Friday, March 29, 2024

మిస్టరీ మర్డర్లకు కేరాఫ్.. నల్లమల

- Advertisement -
- Advertisement -

అక్కమహాదేవి గుహలే కేంద్రంగా హత్యలు
ఇష్టదేవత అక్కమహాదేవికి నరబలులు..?
2017లో ముగ్గురు మహిళల పుర్రెలు లభ్యం
కర్నాటక లేదా మహారాష్ట్ర వాసులుగా అనుమానం
నేటికి మిస్టరీగానే మిగిలిన పుర్రెల సంఘటన
వెలుగు చూస్తున్నవి కొన్ని
ఘాతుకాలు మరెన్నో?
అమావాస్య రోజు అక్కమహాదేవి గుహల్లోపూజలు
నల్లమల అటవీ ప్రాంతంలో
వెలుగుచూస్తున్న హత్య సంఘటనలు
జనవరి 25న మహిళా హత్య సంఘటనలో నిందితుడు

మిస్టరీ హత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నల్లమల అడవులు మారాయి. ఇతర రాష్ట్రాల నుంచి శ్రీశైలంకు వస్తున్న వారు ఇక్కడ హత్యలు చేసి చట్టం నుంచి తప్పించుకునేందుకు ఎత్తులు వేస్తున్నట్లు సంఘటనలను బట్టి స్పష్టమవుతుంది. మరో పక్క క్షుద్ర పూజలతో పాటు నరబలులకు కేంద్రంగా అక్కమహాదేవి గుహలు మారాయనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అతీత శక్తులను పొందాలనే మూఢనమ్మకాలతో అక్కమహాదేవికి కర్ణాటకకు చెందిన మూఢ భక్తులు కొందరు అమావాస్య నాడు క్షుద్ర పూజలతో పాటు యువతులను నరబలికి వినియోగిస్తున్నారనే పుకార్లు ఈ ప్రాంతంలో శికార్లు చేస్తున్నాయి. 2017లో అక్కమహాదేవి గుహలలోనే మూడు మనిషి పుర్రెలు లభ్యం కాగా అవి మూడు కూడా మహిళలవిగా అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

అప్పటి సంఘటనలు ప్రస్తుతం గత నెల 25న జరిగిన శాంతారవిముదియార్ హత్యాచారం సంఘటనను పోల్చుకుంటే అమాయక మహిళలను లొంగదీసుకొని తమ కామవాంఛను తీర్చుకోవడానికి అక్కమహాదేవి గుహలను ఎంచుకున్నారా… ? అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వచ్చే మహిళా భక్తులను లొంగదీసుకొని చడిచప్పుడు కాకుండా అటవి ప్రాంతం మార్గంలో వారిని హతమార్చడం వంటి ఘటనలు చోటు చేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. అక్కమహాదేవి గుహలలో కర్ణాటకకు చెందిన అక్కమహాదేవి అక్కడ తపస్సు చేసినట్లు కర్ణాటక భక్తులు పూజలు నిర్వహిస్తారు. శివుడి కోసం చేసిన తపస్సులో అక్కమహాదేవికి గొప్ప చరిత్ర ఉండడంతో భక్తులు అనేక మంది కర్ణాటక నుంచి అక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తారు. మరికొందరు అతీత శక్తుల కోసం మహిళలను అమావాస్య రోజు బలి ఇవ్వడం ద్వారా క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ముంబాయికి చెందిన శాంతాముదియార్ హత్య ఘటనలో సీసీ కెమెరాలు నిందితుడిని పట్టివ్వడంతో ఈ సంఘటన హాత్యాచారం ఘటనగా రుజువైంది.

