 2, మణుగూరు 2, పాల్వంచలో 3, మందమర్రిలో 3 స్వయం సహాయక గ్రూపులున్నాయని రికార్డులు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం మరో 69 పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో గ్రూపలను ప్రోత్సహించాల్సి ఉన్నది. ప్రస్తుతం కొత్త పురపాలక సంఘాలకు పాలక వర్గాలు వచ్చిన నేపథ్యంలో ఆయా పట్టణాల్లోని మురికివాడలను గుర్తించాల్సి ఉన్నది. వాటిల్లోని మహిళలను స్వయం సహాయక గ్రూపులుగా ఏర్పాటు చేసి వారికి ఆర్థికాభివృద్ధి సాధించేందుకు బ్యాంక్‌ల నుంచి రుణాలు, పొదుపు చేయడం వంటివి క్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నది.
1.20 లక్షల గ్రూపులకు రూ. 472.80 కోట్లు..
పట్టణ పేదరిక నిర్మూలణ బృందం ద్వారా ప్రతి పట్టణంలోని మురికివాడల్లోని పేద మహిళలు 10 నుంచి 20 మంది కలిసి స్వయం సహాయక బృందాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారు 20 స్వయం సహాయక బృందాలు కలిసి మురికివాడ స్థాయి సమాఖ్యగా ఏర్పడుతాయి. 25 నుంచి 35 వరకు మురికివాడల స్థాయి సమాఖ్యలు కలిసి పట్టణ స్థాయి సమాఖ్యలు ఉంటాయి. ఇందులోని మహిళలలు బ్యాంక్‌లో పొదుపు చేయడం, రుణాలను తీసుకోవడం, రాయితీలు పొందడం వంటివి ఉంటాయి.
ఫలితంగా మహిళల ఆర్థికాభివృద్ధి జరుగుతుందనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యంగా ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 12.6 లక్షల మంది మహిళలు 1.20 లక్షల స్వయం సహాయక బృందాలుగా ఉన్నారు. ఈ 1.20 లక్షల స్వయం సహాయక గ్రూపులు రూ. 472.80 కోట్లు రుణ లావాదేవీలను నెరుపుతున్నాయి. 3958 మురికివాడల సమాఖ్యలు రూ. 65.34 కోట్లు రుణంగా పొందినట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. 97 పట్టణ స్థాయి సమాఖ్యలు రూ. 2.07 కోట్లు రుణంగా పొందినట్టు సమాచారం. కొత్తగా 69 పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు మరిన్ని నిధులు చేకూర నున్నాయి. పట్టణ ప్రగతి పథకం కూడా వీరి ఆర్థికాభివృద్ధికి, మురికివాడల్లో మౌలిక సదుపాయాల కల్పన జరుగనున్నది.