Home తాజా వార్తలు రియల్ ఎస్టేట్ వ్యాపారిపై హత్యాయత్నం

రియల్ ఎస్టేట్ వ్యాపారిపై హత్యాయత్నం

Murder

 

నర్సంపేట : రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఓ ముగ్గురు యువకులు అతి దారుణంగా కత్తులతో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో బుధవారం సంచలనం కలిగించింది. సినీఫక్కీలో కళ్లలో కారం చల్లి వేట కొడవల్లతో అతిదారుణంగా దాడి చేస్తుండగా అడ్డువచ్చిన అతని భార్యపై కూడా దాడిచేశారు. ఈ హత్యాయత్నం ఉధంతంపై అతని భార్య, పోలీసుల తెలిపిన కథనం ప్రకారం… నర్సంపేట పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన అంబటి వెంకన్న అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతని భార్య విజయ బుధవారం తెల్లవారుజామున వాకింగ్‌కు వరంగల్ రోడ్డు వైపు వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా వచ్చి కళ్లలో కారం చల్లి వేట కొడవలితో తనపై దాడిచేశారు.

అతని పక్కనే ఉన్న భార్య విజయ అడ్డు వచ్చి నా భర్తను చంపకండీ అని వేడుకోగా ఆమెపై కూడా దాడిచేశారు. తీవ్ర గాయాల పాలైన వెంకన్న చనిపోయాడనుకుని ఆ నిందితులు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. రహదారి వెంట ఉన్న వాకర్స్ గమనించి నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి రెఫర్ చేయగా అక్కడ వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం వెంకన్న పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. వెంకన్నపై హత్యాయత్నానికి ప్రధానంగా భూ తగాదాలే కారణమని పోలీసులు తెలిపారు. పట్టణంలోని కుమ్మరికుంటలోని సర్వే నెంబరు 132, 133లోని ఎకరంన్నర భూమి వివాదంలో ఉంది.

సుమారు రూ. 3.50 కోట్ల విలువ చేసే ఆ భూమి గత కొంత కాలంగా వివాదంలో ఉండగా కోర్టులో సైతం కేసు నడుస్తుంది. దాంతోపాటు మహబూబాబాద్ రోడ్డులోని 113/బి సర్వే నంబరులోని 130 గజాల భూమి సుమారు రూ. 40 లక్షల విలువ చేస్తుంది. ఆ భూమి కూడా వివాదంలో ఉంది. గత కొంత కాలంగా ఈ భూముల విషయంలో పలుమార్లు గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో గండి కమల్ అనే వ్యక్తి వెంకన్నను హతమార్చితే భూములన్నీ తన సొంతమవుతాయని ఆశించి మరో ఇద్దరి సాయంతో గత వారం రోజులుగా వెంకన్న కోసం రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్‌తో బుధవారం తెల్లవారుజామున హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇదిలా ఉండగా వెంకన్న భార్య విజయ తన భర్తపై హత్యాయత్నానికి పాల్పడిన ఈ ముగ్గురి వెనకాల మరికొంత మంది హస్తం ఉందని వారి ప్రోత్సాహంతోనే నా భర్తపై హత్యాయత్నం జరిగిందని బోరున విలపిస్తు విలేకరులకు తెలిపారు. ఈ ఘటనపై నర్సంపేట సీఐ కరుణసాగర్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

ఉలిక్కిపడ్డ నర్సంపేట
నర్సంపేట పట్టణంలో బుధవారం తెల్లవారుజామున కత్తులతో ఓ వ్యక్తిపై అతి దారుణంగా దాడిచేశారనే సంఘటన దావాణంలా వ్యాపించింది. ఎంతో ప్రశాంతంగా ఉన్న నర్సంపేట పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇటీవల కాలంలో ప్రశాంత వాతావరణం ఉన్న నర్సంపేటలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. హత్యాయత్నం చేసిన నిందితులు నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోవడం దిగ్భ్రాంతికి గురిచేసింది.

Murder Attempt on Real estate Dealer