గతంలో అక్కమహాదేవి గుహలలో లభించిన పుర్రెలకు సంబంధించిన ఘటన సైతం ఈ కోణంలోనే జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి శ్రీశైలం వద్ద సాధు వేషాధారణలతో ఉంటున్న వ్యక్తులు ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు వెలుగుచూడడంతో గతంలో జరిగిన ఘటనలో సైత ఇలాంటి వ్యక్తుల ప్రమేయం ఉండి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆలయాల వద్ద బిక్షాటన చేసుకుంటూ కాలం వెల్లదీసే కొందరు వ్యక్తులు గంజాయి లాంటి మత్తుకు బానిసలుగా మారి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ మాసంలో దోమలపెంట వద్ద శ్రీశైలం బ్రిడ్జి పైన తెల్లవారు జామునే ఒక వ్యక్తిని హత్య చేసి కృష్ణానదిలో పారవేసిన ఘటన విధితమే. ఇప్పటివరకు ఆ హత్య కేసులో నిందితులు ఎవరో తేలలేదు. హత్యగాంవించబడిన వ్యక్తిని సైతం పోలిసులు గుర్తించలేదు. హత్యగావించబడిన వ్యక్తి కర్ణాటక లేదా మహారాష్ట్రా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నల్లమల చిట్టడవిలో, కృష్ణానదిలో ఇలాంటి హత్యా సంఘటనలు మరెన్నో జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అందులో వెలుగు చూస్తున్నవి కొన్నేననే ప్రచారం జరుగుతుంది. అక్కమహాదేవి గుహల వద్ద, అక్కడికి వెళ్ళే దారి వెంట పోలిసులు నిఘా పెట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కృష్ణానది తీరం వెంట అక్కమహాదేవి కొండల వరకు, నడక దారిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఆ ప్రాంతంలో కొత్త వ్యక్తులు సంచరించిన మహిళలతో అనుమానాస్పదంగా వ్యక్తులు కనిపించిన పోలిసులకు సమాచారాన్ని అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైన ఉంది. అదే విధంగా కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు. పూజలు, క్షుద్ర పూజలతో సొమ్ము చేసుకుంటున్న నకిలి సాధువులను గుర్తించి వారి పై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైన ఉంది. అదే విధంగా అనుమానస్పదంగా వాహనాలను అడవుల మధ్యలో దిగేవారి సమాచారాన్ని ఆయా ప్రాంతాలలో ప్రయాణికులను చేరవేసే ఆటోలు, ఇతర వాహనదారులతో సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాబట్టి అలాంటి వారి పై నిఘాపెట్టాల్సిన అవసరం ఎంతైన ఉందని ప్రజలు కోరుతున్నారు.
శాంతారవి ముదియార్

హత్యానిందితుడు సాధువు

ఇదిలా ఉండగా గత నెల 25వ తేదిన మహారాష్ట్రలోని నవి ముంబాయికి చెందిన శాంతారవిముదియార్ (52) శ్రీశైలంకు రాగా దైవదర్శనాలను చేయిస్తానని తమిళనాడుకు చెందిన 65 ఏళ్ళ రామకృష్ణ అలియాస్ మట్క స్వామి, అలయాస్ తిలక స్వామి అనే సాధువు నమ్మించాడు. అక్కడి నుంచి అక్కమహాదేవి గుహలకు దర్శన నిమిత్తం కాలినడకన అటవిమార్గం ద్వారా తీసుకెళ్ళాడు. మార్గం మధ్యంలోనే ఆమె పై కామవాంచను తీర్చుకోవడానికి యత్నించగా ఆమె తిరగబడింది. దీంతో తన వద్ద నిమ్మకాయలు కోసే కత్తితో కడుపులో పొడిచి గొంతుకోసి హత్య చేసినట్లు పోలిసుల విచారణలో నిందితుడు ఒప్పుకున్నట్లు సమాచారం.

అంతటితో ఆగకుండా ఆమెను వివస్త్రను చేసి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. అనుమానం రాకుండా ఆమె వద్ద ఉన్న వస్తువులను దూరంగా పారవేశాడు. ఫిబ్రవరి 2వ తేదిన అటవి శాఖ సిబ్బంది ఫైర్‌లైన్ పనుల నిమిత్తం అడవిలోకి వెళ్లగా దుర్వాసన రావడంతో అక్కడికి వెళ్ళి మహిళా శవాన్ని గుర్తించి పోలిసులకు సమాచారం అందించారు. పోలిసులు సంఘటన స్థలానికి వచ్చి పరీక్షించగా ఆ కొద్ది దూరంలోనే ఆమెకు సంబంధించి ఆదార్, ప్యాన్‌కార్డులు లభించడంతో నవిముంబాయికి చెందిన శాంతారవిముదియార్‌గా పోలిసులు గుర్తించి విచారణ చేపట్టగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి హత్యాచారం ఘటనకు సంబంధించి అచ్చంపేట డిఎస్పీ నర్సింహులు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిందితుడిని విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా నల్లమలలో జరుగుతున్న హత్యా సంఘటనల పై నిఘా పెట్టి నిందితుల ఆట కట్టించాలని ప్రజలు కోరుతున్నారు.

 

Murder case news telugu
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News